కూటమిని గౌరవించని పార్టీలతో పొత్తు వద్దు

ABN , First Publish Date - 2021-01-10T13:35:12+05:30 IST

అన్నాడీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, డీఎండీకేల తీరుపై సర్వసభ్య మండలి, కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో పార్టీ సీనియర్‌ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమిని ...

కూటమిని గౌరవించని పార్టీలతో పొత్తు వద్దు

బీజేపీ తీరుపై ఆగ్రహం

సర్వసభ్యమండలి సమావేశంలో అన్నాడీఎంకే నేతలు


చెన్నై: అన్నాడీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, డీఎండీకేల తీరుపై సర్వసభ్య మండలి, కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో  పార్టీ సీనియర్‌ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమిని నాయకత్వం వహిస్తున్న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని ప్రకటించడంపై బీజేపీ అదేపనిగా చేస్తున్న విమర్శలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదంటూ సీనియర్‌ నేతలు, కొందరు మంత్రులు సలహా ఇచ్చారు. వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి కల్యాణమండపంలో  జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశంలో ఎన్నికల పొత్తు, ప్రచారం, శశికళ విడుదల తదితర అంశాలపై చర్చించారు.   సీనియర్‌ నాయకురాలు వలర్మతి మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీఎంకే అడ్రస్‌ లేకుండా పోతుందన్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు కేపీ మునుసామి మాట్లాడుతూ కూటమిలోని బీజేపీ అధిక సీట్ల కోసం పట్టుబట్టడం సరికాదన్నారు. 


మళ్లీ అమ్మ పాలనే

ఎడప్పాడి పళనిస్వామి ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మునుపటి కంటే అత్యధిక సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని, మూడోసారి అమ్మ పాలనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇక మూడు నెలలే మిగిలివుందని ఈ నేపథ్యంలో సర్వసభ్య మండలి సభ్యులంతా జిల్లాలవ్యాప్తంగా పర్యటించి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచి పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పన్నీర్‌ సెల్వం ప్రసంగిస్తూ పార్టీ అధినేత్రి జయలలిత మృతి తర్వాత చెక్కుచెదరకుండా నాయకులు, కార్యకర్తలంతా ఐకమత్యంతో అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు.  


రామలక్ష్మణులు వీరే...

సర్వసభ్య మండలి సమావేశంలో పలువురు సీనియర్‌ నేతలు మాట్లాడుతూ  ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం రామలక్ష్మణుల్లా పార్టీ అభివృద్ధి కోసం పాడుపడుతున్నారని ప్రశంసించారు. ఈ రామ లక్ష్మణుల ఎదుట రావణుడిలా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ముందుకొస్తున్నాడన్నారు. ఎన్నికల తర్వాత డీఎంకే కథ పరిసమాప్తమవుతుందన్నారు.


జయ మృతికి సంతాపం

ఈ సమావేశంలో దివగంత మాజీ ముఖ్యమంత్రి జయ మృతికి సంతాపం వ్యక్తం చేసూ తీర్మానం ప్రతిపాదించారు. ఆ సందర్భంగా సభ్యులంతా లేచి జయకు నివాళిగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కేంద్ర మాజీ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, హిందూ మున్నాని నేత రామగోపాలన్‌, మాజీ మంత్రి దురైకన్ను తదితర నేతలు సహా 115 మంది మృతికి సర్వసభ్య మండలి సమావేశం సంతాపం ప్రకటించింది.  


మాస్కులతో హాజరు

సర్వసభ్య మండలి సమావేశం అంతటా కరోనా వైరస్‌ నిరోధక నిబంధనలను పాటించారు. సభకు విచ్చేసిన సభ్యులందరూ మాస్కులు ధరించారు.  తమకు కరోనా పాజిటివ్‌ లేదని వైద్యులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు చూపిన సభ్యులను మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతించారు. కల్యాణమండపం వెలుపల శానిటైజర్లు ఉంచారు. భౌతికదూరం పాటించి క్యూలో నడిచి సభ్యులంతా సభాప్రాంగణంలోకి ప్రవేశించారు. 


దారి పొడవునా ఆటాపాటా

అన్నాడీఎంకే సర్వసభ్య మండలికి వెళుతున్న పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, మంత్రులకు ఘనస్వాగతం పలుకుతూ పూందమల్లి హైరోడ్డు నుంచి వానగరం వరకూ దారిపొడవునా వేలాదిమంది కార్యకర్తలు పార్టీ పతాకాలు చేతపట్టుకుని ఘనస్వాగతం పలికారు.  అరుంబాక్కం, కోయంబేడు, నెర్‌కుండ్రం, మదురవాయల్‌ తదితర ప్రాంతాలలో రోడ్డు పక్కనే చిన్న చిన్న వేదికలు ఏర్పాటై కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పలుచోట్ల మైక్‌సెట్లను అమర్చి ఎంజీఆర్‌, జయలలిత నటించిన సినిమా పాటలు, అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార పాటలను వినిపించారు.

Updated Date - 2021-01-10T13:35:12+05:30 IST