మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు: ఫరూక్

ABN , First Publish Date - 2021-12-11T21:42:54+05:30 IST

రాజకీయనేతలు మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా..

మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు: ఫరూక్

శ్రీనగర్: రాజకీయనేతలు మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సూచించారు. మతాన్ని, రాజకీయాలను వేర్వేరుగా చూడకపోతే దేశం మనుగడ సాగించలేదన్నారు. కశ్మీర్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారంనాడు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారని, ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. కశ్మీర్ పండిట్లు, కశ్మీర్ ముస్లింల మధ్య సమస్యలు సృష్టిస్తున్నారని, జమ్మూకశ్మీర్‌లో హిందువులు, ముస్లింల మధ్య విద్వేష వ్యాప్తి వల్ల మన శత్రువులు ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. మహిళా హక్కుల బిల్లును వాళ్లు ఎందుకు పార్లమెంటులో ఆమోదించడం లేదని ఫరూక్ అబ్దుల్లా కేంద్రాన్ని నిలదీశారు. పార్లమెంటులో వారికి 300 మంది సభ్యుల బలం ఉందని, అయినప్పటికీ మగవారితో సమానంగా మహిళలకు హక్కులు ఇవ్వడం వారికి ఇష్టం లేదని తప్పుపట్టారు.


కాగా, రెండ్రోజుల క్రితం షేర్-ఇ-కశ్మీర్ భవన్‌లో జరిగిన జేకేఎన్‌సీ ఎస్‌సీ సెల్ కన్వెన్షన్‌లోనూ ఆయన పరోక్షంగా బీజేపీని తప్పుపట్టారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాజకీయ ప్రయోజనాలు ఆశించి వాళ్లు మతం కార్డు బయటకు తీస్తారని, మతం ప్రమాదంలో పడిందంటూ చెబుతుంటారని అన్నారు. ''రాముడికి, అల్లాకి వచ్చే ప్రమాదం అంటూ ఏమీ లేదు. రాజకీయనాయకులకు ఉండొచ్చేమో'' అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-11T21:42:54+05:30 IST