వారిది పదం బాధ... మాది తరం బాధ!

ABN , First Publish Date - 2021-10-22T08:19:26+05:30 IST

‘‘టీడీపీ నేత ఒకరు వాడిన ఒకపదం పట్టుకొని దాని గురించి సీఎం మొదలుకొని వైసీపీ నేతలంతా తెగ బాధపడిపోతున్నారు. రాష్ట్రంలో పెట్రేగిపోతున్న గంజాయి, మాదక ద్రవ్యాల వలలో చిక్కి ఒక తరం నిర్వీర్యమైపోతోందని మేం బాధపడుతున్నాం.

వారిది పదం బాధ...  మాది తరం బాధ!

  • మాదక ద్రవ్యాలు నిశ్శబ్దంగా వ్యాపిస్తున్నాయి
  • స్మగ్లర్లను వదిలి మాపై దాడులు చేస్తున్నారు
  • బోష్‌డికె పదానికి నిఘంటువులో 16 అర్థాలున్నాయి: పయ్యావుల కేశవ్‌


అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ నేత ఒకరు వాడిన ఒకపదం పట్టుకొని దాని గురించి సీఎం మొదలుకొని వైసీపీ నేతలంతా తెగ బాధపడిపోతున్నారు. రాష్ట్రంలో పెట్రేగిపోతున్న గంజాయి, మాదక ద్రవ్యాల వలలో చిక్కి ఒక తరం నిర్వీర్యమైపోతోందని మేం బాధపడుతున్నాం. ఎవరి బాధ ఏమిటో ప్రజలు గమనించాలని మా విజ్ఞప్తి’’ అని శాసనసభ పీఏసీ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. గురువారం తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనకు తానే అర్థాలు అన్వయించుకొని, అవన్నీ తననే అన్నారని చెప్పుకొంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బోష్‌డికె అన్న పదానికి నిఘంటువుల్లో 16 అర్థాలున్నాయి. బ్రిటీష్‌ వారి హయాంలో గుజరాత్‌ రాష్ట్రంలో ఆ పేరుగల ఒక గ్రామం వారిని బాగా అమాయకులన్న అర్థంతో బోష్‌డికె అని పిలిచేవారని ఒక అర్థం చెబుతోంది. బాగున్నారా అని మరో అర్థంకనిపిస్తోంది. గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి వైసీపీ ఈ రాద్ధాంతం చేస్తోంది.


గంజాయి, మాదక ద్రవ్యాలు నిశ్శబ్దంగా వ్యాపిస్తూ యువతను చెడుతోవ పట్టిస్తున్నాయి. తాడేపల్లిలో సీఎం నివాసానికి సమీపంలో జరిగిన సామూహిక అత్యాచారంలో నిందితులు గంజాయి వ్యసనపరులు. ఇలాంటివారు విపరీతంగా పెరిగిపోయి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. పాఠశాలల్లో పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కట్లలో కూడా మాదక ద్రవ్యాలు కలిసిపోతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన పడే రోజులు వచ్చాయి. ఈ దుస్థితిపై మాట్లాడుతుంటే మాపై దాడులు చేస్తున్నారు. స్మగ్లర్లను వదిలిపెట్టి మాపై దాడులు చేసి మా నోరు మూయించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి కాదు... వంద దాడులు జరిగినా డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం ఆగదు’’ అని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడానికి తమ ప్రాణాలను బలిదానం చేసిన పోలీసు అమరవీరుల ఆత్మలు క్షోభించేలా ఇప్పుడు ఉన్న పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని, ఆ శాఖను పలచన చేస్తున్నారని విమర్శించారు. తప్పు కానిస్టేబుళ్లది కాదని, ఆ శాఖ అధినేతదేనని స్పష్టంచేశారు. పైనుంచి వచ్చే ఆదేశాలను మనసు చంపుకొని చేయలేక చాలామంది సిబ్బంది నలిగిపోతున్నారని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలకు పట్టుబడిన ఒక పోలీస్‌ ఉద్యోగిని అడ్డుపెట్టుకొని లోకేశ్‌పై హత్యాయత్నం కేసుపెట్టడం దుర్మార్గమని, ఈ చిల్లర పనులు మాని ముందు క్రిమినల్స్‌ను జైళ్లలో పెట్టడంపై ఆలోచన చేయడం మంచిదన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌శాఖ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. ఆ రోజు తాడేపల్లి నుంచి మొదలుకొని టీడీపీ కార్యాలయం పక్కన ఉన్న కల్యాణ మండపం వరకూ జరిగిన ఫోన్‌ సంభాషణల డేటాను విశ్లేషిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయన్నారు. ఈ పని చేయాలని తాము కోర్టును కోరతామని, అది ఇప్పుడు జరగకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చేస్తామని కేశవ్‌ పేర్కొన్నారు. 


వైసీపీ నేతలు.. ఆంధ్రా తాలిబన్లు: ఆనంద్‌బాబు 

ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లు మాదక ద్రవ్యాలు సరఫరా చేసి, ఉగ్రవాదానికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటుంటే, ఏపీ పాలకులు ఆంధ్రా తాలిబాన్లలా మారి, వారి అడుగు జాడల్లో నడుస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రారంభించిన దీక్షలో ఆయన మాట్లాడారు. సీఎం డైరెక్షన్‌లో, డీజీపీ పర్యవేక్షణలోనే టీడీపీ కార్యాయాలు, నేతలపై దాడి జరిగిందని ఆరోపించారు. ‘‘పవిత్రమైన దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీ్‌సపై మేం లేనప్పుడు పోలీసుల అండతో, నీ గూండాలను పంపి దాడి చేయించడం కాదు. ఇప్పుడు మా సింహం చంద్రబాబు ఇక్కడే ఉన్నారు. రేపు (శుక్రవారం) సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం. నువ్వు మగాడివైతే, నీ వైసీపీ మొగోళ్ల పార్టీ అయితే, చంద్రబాబు దీక్ష ముగిసేలోగా రండి.. చూసుకుందాం..!’’ అంటూ టీడీపీ నేత బొండ ఉమా సవాల్‌ విసిరారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ అన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని పంచుమర్తి స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడుల్లో సీఎం జగన్‌రెడ్డి ఏ 1 అయితే డీజీపీ ఏ 2 అని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. 


రాష్ట్రంలో రౌడీ రాజ్యం: ఎమ్మెల్సీ కేఈ

‘‘రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం చరిత్రలోనే ఇది తొలిసారి’’ అని టీడీపీ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు. చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుశేనాపురం గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కేఈతో పాటు టీడీపీ కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మహిళా సంఘం నాయకులు పార్వతమ్మ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 


ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: ప్రభాకర్‌రెడ్డి

ప్రజల్లో చైతన్యం వచ్చి, వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజు తొందరలోనే ఉందని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత దృష్టిని మళ్లించడానికే ప్రతిపక్ష నేతలు, కార్యాలయాలపై వైసీపీ నాయకత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉంది అని జేసీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-22T08:19:26+05:30 IST