కౌలు రైతుపై శీతకన్ను

ABN , First Publish Date - 2021-06-24T06:20:46+05:30 IST

కౌలు రైతులను ఆదుకోవడం ప్రకటనలకే పరిమితమౌతోంది.

కౌలు రైతుపై శీతకన్ను

  1. సీసీఆర్‌సీ ఉంటేనే పంట రుణాలు
  2. బీమా, మద్దతు ధర.. అన్నింటికీ మెలిక
  3. జిల్లాలో 70 వేలకు పైగా కౌలు రైతులు
  4. గత ఏడాది ఇచ్చింది 26 వేల మందికే..
  5. అప్పులు తీర్చలేక కౌలు రైతుల ఆత్మహత్య
  6. బాధిత కుటుంబానికి అందని  సాయం 



    కర్నూలు-ఆంధ్రజ్యోతి: కౌలు రైతులను ఆదుకోవడం ప్రకటనలకే పరిమితమౌతోంది. సొంత భూమి లేకపోయినా నేలతల్లిని నమ్ముకుంటే బతకొచ్చు అనే ఆశతో వ్యవసాయం చేస్తున్న వీరు ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ద్వారా కౌలు రైతు కార్డు అందితే కొంతైనా ప్రయోజనం ఉంటుంది. కానీ చాలా మందికి కార్డులు అందడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా 62 శాతం మందికి పైగా కౌలు రైతులు గుర్తింపునకు నోచుకోవడం లేదు. పెట్టుబడి సాయం, పంట దిగుబడులను అమ్ముకోవడం, నష్ట పరిహారం లేదా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, పంట రుణం.. ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్‌సీ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డ్‌) ఉండాల్సిందే. లేదంటే ఏ ఒక్కటీ వర్తించవని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరికీ సీసీఆర్‌సీ అందించడానికి చర్యలు తీసుకోవడం లేదు.

     మిడ్తూరు మండలం దేవనూరుకు చెందిన వేణుగోపాల్‌ అనే కౌలు రైతు మే 1వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఓర్వకల్లుకు చెందిన ఈయన రెండేళ్ల నుంచి దేవనూరులో ఉంటూ, పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. రూ.6 లక్షల అప్పు అయింది. ఏటా అప్పుల భారం పెరిగిపోతుండటంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి తనువు చాలించాడు.

    తుగ్గలి మండలం పెండేకల్‌ ఆర్‌ఎస్‌కి చెందిన సుధాకర్‌ అనే కౌలు రైతు గత ఏడాది డిసెంబరులో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదారేళ్ల నుంచి సొంతూరిలోనే భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఎన్నడూ లాభం కళ్ల చూడలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు రూ.5 లక్షలు దాటాయి. అప్పు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడు. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు విన్నవించారు. కౌలు రైతు కార్డు లేదు కాబట్టి తాము ఏమీ చేయలేమని వారు చేతులెత్తేశారు.


    జిల్లాలో 26 వేల పైచిలుకే..

    జిల్లాలో రైతులు ఆరున్నర లక్షల మంది ఉన్నారు. కౌలు రైతులు 70 వేల మంది ఉంటారని అంచనా. సీసీఆర్‌సీ పత్రాలు ఉన్న వారి సంఖ్య 26,180 మంది మాత్రమే. కార్డుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. కౌలు రైతుల కష్టాలను తీర్చే సంజీవని సీసీఆర్‌సీ అని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ ఆ స్థాయిలో చర్యలు లేవు. పంటల బీమా, మద్దతు ధర పొందేందుకు సీసీఆర్‌సీ అనుసంధానం తప్పనిసరి. కార్డు లేకపోయినా, ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుంటే అన్ని ఫలాలు వారికి అందుతాయని వ్యవసాయ శాఖ అంటోంది. కానీ ఆచరణలో లేదు. గత ప్రభుత్వ హయాంలో సీసీఆర్‌సీ మెలిక లేకపోవడంతో కొంత సాయం అందేది. రైతు సంక్షేమమే ధ్యేయమని వల్లెవేసే వైసీపీ ప్రభుత్వంలో ఆ మాత్రం కూడా లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. సంస్కరణలు, ప్రక్షాళనల పేరుతో కనీస సాయం కూడా అందకుండా చేశారని ఆవేదన చెందుతున్నారు.


    సకాలంలో అందేనా..?

    జిల్లాలో ఖరీఫ్‌ పనులు మొదలయ్యాయి. సొంతభూమి ఉన్న రైతులకు రాయితీ విత్తనాలు, రైతు భరోసా సొమ్ముతో కొంతలో కొంత ఊరట లభించింది. వీరు సాగుకు సన్నద్ధమవుతున్నారు. కానీ కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సీసీఆర్‌సీ పత్రాలు ఇప్పటికీ అందలేదు. గతంలో కౌలు రైతు పత్రాలు పొందిన రైతులు రెన్యువల్‌ చేయించుకుంటేనే కార్డు మనుగడలోకి వస్తుంది. భూ యజమాని అనుమతితో కార్డును నవీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం మే నెలాఖరు వరకు ముగించి, జూన్‌ నెల మొదటి రెండు వారాల్లో కార్డులను రైతులకు అందించాల్సి ఉంటుంది. కానీ జిల్లా వ్యవసాయ శాఖ ఈ పనిని ఇప్పుడు మొదలుపెట్టింది. సంబంధిత పత్రాలను కౌలు రైతులు సమర్పిస్తే, వీఆర్వో ఆమోదంతో కార్డులు కౌలు రైతులకు అందుతాయి. ఈ ప్రక్రియ ముగిసి, కార్డులు అందేసరికి జూన్‌ నెల దాటుతుంది. దీంతో కౌలు రైతులకు రాయితీ విత్తనాలు, రైతు భరోసా సాయం కూడా అందే పరిస్థితి ఉండదు. సొంత భూమి ఉన్న రైతులే పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతుంటే, ఇక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


    రెండు శాతం మందికే..

    జిల్లా రైతాంగానికి ఏటా అందించే రుణ పద్దులో కౌలు రైతుల వాటా 10 శాతం ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ అమలు కావడం లేదు. వీరికి అందించే రుణం 2 శాతం కూడా దాటడం లేదు. ప్రతి సీజన్‌లో కౌలు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారుల అధిక వడ్డీలు, కమీషన్ల పేరుతో దోచుకుంటున్నారు. ఈ కారణంగా కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు.


    రైతుల్లో అపోహలు

    కౌలు రైతులకు సీసీఆర్‌సీ అందాలంటే భూ యజమానికి అంగీకారం తప్పనిసరి. సంతకం చేస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని భూ యజమానులు ఆందోళన చెందుతున్నారు. సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా వీరికి అవగాహన కల్పించాలి. సీసీఆర్‌సీ కార్డుకు అంగీకారం తెలిపినంత మాత్రాన భూమిపై హక్కుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజేయాలి. ఆ కార్డు మనుగడలో ఉండేది కేవలం 11 నెలలే కాబట్టి, తరువాత యజమాని కౌలుదారుడిని మార్చుకున్నా, కౌలును రద్దు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వివరించాలి. కానీ యంత్రాంగం ఆ దిశగా శ్రద్ధ చూపడం లేదు. అందుకే జిల్లా వ్యాప్తంగా 37 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


    కౌలు రైతులు నష్టపోతున్నారు


జిల్లాలో కౌలు రైతులు చాలామంది ఉన్నారు. కౌలుకు తీసుకున్న తర్వాత దుక్కి మొదలు కోత కోసి, పంట ఉత్పత్తులను అమ్మే వరకు ప్రతీది వారే చేస్తారు. కానీ ఏ కారణం చేతైనా వారు పంట నష్టపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదడం లేదు. రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర ఇలాంటి అన్ని విషయాల్లో వారికి నష్టం జరుగుతోంది. ప్రభుత్వం అందించే రాయితీలు భూ యజమానులకు చేరుతున్నాయి. సీసీఆర్‌సీ కార్డులు లేకపోవడం వల్లే ఇలా జరగుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో సరైన సమాచారం తీసుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు అందించాలి.
- జి. రామకృష్ణ,
వ్యవసాయం సంఘం జిల్లా కార్యదర్శి, సీపీఎం, కర్నూలు


ప్రత్యేక రుణాలు ఇవ్వాలి..


సాధారణంగా బ్యాంకులు పంట రుణాలను భూమి మీద ఇస్తాయి. కౌలు రైతులకు సీసీఆర్‌సీ ఉన్నా, రుణం తీసుకోవాడానికి భూ యజమాని ఒప్పుకోడు. వారికి అవగాహన కల్పించి కౌలు రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోరు. భూమి మీద కాకుండా, పంట మీద రుణం ఇవ్వడం మొదలు పెడితే కౌలు రైతులకు న్యాయం జరుగుతుంది. సీసీఆర్‌సీలను సరైన సమయంలో, ఎక్కువ మందికి ఇవ్వాలి. అప్పుడే వారికి మేలు జరుగుతుంది.
- కె జగన్నాఽథం,
వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి, సీపీఐ, కర్నూలు


కౌలు రైతు ఆత్మహత్య

నందికొట్కూరు రూరల్‌, జూన్‌ 23: అప్పులబాధ తాళలేక కుర్వ రాముడు (54) అనే రైతు పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. కొణిదేల గ్రామంలో ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటంబ సభ్యులు తెలిపిన వివరాలమేరకు.. కొణిదేలలో రాముడికి ఎకరా పొలం ఉంది. దీనికి తోడు మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. కంది, మినుము, మొక్కజొన్న తదితర వర్షాధార పంటలను సాగు చేసేవాడు. ప్రకృతి విపత్తుల కారణంగా దిగుబడులు సరిగా రాలేదు. దీనికితోడు గిట్టుబాటు ధర లభించలేదు. వ్యవసాయంలో ఏటా నష్టాలు రావడంతో అప్పులు రూ.6 లక్షలు దాటాయి. తీర్చేమార్గం తెలియక తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. చుట్టు పక్కల రైతులు గమనించి, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నందికొట్కూరు పోలీసులు రైతు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు రాముడికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు, కూతురు ఉన్నారు.

Updated Date - 2021-06-24T06:20:46+05:30 IST