అనుమతులు తూచ్‌

ABN , First Publish Date - 2020-08-12T11:27:23+05:30 IST

వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలంటే అందుకు ముందస్తు అనుమతి అవ సరం.

అనుమతులు తూచ్‌

యథేచ్ఛగా లే అవుట్లు

పట్టించుకోని అధికారులు

అదాయ వనరుగా మారిన వైనం

ప్రభుత్వ ఆదాయానికి గండి


త్రిపురాంతకం, ఆగస్టు 11: వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలంటే అందుకు ముందస్తు అనుమతి అవ సరం. దీని కోసం ప్రభుత్వానికి కొంత సొమ్ము చెల్లించి అనుమతి పొందిన తరువాత మాత్రమే వ్యవసాయ భూమిని మార్పు చేయాలి. అయితే, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలతో పాటు, ప లు గ్రామాలలో అలా అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా లే అ వుట్లు వేసి క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. 


వైపాలెంలో పెద్ద ఎత్తున లే అవుట్లు వేస్తున్నా 90 శాతం లే అవుట్లకుఅనుమతి లేదు. దోర్నాలలో సుమారు 63 ఎకరాల్లో వేసిన లే అవుట్లకు రూ. 85 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. పెద్దారవీడు మండలంలో వందల ఎకరాల్లో అక్రమ లే అవుట్లు వేసినా ఆధికారులు ఆవైపుగా చూడటంలేదు. త్రిపురాంతకం మండలంలో గతంలో వేసిన లే అవుట్లకు అధికారులు ఫీజులు వసూలు చేశారు. ప్రస్తుతం మళ్ళీ నూతన లే అవుట్లు భారీగా వెలుస్తున్నాయి. పుల్లలచెరువులో లే అవుట్లు తక్కువగానే ఉన్నా ప్రభుత్వ భూమిని ఆక్రమించి లే అవుట్లు వేస్తున్నారు. 


పంచాయతీల అనుమతులు లేకుండా ప్లాట్లు

నియోజకవర్గంలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయి స్తున్నారు. రెవెన్యూ, గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా తమ వ్యాపారం సాగిస్తున్నారు. రియల్‌ భూమ్‌ సృష్టిస్తూ ప్రభుత్వం నియ మించిన నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. అయితే, పలుచోట్ల సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు, నాయకులకు ఇది వరంగా మారుతుంది. లే అవుట్లలో సగానికి కూడా ముంద స్తు అనుమతులు తీసుకోవడంలేదు. 


నిబంధనలు ఇవీ..

నిబంధనల ప్రకారం తొలుత వ్యవసాయ భూమిని ఇళ్ళ స్థలాలు, ప్లాట్లుగా లే అవుట్లు వేయటానికి భూమి మార్పిడికి రెవిన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. భూమి విలువలో పది శాతాన్ని చెల్లించాలి. తరువాత ఖాళీ భూమిలో లే అవుట్లు వేయటానికి స్థానిక పంచాయతీకి ధరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు లే అవుట్‌ ఫీజు కింద ఎకరాకు గ్రామ స్థాయిని బట్టి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత ధరఖాస్తును జిల్లా టౌన్‌ అండ్‌ కంట్రి ప్లానింగ్‌ అధికారులకు పంపిస్తారు. అక్కడ నిర్ణీత ఫీజు చెల్లిస్తే తాత్కాలిక అనుమతి ఇస్తారు. తాత్కాలిక అనుమతి వచ్చిన తరువాత లే అవుట్లు వేయాలి. 18 అడుగులకు తగ్గకుండా అంతర్గత రోడ్డు, ప్రధాన రహదారి, డ్రైనేజీ వేయాలి. పది శాతం భూమిని సామాజిక అవసరాలకు కేటాయించాలి. అప్పుడే లే అవుట్‌కు తుది అనుమతి వస్తుంది. ఆతర్వాత ఇళ్ళ స్థలాలు, ప్లాట్లను ప్రజలకు విక్రయించాలి. 


స్థిరాస్థి వ్యాపారుల్లో చాలా మంది నిబంధనలు పాటించటం లేదు. నే రుగా ఇళ్ళ స్థలాల విక్రయాలను జరుపుతున్నారు. విషయం తెలియని ప్రజలు స్థలాలను కొనుగోలు చేసి భవనాలు నిర్మిస్తున్నారు. దీంతో పంచాయతీలకు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది.


అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి.. కిరణ్‌, తహసీల్దారు, త్రిపురాంతకం

వ్యవసాయ భూమిలో లే అవుట్లు వేసేందుకు తప్పనిసరిగా రెవెన్యూ, పంచాయతీల అనుమతులు తీసుకోవాలి, నిర్ణీత ఫీజులు చెల్లించాలి. మండల పరిదిలో దాదాపు అన్ని లే అవుట్లకు ఫీజులు వసూలు చేశాం. ఇంకా అనుమతులు లేకుండా ఏమైనా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-08-12T11:27:23+05:30 IST