Abn logo
Mar 26 2020 @ 00:00AM

కరోనా కాలంలో నాయకత్వం

దృఢ వైఖరితో నిర్ణయాత్మకంగా వ్యవహరించడమే కాదు, ప్రజలు వ్యక్తులుగా, సమూహాలుగా ఎదుర్కొనే సమస్యలను ఒక అనుకంపతో అర్థం చేసుకొని మానవతా సంస్పర్శతో వాటిని పరిష్కరించే ఉదాత్త స్వభావమున్న నాయకత్వం ప్రస్తుత కరోనా సంక్షోభ సందర్భంలో ఎంతైనా అవసరం. రాజ్య వ్యవస్థ-–పౌరుల మధ్య కొత్త భాగస్వామ్యం నెలకొనాల్సివున్నది. ఇది జరగాలంటే ప్రభుత్వ విభాగాలైన పోలీసు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగాల్ని పరిపూర్ణంగా ప్రజలు విశ్వసించగలగాలి. ఆ వ్యవస్థలపై వారిలో భయ భావం తొలగిపోవాలి. ఇంతకంటే ముఖ్యం ప్రభుత్వాలు తమ హామీలకు నిబద్ధమైవుండడం.


కరోనా సంక్షోభ వేళ భారత్ భరోసా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరి మోదీ గురించిన ఈ వాస్తవం మీకు తెలుసా? బహుశా, తెలిసివుండకపోవచ్చు. అది, అంతగా ప్రసిద్ధి పొందని విషయం. ఆయన రాజకీయ జీవితం ఒక ప్రాకృతిక విపత్తుతోనే ఆకస్మికంగా మారిపోయింది. 2001లో కచ్‌లో సంభవించిన పెను భూకంప బాధితులను ఆదుకోవడంలో ఆనాటి కేశూభాయి పటేల్ ప్రభుత్వం అన్ని విధాల విఫలమయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం క్షణం ఆలస్యం చేయకుండా కేశూభాయిని తొలగించి, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీని గాంధీ నగర్‌కు పంపించింది. ఒక కొత్త చరిత్ర ప్రారంభమయింది. 


కరోనా కల్లోలం ప్రాకృతిక విపత్తు కాదు. శతాబ్దానికొకసారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసే మహా మహమ్మారి. కచ్ భూకంప బాధితుల సహాయక చర్యలలో అవినీతిని అంతమొందించడంలో మోదీ సఫలమయ్యారు. ఆ విపత్కర పరిస్థితులు ‘నియంత్రించగలవి’ కాబట్టే ఒక పాలకుడుగా తన కర్తవ్యాలను ఆయన సమర్థంగా నిర్వహించగలిగారు. మరి కొవిడ్ -19 లాంటి వైద్య అత్యవసర పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. మరుక్షణం ఏమి సంభవిస్తుందో నిశ్చితంగా చెప్పగలిగే పరిస్థితిలేని సంక్షోభమిది. చైనా లాంటి నియం తృత్వ రాజ్యాల నుంచి అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాల దాకా ప్రతి సమాజమూ కరోనా వైరస్‌ను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు మహా ప్రయత్నం చేస్తోంది. ఈ మహా విపత్కర పరిస్థితులను ఏ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే తీసుకోండి. ఆయన వ్యవహార శైలిలో స్థిరత్వం తక్కువ. నాయకత్వ అపసవ్యతలు సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత తీవ్రం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ తొలుత ప్రబలిన చైనా విషయాన్ని చూస్తే ఆ తొలి దశలో ఆ దేశ నాయకులు పారదర్శకంగా వ్యవహరించలేదు. వాస్త వాలను కప్పిపుచ్చారు. ఫలితంగానే ఇప్పుడు ఆ విషక్రిమి యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నదేమిటి? నవీన ప్రపంచ నాయకత్వాలకు కరోనా మహమ్మారి మహా సవాళ్లను విసురుతున్నదనే కాదూ? అవును, ఈ విషయం సందేహాతీతమైనది. అంతేకాదు. సంక్షోభ నిర్వహణలో అనుసరించాల్సిన వైఖరులు, పద్ధతులలో మౌలిక మార్పులు అవశ్యమని కూడా కరోనా కల్లోలం స్పష్టం చేసింది. మోదీ నాయకత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదని మరి చెప్పాలా?


నరేంద్ర మోదీ ఒక రాజకీయ ‘మహాబలుడు’; ఎటువంటి సంకటాలనైనా సమర్థంగా ఎదుర్కోగల శక్తిశాలి. మాటల మాంత్రికుడు. ఒక నాయకుడికి ఇంకేం కావాలి? మోదీపట్ల ఆకర్షితుడైన ప్రతివాడూ ఆయన ఆరాధకుడిగా మారిపోయాడనడంలో అతిశయోక్తిలేదు. ఇదుగో, ఈ వాస్తవాలే ఆయన నాయకత్వ శైలిని నిర్వచిస్తున్నాయి, నిర్దేశిస్తున్నాయి. ఒక హిందూత్వ హీరో నుంచి ఒక పాలనా మార్గదర్శకుడు (గవర్నెన్స్ గురు)గా ఆయన పరివర్తన అంతా ఒక విలక్షణ నాయకుడుగా ప్రజల మనస్సుల్లో సుప్రతిష్ఠితం చేసేందుకు నిత్యం నిరంతరాయంగా జరిగిన మహాప్రచారోద్యమం ఆలంబనతోనే జరిగింది. 2019 సార్వత్రక ఎన్నికల ప్రచారంలో ప్రజలను విశేషంగా ప్రభావితం చేసిన ఏక వాక్య నినాదమే ఇందుకొక ఉదాహరణ. ఆ నినాదాన్ని గుర్తు చేస్తాను: ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ (మోదీ అక్కడ వుంటే ఏదైనా సుసాధ్యమే). రాజకీయంగా ఆయన అజేయుడు అనే భావన కల్పన, వాస్తవం మధ్య రేఖను చెరిపివేసింది. కరోనా లాంటి మహాసంక్షోభంలో అసంగత విషయాలకు, కల్పనల సృష్టికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే అది జీవితాన్ని విరిచివేసే ఒక మహా విపత్తు. మైమరిపించే మాటలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే సంఘటనలతో కరోనా అంటువ్యాధిని ఎదుర్కోవడం అసాధ్యం. దాని వ్యాప్తిని అరికట్టాలంటే కఠినాతికఠిన వైఖరితో వ్యవహరించితీరాలి. ఇది అనివార్యం. శత్రుభూమిలోని ఒక ఉగ్రవాద శిబిరాన్ని వైమానిక దాడితో ధ్వంసం చేయవచ్చు. అయితే వైరస్ విధ్వంసం అంత సులువు కాదు. రాజకీయ చాణక్యాలతో ఎన్నికలలో గెలవగలరు లేదా ఒక ప్రభుత్వాన్ని కూల్చివేయగలరు. అయితే ఒక మహా అంటువ్యాధిని నిర్మూలించడమనేది వైద్య పరిశోధనలు, వైజ్ఞానిక ఆవిష్కరణలతో మాత్రమే సుసాధ్యమవుతుంది. ఈ దృష్ట్యా ఎంతటి రాజకీయ మహాబలుడికీ పరిమితులు ఉంటాయనే సత్యాన్ని కరోనా విస్పష్టంగా చాటుతోంది.


కరోనాను నియంత్రించే క్రమంలో 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ (దేశ్ బందీ)ను ప్రధానమంత్రి ప్రకటించారు. మోదీ గతంలో తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలు, మరీ ముఖ్యంగా పెద్ద విలువ గల కరెన్సీ నోట్ల రద్దు (నోట్ బందీ)తో, ఈ దేశ్ బందీని తులనాత్మకంగా చూడండి. దేశ ఆర్థిక వ్యవస్థలో నల్లధనం హానికర పాత్రను అంతమొందించే లక్ష్యంతో మోదీ నోట్ బందీ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది పూర్తిగా వైయక్తిక వివేచనతో తీసుకున్న నిర్ణయం. మంత్రివర్గ సహచరులు, ఆర్థిక నిపుణులతో సంప్రదించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన తీసుకున్న నిర్ణయం కాదు. కరోనా లాక్‌డౌన్, అందుకు భిన్నంగా, సంక్షోభ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న ఒక అనివార్య కార్యాచరణ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం. అనేక దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలుపరుస్తున్నాయి. ‘సామాజిక దూరాన్ని’ పాటించడం ద్వారా మాత్రమే కరోనా కారక మరణాల సంఖ్యను తగ్గించగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అవినీతి నిర్మూలనకు తక్కువ విధ్వంసకర మార్గాలుండగా నోట్ బందీని అనుసరించడంపై ప్రధాని మోదీ పలు విమర్శలకు గురయ్యారు. అవన్నీ నిర్హేతుకమైనవని ఎవరూ అనలేరు. అయితే ఇప్పుడు దేశ్ బందీ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరు. ఎందుకంటే అది సుసంగతమైన నిర్ణయం. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కనీసం మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ పాటించడం తప్పనిసరి అనేదే అందరి అభిప్రాయంగా వున్నది.


అందరూ ఏకీభవిస్తున్నందున దేశ్ బందీతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నంకావని అనుకోవడం పొరపాటు. కరోనా విపత్తు నివారణకు రాజ్య వ్యవస్థ ఒక చర్యను బలవంతంగా తీసుకొంటున్నప్పుడు, ఆ చర్యకు అమితంగా ప్రభావితులయ్యే వారి విషయంలో విధిగా ఒక కరుణాత్మక వైఖరితో వ్యవహరించాలి. కరోనా లాంటి వైద్య-–ఆరోగ్య సంక్షోభాన్ని నిర్మూలించే విషయంలో ప్రజల పట్ల దయ–-దండన విధానాన్ని అనుసరించడం వివేకవంతులైన పాలకుల కర్తవ్యం. ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడం అర్థం చేసుకోదగిన విషయమే. ఎందుకంటే అసాధారణ వైపరీత్యాల కాలంలో అసాధారణ చర్యలు తప్పనిసరి. ప్రధాని మోదీ అన్నట్లు ‘మీకు జీవితం వున్నప్పుడే ఈ ప్రపంచం మీది అవుతుంది’. అయితే నిరుపేదలు, అత్యంత దుర్బల వర్గాల వారికి ఎటువంటి సామాజిక భద్రతా సదుపాయాలు కల్పించకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలుపరచడం అనర్థదాయకమే కాగలదు. నోట్ బందీ వల్ల అన్నివర్గాల ప్రజలూ నష్టపోయారు. అయితే సంపన్నులు, మధ్యతరగతి ప్రజలు చాలా త్వరగానే కోలుకోగలిగారు. కాయకష్టంపై బతికే పేదలు, అసంఘటితరంగాల కార్మికులు ఇప్పటికీ నోట్ బందీ విధ్వంస ప్రభావం నుంచి తేరుకోలేక పోతున్నారు. అసంఖ్యాక ప్రజలకు ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు ఇప్పటికీ ఖాయిలా పడేవున్నాయి. మరి కొత్త ఉద్యోగాల సృష్టి ఎలా జరుగుతుంది? ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ, పట్టణ పేదలను ఆదుకోవడానికి ఒక పటిష్ఠ ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని తక్షణమే అమలుపరిచితీరాలి. లేనిపక్షంలో దేశ్ బందీతో పేద ప్రజలు ఎదుర్కొనే కష్టనష్టాలు మాటల్లో చెప్పలేనివవుతాయి. 


దృఢ వైఖరితో నిర్ణయాత్మకంగా వ్యవహరించడమే కాదు, ప్రజలు వ్యక్తులుగా, సమూహాలుగా ఎదుర్కొనే సమస్యలను ఒక అనుకంపతో అర్థం చేసుకొని మానవతా సంస్పర్శతో వాటిని పరిష్కరించే ఉదాత్త స్వభావమున్న నాయకత్వం ప్రస్తుత కరోనా సంక్షోభ సందర్భంలో ఎంతైనా అవసరం. రాజ్యవ్యవస్థ-–పౌరుల మధ్య కొత్త భాగస్వామ్యం నెలకొనాల్సివున్నది. ఇది జరగాలంటే ప్రభుత్వ విభాగాలైన పోలీసు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిపూర్ణంగా ప్రజలు విశ్వసించగలగాలి. ఆ వ్యవస్థలపై వారిలో భయ భావం తొలగిపోవాలి. సామాజిక దూరాన్ని సక్రమంగా పాటించేందుకు పౌరుల్లో వ్యక్తిగత స్థాయిలోను, సామూహిక స్థాయిలోను ఒక కచ్చితమైన క్రమశిక్షణ నెలకొనేలా చర్యలు చేపట్టవలసివున్నది. ఇంతకంటే ముఖ్యం ప్రభుత్వాలు తమ హామీలకు నిబద్ధమైవుండడం. నిత్యావసర సరుకులు, సేవలు సామాన్యులకు అందుబాటులో వుండేలా చేయాలి. వీటికి ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడడం పాలకుల నైతిక కర్తవ్యం. నిత్యావసర సరుకుల సరఫరాలు అరకొరగా వుంటే పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. దుకాణాల ముందు ప్రజలు బారులు తీరడం అనివార్యమవుతుంది. ఇది అనివార్యమైన సామాజిక దూరానికి ఎలా దోహదం చేస్తుంది? బాధితులను ఆదుకొనే పేరిట సంకుచిత ప్రయోజనాలను సాధించుకునే రీతుల్లో రాజకీయ వేత్తలు వ్యవహరించడానికి కూడా ఇది సమయమూ సందర్భమూ కాదు. ప్రభుత్వ వ్యతిరేక వైఖరులను తప్పక విడనాడాలి. కరోనా సంక్షోభాన్ని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందా లేదా అనే ప్రశ్నలను భవిష్యత్తుకు వదిలి వేయాలి. జాతీయవాద భావోద్వేగాలకు కూడా ఇది సమయం కాదు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించవలసివున్నది. నిర్ణయాత్మకంగా వ్యవహరించే నాయకత్వం మాత్రమే కాదు, హుందాగా దృఢంగా వ్యవహరించే నాయకత్వమూ ఇప్పుడు మనకు చాలా ముఖ్యం.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)


Advertisement
Advertisement
Advertisement