నేతలు మాజీలైపోతారు... రచయితలే నిత్యసంజీవులు

ABN , First Publish Date - 2021-10-18T08:38:08+05:30 IST

ఢిల్లీలో సెప్టెంబరు 18, 19వ తేదీల్లో నేను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నప్పుడు, సెప్టెం బరు 19 సాయంత్రం ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్‌ వారు నాకు సన్మానం చేశారు....

నేతలు మాజీలైపోతారు... రచయితలే నిత్యసంజీవులు

ఢిల్లీలో సెప్టెంబరు 18, 19వ తేదీల్లో నేను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నప్పుడు, సెప్టెం బరు 19 సాయంత్రం ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్‌ వారు నాకు సన్మానం చేశారు. ఆ సందర్భంగా నేను దాదాపు నలభై నిమిషాల దాకా ప్రసంగించాను. ఆధునిక తెలుగు సాహిత్య పరిణామాలపై, ఆయా అంశాలను ప్రస్తావిస్తూ నా అభిప్రాయాలు వ్యక్తం చేశాను. ముఖ్యంగా 1965-75 మధ్య కాలంలో, ఆనాటి కాంగ్రెస్‌ పాలకుల నిషేధాలను నిర్బంధాలను ఎదుర్కొంటూ రచయితలు-మేధావులు ధైర్యంగా నిబద్ధతతో తమ భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకొన్నారని, కాని ఇప్పుడు మన ఉభయ రాష్ట్రాలలో రచయితలు-మేధావులు పురస్కారాలకు పదవులకు అర్రులు చాస్తూ, పాలక పక్షాలకు లోబడి తమ స్వేచ్ఛను కోల్పోతున్నారని అన్నాను. అలానే రచనా పరంగానే కాకుండా సామాజిక క్రియాశీలత పాటిం చవలసిన ఈ దశలో, కొందరు రచయి తల్లో హిపోక్రసి-ఆత్మవంచన రాజ్యమేలు తున్నదని, ప్రజాస్వామిక హక్కుల హన నాన్ని ప్రశ్నించకుండా సగంమంది రచ యితలు రాజ్యానికి అమ్ముడుపోయారని నా ఆవేదన వెలిబుచ్చాను. 


ఆ తర్వాత సెప్టెంబరు 20 నాటి ఆంధ్ర జ్యోతిలో నా సన్మాన సభ గురించి ప్రచు రితమైన వార్తలో పాక్షికంగానే ఉటంకించ బడిన నా ప్రసంగ భాగం వల్లన కొంత అస్పష్టత చోటు చేసుకున్నది. అదే రోజు ఏబీఎన్‌ టీవీ ఛానల్‌లో ఇదే అంశంపై చర్చ కూడా సాగింది. ఇక వరసగా నాకు వచ్చిన ఫోన్‌ కాల్స్‌లో- కొందరు ప్రముఖులు, సీనియర్స్‌, అలానే ఆయా ప్రాంతాల నుంచి రచయితలు నా ఆవేదన సమంజసమైనదేనని స్పందించారు. ఇదే క్రమంలో ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీ ‘వివిధ’ సెప్టెంబరు 27నాటి సంచికలో తొమ్మిది మంది కవులు-విమర్శకులు ప్రతిస్పందించారు. 


ప్రస్తుతం కొందరైనా తమ మౌనం-తటస్థతను విడనాడి మాట్లాడుతున్న నేపథ్యంలో మరింత వివరంగా-స్పష్టంగా ఈనాటి స్థితిని వివరిస్తున్నాను. 


ఈనాటి జనాకర్షక రాజకీయాలతో, మెజారిటీవాదంతో మన ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది. రైతాంగానికి-జన సామాన్యులకు ప్రతికూలంగా ఉన్న చట్టాలను ప్రశ్నించినా, పాలకుల అవినీతిని ఎత్తిచూపినా- ‘అర్బన్‌ నక్సల్స్‌’గా ముద్రవేసి, రాజద్రోహమనే చట్టాన్ని విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు. ఈ అభద్రతా వలయాన్ని ఛేదించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసే శక్తి వున్న రచయితలు-మేధావులు మౌనంగా వుండిపోతున్నారు. తటస్థత వహిస్తున్నారు. దీనితో కేంద్రంలో రాష్ట్రంలో పాలకులు నియంతలుగా మారిపోతున్నారు. 


ఈ స్థితిలో ప్రజాపక్షం వహించే రచయితలు-మేధావులు తమ అంతరాత్మననుసరించి నిజాయితీగా రచనలు చేయాలి. కానీ వారు ద్విముఖ-త్రిముఖ పాత్రలు వహిస్తున్నారు. పీడించే పాలకులను-పీడనకు గురైన ప్రజలను (వేటగాడిని - వేటాబడు తున్న జీవిని) అంతే చాకచక్యంగా కీర్తిస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. వృత్తి కవులు- కళాకారులైనా, వాగ్గేయకారు లైనా- కనీస నైతికతను, సామా జిక బాధ్యతను విస్మరిస్తే ప్రజలు తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. 


ఇక మన వర్తమాన కాల పరిస్థితుల్లో వివిధ సంస్థలు- వ్యక్తుల ట్రస్టులు-ప్రభుత్వ నిధులతో నడిచేవి ఆయా రంగాలలో నైపుణ్యతను సాధించి నవారిని సత్కరించి పురస్కారాలు అందజేస్తున్నాయి. చివరికి ఈ దేశంలోని భారీ కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు భారీ ఎత్తున ‘లిటరరీ ఫెస్టివల్స్‌’ నిర్వహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ, సాహిత్య తిరునాళ్లల్లో రచయితల ‘గ్లామర్‌’ను పెంచుతు న్నాయి. ముఖ్యంగా ఇంగ్లీషులో రాసే ఒక ‘ఎలీట్‌’ రచయితల వర్గంవారు బాగా ప్రచారం పొందగలుగు తున్నారు. యేటా ఇంగ్లీషుతోపాటు భారతీయ భాషల్లో వచ్చిన నవలలకు 25లక్షల రూపాయల బహుమతి అందజేస్తున్న కొత్త కార్పొరేట్‌ సంస్థలు ఉనికిలో ఉన్నాయి. 


కేంద్ర సాహిత్య అకాడమి విషయానికొస్తే- 22 భారతీయ భాషలకు తనదైన సంస్థాగత పద్ధతిలో సేవ చేస్తున్నది. గత 65సంవత్సరాలకు పైగా ఇంగ్లీషు-హిందీ ద్వైమాసిక పత్రికలను ప్రచురిస్తున్నది. గ్రౌండ్‌ లెవెల్‌ స్థాయి నుంచి ముగ్గురు సభ్యు లుండే జ్యూరి ద్వారా, ఆయా భాషల రచయితల గ్రంథాలకు అవార్డులు ప్రదానం చేస్తున్నది. అనువాదాలు, పురస్కారాలు తదితర కార్యకలాపాలన్నీ పారదర్శకంగానే సాగుతున్నాయి. ప్రతి భాషకు ఒక సలహా సంఘం పని చేస్తున్నది. అకాడమీ అధ్యక్షుడితోపాటు జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులు-కన్వీనర్లు వోటింగ్‌ ద్వారా ఎన్నుకొంటున్నారు. 1991-96 మధ్య కాలంలో ప్రొ. భద్రి రాజు కృష్ణమూర్తిగారు కన్వీనర్‌గా వున్న ఆనాటి తెలుగు సంఘం (అడ్వయిజరీ బోర్డు)లో నేను కూడా ఒక సభ్యుడినే- ఒక స్వయం ప్రతిపత్తి గల సాహిత్య అకాడమీగా, వివిధ భావజాల రచయితలకు అఖిల భారత స్థాయి వేదికగా కొనసా గుతున్నదనే వాస్తవాన్ని అందరూ గుర్తించారు. 


ఇక అవార్డులు (పురస్కారాలు) స్వీకరించడం అనైతికం కాదు- ఆత్మవంచనా కాదు- ఏ సంస్థలు ఎవ్వరికి ఎందుకోసం అవార్డులు ఇస్తున్నాయో అందరికీ తెలుసు. ప్రతి రాజకీయ వ్యవస్థలో తమ ప్రచారానికి- తమ వర్గ ప్రయోజనాల దృష్ట్యా అనాది నుంచి కవులను కళాకారులను పాలకులు పోషిస్తూనే ఉన్నారు. అయితే వర్తమాన స్థితిలో మన రాజ్యాంగ ఆదేశిక సూత్రాల కనుగుణంగా, ప్రజాస్వామిక విలువలను నిరంతరం జాగరూకతతో రక్షించుకోవలసిన బాధ్యత రచయితలపై ఉన్నది. ప్రజల గొంతుగా, అనధికార ప్రతిపక్షంగా రచయితలు ఆచరణలో తమ రచనా నిబద్ధతను నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడింది. అవార్డులు పొందినా, పదవులు చేపట్టినా ఎవరి పక్షాన మిగిలిపోయారన్నది ముఖ్యం- సెల్ఫ్‌ ప్రమోషన్‌ దారి తప్పకుండా, మాతృ భాషకు ఏమేరకు సేవ చేసారన్నదే గీటురాయి. 


మతం-కులం తదితర వైరుధ్యాల మధ్య మరింతగా మానవ సంబంధాల అవిచ్ఛిన్నతను కాపాడవలసిన బాధ్యత రచయిత లపై, మేధావులపై ఉంది. అక్షర సాధనలో నిమగ్నమైన సృజ నాత్మక రచయితలంతా తమ వర్గ దృక్పథంతో సాహిత్య ప్రమా ణాలతో- కళాత్మక తాత్విక భావనలతో కలకాలం నిలిచిపోతారు. ఆయా దశల్లో రాజకీయాలద్వారా పాలకులుగా శాసించినవారు ‘భూత్‌పూర్వ’ (మాజీలు)గా మిగిలిపోతే, రచయితలు తమ సృజనాత్మక రచనల ద్వారా తరతరాలుగా ‘అభూత్‌ పూర్వ’ (నిత్యసంజీవులు)గా ఆలోచనలను ప్రేరేపిస్తూ ఉంటారు. అక్షరానికి మరణం ఉండదు.

నిఖిలేశ్వర్‌

91778 81201


Updated Date - 2021-10-18T08:38:08+05:30 IST