తగ్గేదేలె..!

ABN , First Publish Date - 2022-01-17T04:03:04+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..

తగ్గేదేలె..!

  • ‘అసెంబీ’్లపై నేతల ‘గురి’
  • ఎన్నికల సన్నాహాల్లో తలమునకలు 
  • అసెంబ్లీ వైపు ఎంపీలు, ఎమ్మెల్సీల ‘చూపు’
  • ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్న నేతలు 
  • మళ్లీ జనం మధ్యలోకి మాజీ నేతలు
  • పోగొట్టుకున్న చోటే అదృష్టం వెతుక్కుంటున్న నాయకులు 
  • కొడంగల్‌ లేదా ఎల్‌బీనగర్‌ నుంచి ‘రేవంత్‌’ పోటీ! 
  • మేము సైతమంటున్న ‘నేతల వారసులు’ 


అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను బలపర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. సొంత పార్టీలో టికెట్‌ దొరకకుంటే ఇతర పార్టీల నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం సాగుతుండడంతో ఆయా పార్టీల నేతలు సమయాత్తమవుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఇంకా కార్యరంగంలోకి దిగనప్పటికీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటినుంచే ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయారు. కొన్నాళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కొందరు నేతలు తమకు పట్టున్న నియోజకవర్గాల్లో కేడర్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం అసెంబ్లీపై గురిపెడుతుండడం గమనార్హం. ఇంకా తమ పదవులకు చాలాకాలం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. టికెట్లు పొందేందుకు, ఎన్నికల్లో గెలుపుకోసం ఎంతకైనా సిద్ధపడుతున్నారు. అసెంబ్లీ టిక్కెట్ల కోసం అధికార పార్టీలో డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆశలు మాత్రం వదులుకోవడం లేదు. తమకు తమ పార్టీలో అవకాశం దొరకకపోతే ఏదైనా పార్టీ నుంచి బరిలో దిగాలనుకుంటున్నారు. ముఖ్యంగా కొంతకాలం పదవులకు దూరంగా ఉన్న సీనియర్‌ నేతలు ఈసారి ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటు న్నారు. కొందరు ఇప్పటి నుంచే క్యాంప్‌ ఆఫీ్‌సలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడిజిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ‘సై’ అంటున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 

వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కొడంగల్‌ లేదా ఎల్‌బీనగర్‌ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రంజిత్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం వస్తే పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయన నగర శివార్లలో ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే పలువురు ఎమ్మెల్సీలు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు. ఇందుకోసం ముందునుంచే కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా తమ పదవీ కాలం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకే మొగ్గుచూపుతున్నారు. తన రాజకీయ జీవితం ముడిపడి ఉన్న తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముందస్తుగానే ఎన్నికల ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.  ఇప్పటికే ఆయన తాండూరు శివార్లలో క్యాంప్‌ఆఫీస్‌ నిర్మాణ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మరో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు కూడా పార్టీ అధినాయకత్వం అవకాశం ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన టికెట్‌ ఆశించారు. సీఎం కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే శంభీపూర్‌రాజు పార్టీ అధినాయకత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక  మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈసారి ఉమ్మడి జిల్లాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే మాజీ జడ్పీచైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం కూడా వచ్చే ఎన్నికల్లో  అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 


‘సై’ అంటున్న నేతల వారసులు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పలువురు ముఖ్యనేతల వారసులు ‘సై’ అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల కుమారులు సైతం వచ్చే ఎన్నికల్లో బరిలోకి సిద్ధమవుతున్నారు. గతంలో వీరిలో కొందరు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసినా అదృష్టం వెక్కిరించింది. ఇపుడు మరోసారి బరిలో దిగి లక్కును పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇందులో మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌, మాజీ జడ్పీచైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ సోదరుని కుమారుడు వీరేష్‌ ఉన్నారు. వీరిలో కార్తీక్‌రెడ్డి 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కార్తీక్‌రెడ్డి ఇపుడు నగర శివార్లలో ఎక్కడైనా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ కూడా 2014లో చేవెళ్ల పార్లమెంట్‌, 2018లో ఉప్పల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కాసాని వీరేష్‌ 2018లో కుత్బుల్లాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కూడా పార్టీ అవకాశం ఇస్తే పోటీచేసే యోచనలో ఉన్నారు.  


‘పట్టువదలని’ చంద్రశేఖర్‌

మాజీ మంత్రి, వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్‌ మరోసారి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయనకు తరువాత కాలం కలిసిరాలేదు. తెలంగాణ కోసం 2008లో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన టీఆర్‌ఎస్‌ తరఫున ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత  కూడా ఆయనకు అదృష్టం కలిసిరాలేదు. 2009, 2018లలో వికారాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన ఆయన ఓటమి చెందారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో ఆయన ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 2019లో పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వికారాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


మేడ్చల్‌పైనే కేఎల్లార్‌ ‘చూపు’

క్రియాశీలక రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మళ్లీ నియోజకవర్గంలో కేడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. కేఎల్లార్‌ ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కొంతకాలంపాటు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌రెడ్డిని పీసీసీ అఽధ్యక్షునిగా ఎంపికచేయడాన్ని నిరససిస్తూ ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అధిష్ఠానం ఆయన్ని బుజ్జగించినప్పటికీ కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ ఢిల్లీ పెద్దలతో మాత్రం ఆయన టచ్‌లోనే ఉన్నారు. మరోవైపు ఆయనకు అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి కూడా తమ పార్టీలో చేరాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో ఆయన మళ్లీ క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి బరిలో దిగే అవకాశాలున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఈమేరకు ఆయన ఇటీవల కాలంలో తమ అనుచరులతో తరచూ సమావేశాలు, గెట్‌ టూ గెదర్‌లను నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-01-17T04:03:04+05:30 IST