'డ్రాగన్‌'తో.. లాభాలే లాభాలు

ABN , First Publish Date - 2021-08-29T04:56:30+05:30 IST

రైతులు సంప్రదాయ పంటలను..

'డ్రాగన్‌'తో.. లాభాలే లాభాలు

సంప్రదాయాన్ని వదిలి 'డ్రాగన్‌'కు కదిలి

రంగారెడ్డి జిల్లాలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు రైతుల మొగ్గు

మొదట్లో ఒడిదుడుకులు.. ఆ తర్వాత లాభాలు

ఖర్చు ఎక్కువైనా సత్ఫలితాలు

ప్రభుత్వం రాయితీ కల్పిస్తే మరింత సాగు

పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌


ఇబ్రహీంపట్నం/మంచాల(రంగారెడ్డి): రైతులు సంప్రదాయ పంటలను వదిలేసి కొత్త సాగుకు బాటలు వేస్తున్నారు. గతంలో వేసిన పంటల కంటే ఎక్కువ లాభాలు వచ్చే వాటిపై మక్కువ చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఒక్కరితో ప్రారంభమైన డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ఇప్పుడు 13మందికి చేరింది. వీరే కాకుండా అనేకమంది ఫామ్‌ల్యాండ్స్‌, రిసార్టులలో కూడా వీటిని పెంచుతున్నారు. 2006 సంవత్సరంలో మూడెకరాలతో ప్రారంభమైన సాగు ఇప్పుడు వంద ఎకరాలు దాటింది. ఇంకా అనేకమంది రైతులు దీనిని సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. 


రంగారెడ్డి జిల్లాలో సుమారు వందెకరాల వరకు డ్రాగన్‌ ప్రూట్‌ పంట సాగవుతోంది. జిల్లాలో మొదటగా మంచాల మండలం ఆరుట్లలో వనపల్లి శ్రీనివా్‌సరెడ్డి అనే రైతు 2006లో ఈ పంట సాగుకు శ్రీకారం చుట్టారు. పంట కొత్తది కావడం పలు ఒడిదుడుకులు ఎదురైనా ప్రయోగాలు చేసి ఫలితాలు సాధించారు. ఈ మధ్య కాలంలో ఆదిభట్ల మున్సిపాలిటీ సాహెబ్‌గూడ శివారులో నమ్మి అప్పారావు 8ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ఏడాదిన్నర పంట కావడంతో ఇప్పుడిప్పుడే పూతవచ్చి కాయలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మంచాల మండలం రంగాపూర్‌, షాబాద్‌ మండలం పెద్దవీడు, చేవెళ్ల మండలం ఆలూరు, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, యాచారం మండలం గడ్డమల్లాయగూడ, మహేశ్వరం మండలం సరస్వతిగూడ, కందుకూరు మండలం లేమూరులలో ఈ పంట సాగవుతోంది. కొందరు ఫామ్‌హౌజ్‌లలో ఈ పంటను సాగుచేస్తున్నారు.  మొదటగా ఈ పంటను సాగు చేసేందుకు సుమారు రూ.6లక్షలు ఖర్చవుతుంది.


ఆ తర్వాత ఏడాదికి మెయింటెనెన్స్‌ కోసం రూ.50వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా పంట జీవితకాలం మొత్తానికి ఎకరానికి రూ.18.50లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఈ కాలంలో పంట దిగుబడి సరాసరి ఏడాదికి ఆరు టన్నుల వరకు ఉంటుంది. కనీసం ఈ పండు ధర కిలోకు వంద రూపాయలు వేసుకున్నా పంట జీవితకాలంలో సుమారు కోటీ 20లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని డ్రాగన్‌ఫ్రూట్‌ రైతులు చెబుతున్నారు. మొదట సాగు చేసేందుకు సిమెంట్‌ లేదా రాతి కడీలు, రింగులు వేసి ఈ మొక్కలు నాటాల్సి ఉంది. ఇది ఓ రకంగా తీగజాతి పంట. పంట చేతికి వచ్చేసరికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. ఈ పంటను డ్రిప్‌ కింద సాగు చేస్తున్నారు.


కాత పట్టేందుకు ఏడాదిన్నర కాలం.. 

మొక్క నాటిన ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో పూత మొదలై కాత వస్తుంది. రాత్రివేళల్లో పూలు విచ్చుకుని తెల్లవారుజామున ముడుచుకుంటాయి. జూన్‌లో పూతమొదలై విడతలవారీగా డిసెంబరు దాకా డ్రాగన్‌ ఫ్రూట్‌ ఫలాలను ఇస్తుంది. మొక్క జీవితకాలం 25-30 సంవత్సరాలు. మొదటి సంవత్సరం ఒకచెట్టు 25 ఫలాల వరకు దిగుబడి ఇస్తుంది. ఒక్కో ఫలం ఎరువుల యాజమాన్యాన్ని బట్టి 350-500 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటుంది. మొదటి సంవత్సరం ఎకరాకు 500కిలోలు, రెండో సంవత్సరం ఒకటిన్నర నుంచి రెండు టన్నులు, మూడో సంవత్సరం 3-4 టన్నులు, నాలుగో సంవత్సరం 6-10 టన్నుల దిగుబడులు వస్తున్నాయి.


పోషక విలువల్లో రారాజు 

డ్రాగన్‌ఫ్రూట్‌ అద్భుతమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. దీని శాస్త్రీయనామం హైలోసిరీస్‌. పిఠాయ అని కూడా పిలుస్తారు. డ్రాగన్‌ ఫ్రూట్‌లో నీటిశాతం ఎక్కువ. విటమిన్‌ సీ అధికంగా ఉంటుంది. కార్పోహైడ్రేట్స్‌, కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌ గుణాలను కలిగి ఉంటుంది. పులుపు, తీపి కలయికలో ఉండే ఈ పండును నేరుగా తినవచ్చు.. లేదా జ్యూస్‌ చేసుకుని తాగొచ్చు. ముఖచర్మాన్ని సౌందర్యంగా ఉంచుతుంది. ఔషధాల తయారీలోనూ దీనిని వినియోగిస్తారు. బీపీ, షుగర్‌లను నియంత్రిస్తుంది. కేన్సర్‌ పేషెంట్లకు మరింత శక్తినిస్తుంది.


ఫాంల్యాండ్‌లోనూ..

జిల్లాలో షాబాద్‌, చేవెళ్ల శంకర్‌పల్లి, మెయినాబాద్‌ ఏరియాల్లో అక్కడక్కడ ఫాంల్యాండ్స్‌లో డ్రాగన్‌ఫ్రూట్‌ పంట సాగు చేస్తున్నారు. ఈ పంట సాగవుతున్న భూముల్లో గతంలో బత్తాయి, బొప్పాయి, జామ, పూలు, కూరగాయల పంటలు సాగయ్యేవి. పూలు, కూరగాయల సాగుతో కూలీల ఖర్చు పెరిగిపోతోంది. పైగా అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతినడంతో నష్టాలను చవిచూసిన సందర్భాలున్నాయి. డ్రాగన్‌ఫ్రూట్‌ కొత్త పంట.. ఇది అన్ని కాలాలల్లో నిలదొక్కుకునే పంట. కూలీల ఖర్చుకూడా తక్కువ ఉండటంతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు. 


లాభదాయకమైన పంట..

పెట్టుబడి ఎక్కువైనా మంచి లాభదాయకమైన పంట ఇది. మొదటి రెండేళ్లు దాటితే మంచి ఆదాయం వస్తుంది. నాణ్యత ఉంటే కేజీ రూ.200 పలుకుతుంది. పొలం దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తు న్నారు.

- వనపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తెలుగు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

పంట కొత్తది.. ప్రయోగాత్మకంగా ఉంది

పంట కొత్తదైనా ఆసక్తితో 8 ఎకరాల్లో సాగు చేశాం. డ్రిప్‌ ద్వారా నీటితోపాటుమందులు కూడా సకాలంలో మొక్కలకు అందిస్తున్నాం. ఏడాదిన్నర పంట కావడంతో ఇప్పుడిప్పుడే పూత, కాయలు పడుతుంది. పంట కొత్తది కావడంతో ప్రయోగాలు చేస్తూ ముందుకు పోతున్నాం.

- నమ్మి అప్పారావు, సాహెబ్‌గూడ, ఆదిభట్ల 

పంటపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది డెమోగా ఇద్దరు రైతులకు అర ఎకరం చొప్పున రాయితీ ఇచ్చాం. ఈ ఏడాది జిల్లాలో పన్నెండున్నర ఎకరాలకు రాయితీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

- డా.సునందారాణి, రంగారెడ్డి జిల్లా ఉద్యానశాఖ అధికారిణి

Updated Date - 2021-08-29T04:56:30+05:30 IST