బాధ్యతా రాహిత్యం వీడాలి

ABN , First Publish Date - 2021-05-11T07:19:29+05:30 IST

మానవాళిని కబళిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు, తాము ఎంత కష్టపడుతున్నా కొద్దిమంది కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటం వల్ల కరోనా వ్యాపిస్తూనే ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి పేర్కొన్నారు.

బాధ్యతా రాహిత్యం వీడాలి
కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో రికార్డులు పరిశీలిస్తున్న మహీధర్‌రెడ్డి

మానుగుంట మహీధర్‌రెడ్డి

కందుకూరు, మే 10: మానవాళిని కబళిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు, తాము ఎంత కష్టపడుతున్నా కొద్దిమంది కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటం వల్ల కరోనా వ్యాపిస్తూనే ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా బాధితులకు చికిత్సలు అందించటం కన్నా  వ్యాప్తికి కారకులవుతున్న వారిని కట్టడి చేయటమే పెద్ద సవాల్‌గా మారుతోందన్నారు. సోమవారం మధ్యాహ్నం కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ఆవరణలో ఉన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ని  తహసీల్దార్‌ డి. సీతారామయ్యతో కలిసి పరిశీలించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 150 మందికి ఏర్పాట్లు చేసి ఉండగా, ప్రస్తుతం 90 మంది ఉన్నారన్నారు. లక్షణాలు కనిపించగానే ఈ కేర్‌ సెంటర్‌కి వస్తే తగిన చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లవచ్చునని సూచించారు. 

 మండలంలోని కోవూరు, పందలపాడు గ్రామాలలో మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారులు సోమవారం సాయంత్రం పర్యటించారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌, తహసీల్దార్‌ డి.సీతారామయ్య, రూరల్‌ ఎస్‌ఐ కె.అంకమ్మ తదితరులు ఈ గ్రామాలలోని కొవిడ్‌ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

గ్రామాల్లో విస్తృతంగా పారిశుధ్య పనులు 

కనిగిరి : కనిగిరి ప్రాంతంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్త మయ్యారు. వైరస్‌ కట్టడికి అవసరమైన చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య పనులను విస్తృతంగా చేయి స్తున్నారు. మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి, గుడిపాడు, చీర్లదిన్నె, చినఅలవలపాడు, పోలవరం, గోసులవీడు, గురవాజీపేట, ఎన్‌గొల్లపల్లి, పునుగోడు, బడుగులేరు. చల్లగిరిగల, యడవల్లి, దిరశవంచ తదితర గ్రామాల్లో వీధులను శుభ్రం చేయించారు. బ్లీచింగ్‌ చల్లించడంతోపాటు, హైపో క్లోరైడ్‌ను పిచికారీ చేయించారు.  చల్లగిరిగల, బడుగులేరు గ్రామాల్లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిచి ఉన్న వారికి మండల టాస్క్‌ఫోర్స్‌ బృందం హెచ్చరికలు జారీ చేసింది. తక్కెళ్లపాడులో కరోనా కేసులు ప్రబలకుండా సేవ చేస్తున్న ఏఎన్‌ఎం మేరమ్మను గ్రామస్థులు ఘనంగా సత్కరించారు.

పారిశుధ్య కార్మికులకు రక్షణ కరువు

వివిధ గ్రామాల్లో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు రక్షణ చర్యలు కరువయ్యాయి.  చేతికి గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కాళ్లకు రబ్బరు షూస్‌, ముఖానికి రక్షణ కవచం వంటివి కూడా అందించలేదు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఉన్నతాధికారులైనా స్పందించి అవసరమైన సామగ్రి, అందజేయాలని వారు కోరుతున్నారు. 

సీఎస్‌పురం : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను మండలంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయట తిరుగుతున్న వాహన దారులపై కేసులు నమోదు చేస్తున్నారు. సోమవారం కర్ఫ్యూను తహసీల్దార్‌ జి.ఆంజనేయులు, ఎస్సై చుక్కా శివ బసవరాజు, వీఆర్వోలు మనోజ్‌, శ్రీను, మహిళా పోలీసులు పర్యవేక్షించారు. 

ఉపాధి కూలీలు జాగ్రత్తలు పాటించాలి

సీఎస్‌పురం : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని అయ్యలూరివారిపల్లి సర్పంచ్‌ ముత్యాల భారతీనారాయణరెడ్డి సూచించారు. పంచాయతీలో జరుగు తున్న ఉపాధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. శరీర ఉష్ణోగ్రతను పరీక్షించేందుకు డిజిటల్‌ ధర్మామీటర్‌ను ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు అందజేశారు. కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శి షేక్‌ రసూల్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

జాగ్రత్తలతోనే కరోనా కట్టడి: బుర్రా

కనిగిరి : ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. దుకాణదారులు, చిరు వ్యాపారులు చేతికి గ్లౌజ్‌లు, నోటికి మాస్క్‌లు ధరించాలని సూచించారు.  సోమవారం ఆయన పట్టణంలోని వ్యాపార కూడళ్లు, ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు పలు సూచనలు చేశారు. మాస్క్‌లు సరిగా ధరించకుండా సంచరిస్తున్న వారిని రోడ్డుపై ఆపి సరి చేయించారు.  వేకువజామున ఐదు గంటలకు రోడ్లవెంబడి పారిశుధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్‌ చల్లించడంతోపాటు, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌గఫార్‌, కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, తహసీల్దార్‌ పుల్లారావు, ఎంపీడీవో మల్లికార్జునరావు, ఎస్‌ఐ రామిరెడ్డి,  వైసీపీ నాయకులు సూరసాని మోహన్‌రెడ్డి, రంగనాయకులురెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి తదితరులు  ఉన్నారు. 

పామూరు: కరోనా వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వీడి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సిహెచ్‌.ఉష సూచించారు. పట్టణంలోని పలు కంటైన్మెంట్‌ జోన్‌  ప్రాంతాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులకు ధైర్యం చెప్పారు. కంటైన్మెంట్‌ ఏరియాల్లో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈమె వెంట ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌, వీఆర్వో చెన్నకేశవులు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, వలంటీర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T07:19:29+05:30 IST