వివక్షను జయించిన న్యాయకోవిదుడు

ABN , First Publish Date - 2021-02-27T06:27:58+05:30 IST

పేదరికం, సాంఘిక వివక్షను అధిగమించి సమున్నత ఆశయాల సాధనలో ప్రయోజనకరమైన ఫలితాలను సాధించిన న్యాయదురంధరుడు పి. శివశంకర్. ప్రజాజీవితంలో మొదటి నుంచి చివరి వరకు సామాజిక న్యాయసాధనకే...

వివక్షను జయించిన న్యాయకోవిదుడు

పేదరికం, సాంఘిక వివక్షను అధిగమించి సమున్నత ఆశయాల సాధనలో ప్రయోజనకరమైన ఫలితాలను సాధించిన న్యాయదురంధరుడు పి. శివశంకర్. ప్రజాజీవితంలో మొదటి నుంచి చివరి వరకు సామాజిక న్యాయసాధనకే ఆయన అంకితమయ్యారు. మా నాన్నగారు పి. శివశంకర్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. బాల్యంలో, యవ్వనంలో సైతం చాలాకాలం ధనలేమితో బాధపడ్డారు. అయితే న్యాయవాదిగా విజయ శిఖరాలను అధిరోహించినప్పుడు, ఆ తరువాత కేంద్రమంత్రిగా దేశంలోనే రెండో అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా వెలుగొందినప్పుడు సొంత శ్రేయస్సుకు గాక సమాజ అభ్యున్నతికే ప్రాధాన్యమిచ్చారు. చరిత్ర వంచితులకు న్యాయం చేసేందుకే ఆయన తన ప్రతిభాపాటవాలను వినియోగించారు. కీలక బాధ్యతలకు అర్హులను గుర్తించి ప్రోత్సహించారు. 


న్యాయవాదిగా ధనార్జన కంటే వృత్తిధర్మ నిర్వహణే ముఖ్యమని మా నాన్నగారు భావించారు. కక్షిదారులు ఫీజు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఉచితంగా వాదించేవారు. మానవతా విలువలతో న్యాయవాద వృత్తిని ఆచరించిన ఉదాత్తుడు ఆయన ఏ రంగంలో అయితే తన ధీశక్తితో జీవితోన్నతిని సాధించారో ఆ రంగంలో ఆయనకు న్యాయంగా దక్కవలసిన సముచిత స్థానం విషయంలో తీవ్ర వివక్షకు గురయ్యారు. తొలుత పేదరికం, ఆ తరువాత వివక్ష మా నాన్నగారిని తీవ్రంగా వేధించాయి.

 

సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి రావడమే ఆయన నేరమా? అభిజాత్య వర్గాల వారు మా నాన్నగారి ప్రతిభా సామర్థ్యాలను కించపరిచారు. న్యాయవాదిగానే కాదు, కేంద్రమంత్రిగా కూడా ఆయన అన్యాయానికి గురయ్యారు. రాజీవ్‌గాంధీ దురదృష్టకర దురంతం అనంతరం ఆయన ప్రధానమంత్రి కాకపోవడానికి ఆ సామాజిక వివక్షే కారణం. ఈ చేదు వాస్తవాన్ని మా నాన్నగారు (ఇంకా ప్రచురితం కాని) తన ఆత్మకథలో కూడా ప్రస్తావించారు. 


ప్రజాజీవితంలో మా నాన్నగారు అసమానతల నిర్మూలన, సామాజిక న్యాయసాధనకు అంకితమయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవీబాధ్యతలను చేపట్టిన మరుక్షణమే బిపి మండల్‌తో చర్చలు జరిపారు. విద్యా ఉద్యోగాలలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ల విషయమై తన సిఫారసులను సత్వరమే సమర్పించాలని మండల్‌ను కోరారు. సిఫారసులను సమగ్రంగా, పటిష్ఠంగా ఉండేందుకు మండల్‌కు ఆయన తగు సూచనలు చేశారు. రాష్ట్రాలలోని ఉన్నతన్యాయస్థానాలలో, న్యాయమూర్తుల నియామకాలలో ఆధిపత్యకులాల వారి ప్రభావాన్ని తగ్గించేందుకు మా నాన్నగారు కృషి చేశారు. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలకు బదిలీ చేసే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. న్యాయమూర్తుల నియామకాలు నిష్పాక్షికంగా జరగాలన్నదే ఆయన సంకల్పం. దళిత, మైనారిటీ, వెనుబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన న్యాయవాదులను న్యాయమూర్తులుగా ఎంపిక చేసేందుకు ఈ విధానం ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన భావించారు. మా నాన్నగారు ప్రవేశపెట్టిన విధానం ఇప్పటికీ అమలులో ఉండడం ఆయన వృత్తిపరమైన దార్శనికతకు ఒక తార్కాణం. ఆయన ద్వారా న్యాయవ్యవస్థలో ఉన్నతస్థానాలను అధిష్ఠించిన వారిలో జస్టిస్ రామస్వామి, జస్టిస్ బాలకృష్ణన్ కూడా ఉన్నారు. ఈ ఇరువురూ షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు. వీరి ఉన్నతి మా నాన్నగారి విశాల దృక్పథానికి నిదర్శనం. 


విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించి అమలుపరచాలని మానాన్నగారు ఆయనకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడుగా ఉన్న మా నాన్నగారితో సంప్రదించిన మీదట మండల్ నివేదికలో మార్పులు చేర్పులు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1990 ఆగస్టు 6న రాజ్యసభలో మండల్ సిఫారసులను సమర్థిస్తూ నాన్నగారు రెండు గంటల పాటు ప్రసంగించారు. మూడురోజుల అనంతరం లోక్‌సభలో మండల్ నివేదికను రాజీవ్‌గాంధీ వ్యతిరేకించినప్పుడు మ నాన్నగారి ఉపన్యాసాన్ని ఉటంకిస్తూ విపి సింగ్ సమాధానమిచ్చారు. వెనుకబడిన వర్గాల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయించేందుకు మా నాన్నగారు శాయశక్తులా కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాల పాటు కొనసాగిన అనంతరం 2004 సార్వత్రక ఎన్నికల సందర్భంలో ఆ పార్టీ నుంచి ఆయన వైదొలిగారు. కాంగ్రెస్ లోని బ్యాక్‌వర్డ్ క్లాసెస్ సెల్ చైర్మన్‌గా తన సిఫారసుల మేరకు ఆ వర్గాలవారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వనందుకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు. ప్రజాజీవితంలో మొదటి నుంచి చివరివరకు సామాజిక న్యాయసాధనకు అంకితమైన ఉదాత్తుడు పి. శివశంకర్.


డాక్టర్ పి. వినయ్ కుమార్

(నేడు శివశంకర్‌ వర్ధంతి)

Updated Date - 2021-02-27T06:27:58+05:30 IST