కౌలు కష్టమే!

ABN , First Publish Date - 2021-07-30T05:17:24+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో ప్రభుత్వం కౌలుదారు రక్షిత చట్టం తీసుకువచ్చినా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.

కౌలు కష్టమే!

  • కౌలుదారు రక్షిత చట్టం ఉన్నా ఆచరణలో శూన్యం
  • వర్తించని రైతుబంధు.. అందని రుణ సదుపాయం
  • ఏటేటా పెరుగుతున్న పెట్టుబడి 
  • వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం
  • అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కౌలు రైతులు


వికారాబాద్‌ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  గతంలో ప్రభుత్వం కౌలుదారు రక్షిత చట్టం తీసుకువచ్చినా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఒకవైపు రైతుబంధు సాయం అందక మరోవైపు బ్యాంకర్ల నుంచి రుణాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట పెట్టుబడి పెట్టినా కాలం కలిసిరాక అప్పులు పెరిగి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. 

పరిగి: ఎన్నో ప్రయాసలకోర్చి పంట పండించే రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. రబీలో పంటలు బాగా పండినా కొనుగోళ్లలో దోపిడీ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నా బ్యాంకర్లు రుణాలు కింద వాటిని జమ చేసుకోవడం, పెరిగిన పెట్టుబడులకు ఏ మూలకు సరిపోకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వానాకాలం సాగుకు సంబంధించి పంట రుణాల ప్రణాళికలు కూడా ఇప్పటి వరకు లేకపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలో ఏడు వేలకుపైగా కౌలు రైతులు ఉన్నప్పటీకీ ఇందులో ఒక్కరికి కూడా బ్యాంకులు రుణం ఇవ్వలేదు. చిన్న, సన్నకారు రైతుల గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయడం లేదు. కనీసం ప్రభుత్వం అందించే రైతుబంధు పథకానికి కూడా కౌలు రైతులు నోచుకోవడం లేదు. కౌలు రైతులకు పంట రుణాలు, సబ్పిడీపై విత్తనాలు అందించి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తో న్న కౌలుదారు రక్షిత చట్టం ఆచరణలో అందనంతా దూరంలో ఉంది. కౌలు రైతుకు ప్రభుత్వం చట్టబద్దత తీసుకవచ్చినప్పటికీ లాభం లేకుండా పోతోంది. కాలం కలిసిరాక అప్పులు భారం పెరిగి  వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్మలు చేసుకుంటున్న వారిలో  కౌలు రైతులే ఎక్కువగా ఉంటున్నారు. 2011 నుంచి కౌలుదారు చట్టం అమలులో ఉన్నా జిల్లాలో కౌలు రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది శూన్యమే. గతంలో జిల్లాలో 6,370 మంది కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేసినప్పటీకీ 10 శాతం మందికి కూడా రుణాలు ఇవ్వలేకపోయారు. గతంలో జిల్లా అధికారులు గుర్తించిన దాని కంటే మూడింతలు ఎక్కువగా కౌలు రైతులు ఉంటారని సమాచారం. జిల్లాలోని 19 మండలాల్లో ఏడు వేలకుపైగానే కౌలు రైతులు ఉన్నారని అధికారుల అంచనా. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అందని సబ్సిడీలు.. 

ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందకపోవడంతో జిల్లాలో కౌలు రైతులు  పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పత్తి సాగుకు ఎకరాకు రూ.12 నుంచి రూ.20 వేలు, వరికి పది బస్తాల ఽధాన్యం చొప్పున కౌలు చెల్లిస్తున్నారు. కౌలు ధరలు ఇలా ఉంటే, పెట్టుబడులు, కూలీ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. అప్పులకు వడ్డీ పెరిగి ఆర్థిక ఇబ్బందులతో కోలుకోని స్థితికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కౌలు రైతులు క్రమంగా సాగును వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి వైపు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకర్లు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

కౌలు రైతుకు ఏదీ భరోసా..

కౌలు రైతుకు ప్రత్యేక చట్టం ఉన్నప్పటీకీ వారికి భరోసా కలగడం లేదు. అతివృష్టి, అనావృష్టి  కారణంగా పంట నష్టపోతే పరిహారం కౌలు రైతుకు అందజేయాల్సి ఉంటుంది. కాగా, 1950కు ముందు ఉన్న టెనెన్సీ క్రమబద్ధీకరించాలని ఉండేదని, ఇప్పుడు ఆ విధానం లేదని అధికారులు చెబుతున్నా రైతులకు నమ్మకం కలుగడం లేదు. కాస్తు, పహాణిలో కౌలు రైతు పేరు రాస్తే తర్వాత లేనిపోని సమస్యలు వస్తాయన్న భావన రైతుల్లో ఉంది. కేవలం కౌలు రైతు వ్యక్తిగత నమ్మకంపైనే రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, పంట సాగు కోసం తీసుకున్న రుణాలను నష్టాల కారణంగా కౌలు రైతులు వాటిని చెల్లించకపోవడంతో గతంలో బ్యాంకర్లు వారిని ఇబ్బందులకు గురిచేశారు. రక్షిత కౌలుదారు చట్టం కింద రుణాలను జమ చేసుకోవాలని చెబుతున్నా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమూ వారికి సహకరిచడం లేదు.

Updated Date - 2021-07-30T05:17:24+05:30 IST