లెంట్‌ను ఇలా పాటిద్దాం!

ABN , First Publish Date - 2021-02-19T08:40:57+05:30 IST

దైవానికి దగ్గరయ్యే మార్గంగా ఉపవాస దీక్ష వహించడం దాదాపు అన్ని సంస్కృతులలోనూ కనిపిస్తుంది. క్రైస్తవులలోనూ ప్రతి సంవత్సరం నలభై రోజుల పాటు...

లెంట్‌ను ఇలా పాటిద్దాం!

దైవానికి దగ్గరయ్యే మార్గంగా ఉపవాస దీక్ష వహించడం దాదాపు అన్ని సంస్కృతులలోనూ కనిపిస్తుంది. క్రైస్తవులలోనూ ప్రతి సంవత్సరం నలభై రోజుల పాటు... సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ... ఉపవాసాలు చేసే సంప్రదాయం ఉంది. దీన్ని ‘లెంట్‌ సీజన్‌’ అంటారు. ఈస్టర్‌ పండుగకు సుమారు 46 రోజుల ముందు, ‘భస్మ బుధవారం’ (యాష్‌ వెడ్నస్‌ డే) రోజున ఈ దీక్షలు ప్రారంభమవుతాయి. ఆ రోజు క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. హాజరైన విశ్వాసుల నుదుటిపై భస్మాన్ని పాస్టర్లు దిద్దుతారు. ప్రతి ఒక్కరూ దుమ్ములో నుంచే పుట్టారనీ, చివరకు ఆ దుమ్ములోకే తిరిగి వెళ్తారనీ గుర్తు చేయడం దీని వెనుక ఉద్దేశం.


గుడ్‌ ఫ్రైడేకి ముందు, జెరూసలేమ్‌లో ఏసు క్రీస్తు ప్రవేశించిన సందర్భంగా ఆయనకు మ్రానికొమ్మలతో ప్రజలు స్వాగతం పలికారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ‘మ్రానికొమ్మల’ (మట్టల) ఆదివారాన్ని (పామ్‌ సండే) నిర్వహిస్తారు. మునుపటి ఏడాది ఆ కార్యక్రమాల్లో ఉపయోగించిన మట్టలను కాల్చి, ఆ బూడిదను ‘భస్మ బుధవారం’ నాడు విశ్వాసుల నుదుట అలంకరిస్తారు. దీనితో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఆదివారాలను క్రీస్తు పునరుత్థాన దినాలుగా పరిగణిస్తారు. కాబట్టి ఉపవాసాల నుంచి... మధ్యలో వచ్చే ఆరు ఆదివారాలకు మినహాయింపు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న... ‘యాష్‌ వెడ్నస్‌డే’తో లెంట్‌ సీజన్‌ ప్రారంభమయింది. ఈస్టర్‌ ముందు రోజువరకూ, అంటే ఏప్రిల్‌ మూడో తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. 


విశ్వాసులకు లెంట్‌ దినాలు అందివచ్చిన గొప్ప అవకాశం. ఏసు క్రీస్తు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికీ, తప్పుడు పనుల నుంచీ, దురలవాట్ల నుంచీ దూరం కావడానికీ, శరీరాన్నీ, మనసునూ పరిశుద్ధం చేసుకోవడానికీ, చిత్తశుద్ధితో ప్రార్థనలు చేయడానికీ ఈ రోజులను ఉపయోగించుకోవాలి. ఒక విధంగా ఈ నలభై రోజులనూ స్వీయ పరీక్షా సమయంగా విశ్వాసులు భావించాలి. మొక్కుబడిగానో, గొప్ప కోసమో, ఎవరో చేస్తున్నారనో ఉపవాసాలైనా, ప్రార్థనలైనా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఉపవాస దినాల్లో మానుకున్న దురభ్యాసాలను... దీక్ష పూర్తి కాగానే తిరిగి ప్రారంభించడం కూడా తగనిపని. స్వార్థాన్ని, అహంకారాన్నీ వదులుకున్నప్పుడు, దైవమే సర్వస్వం అనే భావనను మనసులో నింపుకొన్నప్పుడు మాత్రమే... దైవానికి విశ్వాసులు మరింత దగ్గర కాగలరు. లెంట్‌ ఉపవాసాలు ఈ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని భావించి, వాటిని ఆచరించాలి. 

Updated Date - 2021-02-19T08:40:57+05:30 IST