Abn logo
Jun 23 2021 @ 00:09AM

నిమ్మ రైతు కంట కన్నీటి చెమ్మ

పశ్చిమగోదావరి జిల్లాలో మెట్టప్రాంతపు మండలాలలోని 60వేల ఎకరాలలో నిమ్మ తోటలు విస్తరించి ఉన్నాయి. పెదవేగి, ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డి గూడెం, దేవరపల్లి, కొయ్యలగూడెం, లింగపాలెం, కామవరపుకోట తదితర మండలాలలో రైతులు అత్యధికంగా నిమ్మపంట సాగు చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద నిమ్మకాయల మార్కెట్ జిల్లా కేంద్రం ఏలూరులోనే ఉంది. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు రోజూ వందలాది లారీలలో నిమ్మకాయల ఎగుమతి జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి నుంచి జూన్ వరకు నిమ్మకాయలకు గిరాకీ ఉండడంతో ఈ కాలంలోనే రైతులకు కాస్త ఆదాయం వస్తుంది. అయితే గత సంవత్సరం నిమ్మ మార్కెట్ సీజన్ లోనే కరోనా మహమ్మారి వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల ఎగుమతులు లేక మార్కెట్‌లో కనీస ధర రాక నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మార్చి నెలలో రైతులకు ధర కాస్త ఆశాజనకంగా ఉండటంతో సంతోషపడ్డారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం లేదు. ఒకానొక దశలో కిలో నిమ్మకాయలకు రైతుకు రూ.100 నుంచి రూ.120  వరకు ధర వచ్చింది. సరాసరి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉండటంతో అప్పుల బారి నుంచి గట్టెక్కుతామని నిమ్మరైతులు ఆశ పడ్డారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చింది. రాష్ట్రాలలో మళ్ళీ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. మార్కెట్‌లో నిమ్మకాయల కొనుగోలును వ్యాపారులు నిలిపివేయడంతో ధరలు పతనమయ్యాయి. రైతులు మళ్ళీ తీవ్రంగా నష్టపోయారు. నిమ్మరైతుల కంట కన్నీటి చెమ్మ జాలువారుతోంది. జూన్ 18, 19 తేదీల్లో కిలో నిమ్మకాయలకు రూ.3 మాత్రమే రైతుకు ధర వచ్చింది. 50 కేజీల బస్తా నిమ్మకాయలను కోయడానికి, రవాణాకు రైతుకు రూ.410 వరకు ఖర్చవుతుంది. 50 కేజీల నిమ్మకాయల బస్తాకు రూ.150 వస్తే వ్యాపారుల కమిషన్, దిగుమతి కూలీల ఖర్చు పోగా రైతు చేతికి రూ.125 మాత్రమే వచ్చింది. పంట పెట్టుబడి ఖర్చులు అలా ఉంచితే, నిమ్మకాయలు కోసి మార్కెట్‌కి తీసుకువెళితే రవాణా, కూలీ ఖర్చులు రాకపోగా రైతే తిరిగి రూ.285 పైగా ఎదురు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది. దీంతో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో రైతులు గుండుగొలను- రాజమండ్రి జాతీయ రహదారిపై నిమ్మకాయలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడే కాదు, అనేక సంవత్సరాలుగా నిమ్మకాయలకు కనీస ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ వ్యవసాయం చేయలేక నిమ్మతోటల సాగు విరమించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నిమ్మచెట్లను పెంచిన చేతులతోనే రైతులు కన్నీటి మయమవుతూ చెట్లను నరికి వేస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేదు. ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు నిమ్మరైతుల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. రైతులు కష్టపడి పండించిన పంటలకు మార్కెట్లో కనీస ధర రాక నష్టపోతే ఆ సందర్భాలలో ధరల స్థిరీకరణ నిధి పథకం అమలు చేసి ఆదుకుంటా మనేది అధికార పక్షం ఎన్నికల హామీ. గత సంవత్సరం దానిని తూతూమంత్రంగా ప్రారంభించి వదిలివేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి అటువంటి ప్రయత్నం ఏమీలేదు. ఎకరా నిమ్మసాగుకు సంవత్సరానికి పెట్టుబడి రూ.85000 వరకు ఖర్చవుతుంది. కౌలు మరో 50 వేలు పైగా ఉంది. దీంతో పెట్టుబడి మొత్తం రూ.1,35,000 పైగా అవుతోంది. దిగుబడి 30 నుంచి 35 క్వింటాళ్లు కాగా రాబడి రూ.40 వేలు కూడా రావడం లేదు. నిమ్మ రైతులకు నష్టాలు, కష్టాలు, అప్పులే మిగులుతున్నాయి. ‘అమ్మ జన్మనిస్తే.. నిమ్మ పునర్జన్మ నిస్తుంది..’ అనే నానుడి ఉంది. గత సంవత్సరం ఈ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం కొంత ప్రచారం చేసింది. ఇదే తరహాలో మన రాష్ట్రప్రభుత్వం కూడా, ‘ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఒక నిమ్మకాయ వాడండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి.. కరోనాను నివారించండి’ అని ప్రచారం నిర్వహించి నిమ్మకాయల వినియోగం పెంచి నిమ్మ రైతులకు కనీస ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాలి. కిలో నిమ్మకాయలకు కనీస ధర రూ.30 పైగా నిర్ణయించి అవసరమైతే ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి నిమ్మరైతులను ఆదుకోవాలి. ఇతర రాష్ట్రాలలో కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ల వల్ల కలుగుతున్న రవాణా ఇబ్బందులను తొలగించాలి. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేవనే పేరుతో వ్యాపారులు నిమ్మకాయ ధరలు తగ్గించి రైతులను మోసగించే చర్యలను అడ్డుకోవాలి. నిమ్మరైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదు. గిట్టుబాటు ధర కోసం వాళ్లు ఆందోళనలకు సమాయత్తం కావాలి. గ్రామగ్రామాన సంఘటితం కావాలి.

కె. శ్రీనివాస్‌

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం