Advertisement
Advertisement
Abn logo
Advertisement

కా‘లేజీ’ క్లాసులు.. వేధిస్తున్న అధ్యాపకుల కొరత

  • మూడు జిల్లాలో 18,500 కొత్త అడ్మిషన్లు


ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అందుకనుగుణంగా లెక్చరర్లు లేకపోవడంతో బోధనలు కుంటుపడుతున్నాయి. ఆయా కళాశాలల్లో అతిథి అధ్యాపకుల (గెస్ట్‌ లెక్చరర్లు) నియామకం కూడా పూర్తి కాకపోవడంతో విద్యార్థుల హాజరుశాతం అంతంత మాత్రంగానే ఉంటోంది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఆశించిన మేరకు బోధనలు జరగడంలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌ జిల్లాలో 2021- 22 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని 22 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో ప్రభుత్వ విద్యార్థులు 7,910, సెకండియర్‌లో 6,782 మంది చదువుతున్నారు. మేడ్చల్‌లోని 5 కాలేజీల్లో ఫస్టియర్‌లో 2,397, సెకండియర్‌లో 1,646, రంగారెడ్డి జిల్లాలోని 15 కళాశాలల్లో 6,300, 4,560 మంది విద్యాభ్యాసం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 


అడ్మిషన్లు ఫుల్‌.. అరకొర బోధనలు

గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లోని 42 ప్రభుత్వ కాలేజీల్లో గత జూలై నుంచి నవంబర్‌ 20 వరకు 18,500 కొత్త అడ్మిషన్లు జరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో గరిష్ఠగా 12,650 మంది అడ్మిషన్‌ పొందినట్లు వారు పేర్కొంటున్నారు.

 ఓ వైపు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. పాఠాలు బోధించే లెక్చరర్లు లేకపోవడంతో ప్రణాళిక ప్రకారం తరగతులు నిర్వహించడంలేదని తెలుస్తోంది. గత అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు 2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వారందరూ సెకండియర్‌ క్లాసులకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ గణితం, ఫిజికల్‌ సైన్స్‌, కెమిస్ర్టీ, ఇంగ్లిష్‌ లెక్చరర్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు.


పూర్తి కాని గెస్ట్‌ లెక్చరర్ల నియామకం

శాశ్వత లెక్చరర్లు లేని ప్రభుత్వ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల(గెస్ట్‌ లెక్చరర్ల)తో కొంతకాలంగా బోధనలు అందిస్తుంటారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా విధులకు దూరంగా ఉన్న వారిని తిరిగి తీసుకునేందుకు ఇంటర్‌ విద్యా అధికా రుల ఆదేశాల మేరకు ప్రిన్సిపాళ్లు ఇటీవల కాలేజీల వారీగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా, పలు కళాశాలల్లో ఇంటర్వ్యూలు పూర్తిచేసినప్పటికీ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో 2020 మార్చిలో కరోనాకు ముందు 46 మంది పనిచేశారు. ఇక్కడ పనిచేస్తున్న శాశ్వత అధ్యాపకుల్లో కొందరు ఉద్యోగ విరమణ పొందగా, మరి కొందరు పదోన్నతులపై వెళ్లారు. 


దీంతో ఈసారి 74 మందిని తీసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించినా, 52 మందిని విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ జిల్లాలో 107 మంది కావాల్సి ఉండగా, 80 మందికి ఇంటర్వూలు చేపట్టినట్లు తెలిసింది. జిల్లాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అతిథి అధ్యాపకులను పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆశించిన మేరకు బోధనలు జరగడంలేదని తెలుస్తోంది. ఇంటర్‌ బోర్డు ఉన్నతా ధికారులు స్పందించి గెస్ట్‌ లెక్చరర్ల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన బోధనలు అందించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. 

Advertisement
Advertisement