బీరుట్ బ్లాస్ట్: లెబనాన్ పార్లమెంటు మరో సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-08-14T02:56:21+05:30 IST

ఇటీవల భారీ పేలుడు చోటుచేసుకున్న లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో అత్యవసర పరిస్థితి విధించేందుకు...

బీరుట్ బ్లాస్ట్: లెబనాన్ పార్లమెంటు మరో సంచలన నిర్ణయం

బీరుట్: ఇటీవల భారీ పేలుడు చోటుచేసుకున్న బీరుట్‌లో అత్యవసర పరిస్థితి విధించేందుకు లెబనాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశంలో వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సైనిక బలగాలకు సర్వాధికారాలు కట్టబెట్టింది. బీరుట్‌ విస్ఫోటనం తర్వాత లెబనాన్ పార్లమెంటు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ పేలుడు కారణంగా 170 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 6 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో అక్కడి ప్రభుత్వం గద్దె దిగుతున్నట్టు ప్రకటించింది. అధికారం నుంచి వైదొలిగే ముందు సైనిక బలగాలకు సర్వాధికారాలు కట్టబెట్టే విధంగా రాజధాని బీరుట్‌లో ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఇక్కడ కర్ఫ్యూ విధించేందుకు, ప్రజలు గుమికూడకుండా నిరోధించేందుకు, మీడియాను నియంత్రించేందుకు, పౌరులను మిలటరీ కోర్టులకు పంపేందుకు సైన్యానికి అధికారాలు చేకూరినట్టైంది. దీనిపై విమర్శకులతో పాటు హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కాగా కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఎమర్జెన్సీ స్థాయి అధికారాలను అమలు చేస్తోంది. 

Updated Date - 2020-08-14T02:56:21+05:30 IST