కక్కలేక.. మింగలేక స్థానిక సంస్థల నేతలు..?

ABN , First Publish Date - 2021-12-07T04:40:31+05:30 IST

మేడ్చల్‌ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో రోజురోజుకూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఎన్నికల హామీల మేరకు పనులు చేయలేకపోతున్నామని, ప్రభుత్వం నిధులు విదల్చడం లేదని, ఒకే పార్టీ నుంచి గెలిచినా చైర్‌పర్సన్లు తమను...

కక్కలేక.. మింగలేక స్థానిక సంస్థల నేతలు..?

  • కక్కలేక.. మింగలేక స్థానిక సంస్థల నేతలు
  • అధికార పార్టీ పాలక వర్గాల్లో ధిక్కార స్వరం
  • స్థానిక ప్రజాప్రతినిధుల్లో  నైరాశ్యం
  • సందిగ్ధంలో పురపాలికల చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు 
  •  మున్సిపాటీలకు పాకిన అసంతృప్తి సెగలు

టీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి పాదుకుంటోంది. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు వారివారి చైర్‌పర్సన్లు, ఎంపీపీలపై పరస్పరం అసంతృప్తిగా ఉన్నారు. తమకు ప్రాధాన్యం, పనుల కాంట్రాక్టులు ఇవ్వడం లేదని పాలకవర్గ సభ్యులంటుండగా.. సభ్యులే సహకరించడం లేదని అధ్యక్షులు వాపోతున్నారు. కొన్ని రోజుల క్రితం కీసర మున్సిపాలిటీలో 11 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సమావేశమై చైర్‌పర్సన్‌ ఒంటెత్తు పోకడలకు పోతున్నారని పేర్కొనడం అసంతృప్తులకు తార్కాణంగా నిలుస్తుంది. మరిన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.


 మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో రోజురోజుకూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఎన్నికల హామీల మేరకు పనులు చేయలేకపోతున్నామని, ప్రభుత్వం నిధులు విదల్చడం లేదని, ఒకే పార్టీ నుంచి గెలిచినా చైర్‌పర్సన్లు తమను పట్టించుకోవడం లేదనే బాధ వారిలో నెలకొంది. డబ్బు వెచ్చించి సాధించుకున్న కుర్చీలో కూర్చోవడం చైర్‌పర్సన్లకు దినదినగండంగా మారింది. అధిష్టానం ఆదేశం మేరకు చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు మద్దతిస్తే తమకు ఏమీ మిగలకపాయె అనే అవేదన కొందరు కౌన్సిలర్లు, ఎంపీటీల్లో ఉంది. అది తరచూ ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంది. జిల్లా నేత మాటలు నమ్మి మద్దతు ఇచ్చిన తమకు తగిన గుణపాఠమే ఎదురైందనే భావన కౌన్సిలర్లులో నెలకొంది. కక్కలేక.. మింగలేక అన్నట్టుగా జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించేందుకు సిద్ధమువుతున్నారు.


నిన్న జడ్పీ చైర్మన్‌.. నేడు మున్సిపల్‌ కౌన్సిలర్లు

మేడ్చల్‌ జిల్లాలో పార్టీ పదవుల ఎంపికలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పక్షపాతం వహిస్తున్నారని జడ్పీచైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి ఎదురుతిరిగారు. అన్ని మండలాల పార్టీ అధ్యక్షులను తన వర్గం వారినే నియమించారని, తనకు ఏమీ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వర్గం నాయకులతో సమావేశమై పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. దీంతో కేటీఆర్‌, కేసీఆర్‌ కలుగజేసుకొని మంత్రి మల్లారెడ్డిని మందలించారనే ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని హమీ ఇచ్చినట్టు వార్తలొచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. పాత వారికే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనయుడైన జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డికి మంత్రి మల్లారెడ్డికి మధ్య సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో జడ్పీచైర్మన్‌తో మొదలైన ధిక్కార ధోరణి ఇప్పుడు మున్సిపాలిటీలకూ పాకింది. దమ్మాయిగూడ మున్సిపల్‌ కౌన్సిలర్లు 11మంది చైర్‌పర్సన్‌ తీరుతో అసంతృప్తితో మూడు రోజుల క్రితం తూంకుంటలోని ఓ రిసార్ట్‌లో సమావేశమయ్యారు.


ఆమె ఒంటెద్దుపోకడలకు పోతూ తమను పట్టించుకోవడం లేదని, అభవృద్ధి పనులన్నీ వారి వార్డుల్లోనే చేయించుకుంటున్నారని ఆరోపించారు. దీంతో పాలక మండలి సభ్యులు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. మరికొన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లనూ ఇదే పరిస్థితి నెలకొని అధ్యక్ష పీఠాన్ని కదిలించాలనే ఆలోచనల్లో సభ్యులున్నట్టు తెలుస్తోంది. మేడ్చల్‌ జిల్లాలో నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపల్‌ కౌన్సిళ్లు, ఐదు మండల పరిషత్‌లు, ఒక జిల్లా పరిషత్‌ ఉంది. 290పైగా కౌన్సిలర్లు, 14మంది చైర్‌పర్సన్లు, 45మంది ఎంపీటీసీలు, ఐదుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీలు, ఒక జడ్పీచైర్మన్‌ ఉన్నారు. మరో ఆరు నెలల అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు అవిశ్వాసాలు ప్రవేశపెట్టే అంశంపై దృష్టి సారించారు. తిరుగుబాటుకు పావులు కదుపుతున్నారు. గెల్చిన పార్టీలో ఉంటూనే ఇలా చేసైనా అనుకున్నది సాధించాలని స్థానిక ప్రజానిధులు అనుకుంటున్నటు తెలుస్తోంది.


అంతటా అసంతృప్తులమయం 

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాటి నుంచి ప్రజలకు సేవచేసే అంశాలతో పాటు అభివృద్ధి పనుల కాంట్రాక్ట్‌ దక్కించుకొని పదోపరుకో వెనకేసుకుందామంటే చైర్‌పర్సన్లు, టీఆర్‌ఎ్‌సలోని కీలక నేతలు అడ్డుపడుతున్నారని కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో అసంతృప్తి నెలకొంది. ప్రతి పనిలో నాకూ వాటా కావాలనే కీలక నేతల ధోరణితో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఎన్నికల్లో పెట్టిన డబ్బులైనా తమ పదవీ కాలంలో వచ్చేలా లేవని అవేదన చెందుతున్నారు. భారీగా ఖర్చుపెట్టి చైర్‌పర్సన్‌ పదవి దక్కించుకున్నా.. కౌన్సిల్‌ మెంబర్లు, పాలకవర్గాల సహకారం లేదని అధ్యక్ష పీఠంపై కూర్చున్న వారిలో మరోరకమైన అసంతృప్తి నెలకొంది. ‘అన్నీ నేను చూసుకుంటా ’ అని రూ.కోట్లు దండుకున్న కీలక నేత పట్టింపులేని ధోరణి చైర్‌పర్సన్లలో కలత కల్గిస్తోంది. చైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌ ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియనిస్థితిలో పడిపోయారు.

Updated Date - 2021-12-07T04:40:31+05:30 IST