తెల్ల బంగారం వైపు మొగ్గు

ABN , First Publish Date - 2022-06-06T06:38:19+05:30 IST

వానాకాలం సీజన్‌లో తెల్ల బంగారం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పల్లెల్లోకి పేరు, ఊరు, బిల్లులు లేకుండా పత్తి విత్తనాల విక్రయాలతో నకిలీ భయం కూడా రైతుల్లో మొదలైంది.

తెల్ల బంగారం వైపు మొగ్గు

- జిల్లాలో మళ్లీ పెరగనున్న పత్తి సాగు 

- మద్దతు ధరకు మించి కొనుగోలుపై ఆశతో..  

- వ్యవసాయ శాఖ అంచనా 80,900 ఎకరాలు

- గ్రామాల్లోకి పత్తి విత్తనాలు... రైతుల్లో నకిలీ భయం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వానాకాలం సీజన్‌లో తెల్ల బంగారం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పల్లెల్లోకి పేరు, ఊరు, బిల్లులు లేకుండా పత్తి విత్తనాల విక్రయాలతో నకిలీ భయం కూడా రైతుల్లో మొదలైంది. పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలు గుట్టు చప్పుడు కాకుండా జిల్లాకు తీసుకవచ్చి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నిషేధించిన బీటీ 3 విత్తనాలు, గ్లైకోసెట్‌ వంటి రసాయనాలు కూడా అమ్మకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నా ప్రతి యేటా నకిలీ బెడద రైతులకు తప్పడం లేదు. ఈ సారి పత్తి సాగు వైపే రైతులు ఆసక్తి చూపుతుండడంతో వారి ఆశలను అసరా చేసుకోని విత్తనాలను అంటగట్టే ప్రయత్నాలు దళారులు, విత్తన వ్యాపారులు మొదలు పెట్టారు. మరోవైపు మార్కెట్‌లో పత్తికి అనుకూలమైన ధరలు ఉండడం మద్దతు ధరకు మించి కొనుగోలు జరుగుతుండడంతో రైతులు పత్తిసాగు చేయాలని భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై మళ్లీ ఎలాంటి ఆంక్షలు వస్తాయోననే భయం కూడా పత్తి సాగు పెరగడానికి అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. 


- లక్ష ఎకరాల వరకు సాగు... 

జిల్లాలో పత్తి సాగే ప్రధానంగా సాగేది. రెండు సంవత్సరాలుగా జిల్లాకు కాళేశ్వరం, ఎల్లంపల్లి జలాలతో చెరువులు నింపడం, ప్రాజెక్ట్‌లు నీళ్లతో కళకళాలాడడంతో పాటు అనుకూలంగా భారీ వర్షాలు పడడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో లక్ష ఎకరాలకుపైగా పత్తిని సాగు చేసే రైతులు వరి వైపు మొగ్గు చూపారు. 90 వేల ఎకరాలకు వరకు సాగయ్యే వరి 1.50 లక్షల ఎకరాల వరకు పెరిగింది. లక్షకు పైగా ఎకరాల్లో సాగయ్యే పత్తి 80 వేల ఎకరాలకు వరకు తగ్గిపోయింది. మళ్లీ ఈ వానాకాలంలో రైతులు పత్తి సాగు వైపు దృష్టి సారించారు. వ్యవసాయ శాఖ 80,900 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇది లక్ష వరకు దాటే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం జిల్లాలో 2,44,355 ఎకరాల్లో  సాగు చేయనుండగా వరి 1,50,400 ఎకరాలు, పత్తి 80,900 ఎకరాలు, పెసర 845 ఎకరాలు, కందులు 5,020 ఎకరాలు, అయిల్‌పామ్‌ 1,600 ఎకరాలు, ఇతర పంటలు 1,650 ఎకరాలకు సాగు అంచనా వేశారు. ఇందులో పత్తిసాగు ఇల్లంతకుంటలో 1,800 ఎకరాలు, తంగళ్లపల్లిలో 3,800 ఎకరాలు, సిరిసిల్లలో 3,200 ఎకరాలు, బోయినపల్లిలో 8,500 ఎకరాలు, చందుర్తిలో 9,000 ఎకరాలు, రుద్రంగిలో 4,500 ఎకరాలు, కోనరావుపేటలో 8,500 ఎకరాలు, వేములవాడలో 6,500 ఎకరాలు, వేములవాడ రూరర్‌లో 4,500 ఎకరాలు, గంభీరావుపేటలో 1,500 ఎకరాలు, ముస్తాబాద్‌లో 4,500 ఎకరాలు, వీర్నపల్లిలో 1,400 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 7,000 ఎకరాలు సాగు చేయనున్నట్లు అంచనాలు వేశారు. 


- తెగుళ్లతోనే నష్టం... 

జిల్లాలో పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు ప్రతి యేటా గులాబీ రంగు పురుగుతో పాటు ఇతర తెగుళ్లతో రైతులు నష్టపోతున్నారు. మరోవైపు భారీ వర్షాలు కూడా పత్తి రంగు మారి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండి పత్తి దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో చీడపీడలు ఉన్నా రైతులు పత్తి పంటను సాగు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు కూడా రైతులను నష్టపరుస్తున్నాయి. సీజన్‌ ప్రారంభం కంటే ముందే విత్తనాలు తీసుకువచ్చి రైతులకు అంటగడుతున్నారు. బీటి 3 విత్తనాల పేరుతో పల్లెల్లోకి తీసుకురావడంతో రైతులు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిఘా పెంచాలని రైతులు కోరుతున్నారు. 


- పెరిగిన కౌలు ధరలు

జిల్లాలో రైతులు పత్తిసాగు వైపు మొగ్గు చూపుతుండడంతో పట్టాదారులు కౌలు ధరలు కూడా పెంచారు. పత్తి సాగు చేసే కౌలు ఎకరానికి 13 వేల రూపాయల వరకు ధర నిర్ణయించారు. వరిసాగుకు సంబంధించి  10 వేల నుంచి 11 వేల రూపాయల వరకు ఉంది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఐదు లక్షల ఎకరాల వరకు సాగు భూములు ఉన్నా సీజన్‌ను బట్టి రెండు లక్షల పైచిలుకు ఎకరాల్లోనే సాగు జరుగుతుంది. జిల్లాలో ఒక ఎకరంలోపు సాగు భూములు ఉన్నవారు 79,354 మంది ఉన్నారు. వీరు తోటి రైతుల వద్ద మరో రెండు నుంచి ఐదు ఎకరాల వరకు కౌలుకు తీసుకోని సాగు చేస్తున్నారు. వీరితో పాటు మరో 15 వేల మంది  కౌలు  భూములపైనే అధారపడి ఉన్నారు. ఈసారి పత్తి సాగుకు సంబంధించి నల్లరేగడి భూములకు కౌలు ధర పెంచడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 


Updated Date - 2022-06-06T06:38:19+05:30 IST