శాసనసభ్యులపై 6 నెలలకు మించి సస్పెన్షన్‌ కుదరదు

ABN , First Publish Date - 2022-01-20T07:08:26+05:30 IST

అసెంబ్లీ నుంచి శాసనసభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

శాసనసభ్యులపై 6 నెలలకు మించి సస్పెన్షన్‌ కుదరదు

అలా చేస్తే రాజ్యాంగ విరుద్ధమే

తేల్చిచెప్పిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం

న్యూఢిల్లీ, జనవరి 19: అసెంబ్లీ నుంచి శాసనసభ్యుల సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఆరు నెలలకు మించి ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయరాదని స్పష్టంచేసింది. వారిని నిరవధికంగా సస్పెండ్‌ చేసే అపరిమిత అధికారం చట్టసభలకు లేదని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తేల్చిచెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా విచారణ జరిపింది. అసెంబ్లీ నిర్ణయం అప్రజాస్వామికమని.. రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ నియోజకవర్గమూ ఆరు నెలలకు మించి ప్రాతినిధ్యం లేకుండా ఉండరాదని గుర్తుచేసింది. అతి స్వల్ప మెజారిటీతో నడుస్తున్న ప్రభుత్వాలు.. సభ్యులను దీర్ఘకాలంపాటు సస్పెండ్‌ చేస్తే పరిస్థితేంటి అని ప్రశ్నించింది. ఓ సభ్యుడిని సస్పెండ్‌ చేయాలనుకుంటే.. సమావేశాలు జరిగేంతవరకు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాల సమీక్షకు సంబంధించి కోర్టులకు పరిమిత పాత్ర మాత్రమే ఉందన్న మహారాష్ట్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 


లాయర్లు ఫోన్‌ ద్వారా హాజరు కావచ్చు 

కంప్యూటర్లు లేని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కీలకమైన వెసులుబాటు కల్పించారు. అలాంటివారు మొబైల్‌ ఫోన్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరు కావచ్చని తెలిపారు. అయితే అందులో వారి ముఖం కనిపించాలని.. గొంతు కూడా స్పష్టంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ తాజాగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఓబీసీలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌కు అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ సమాచారం కచ్చితత్వాన్ని పరిశీలించి, స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై కమిషన్‌ రెండు వారాల్లోగా సిఫార్సులు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. వలస కార్మికుల సంక్షేమం కోసం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కరోనా మూడో వేవ్‌ నేపథ్యంలో వలస కార్మికులకు సంక్షేమ చర్యల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని త్వరగా విచారించాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టును అభ్యర్థించారు.

Updated Date - 2022-01-20T07:08:26+05:30 IST