‘దారి’ద్య్రపు పనులు!

ABN , First Publish Date - 2021-02-22T04:35:20+05:30 IST

పదికాలాల పాటు ఉండాల్సిన రోడ్డు నిర్మాణంలోనే పగుళ్లిస్తోంది. నాణ్యమైన మట్టికి బదులు నాసిరకమైన దుబ్బ వినియోగిస్తున్నారు. నీటిని చల్లడం లేదు. రోలింగ్‌ చేయడం లేదు. పైగా రోడ్డు నిర్మాణంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. దీంతో రైతులు ప్రజాప్రతినిధుల కు ఫిర్యాదు చేసేందుకు యోచిస్తున్నారు.

‘దారి’ద్య్రపు పనులు!
ఎర్రమట్టితో నాసిరకంగా నిర్మిస్తున్న దమ్మపేట, అచుతాపురం రహదారి

నాసిరకంగా అచుతాపురం, దమ్మపేట బీటీ రోడ్డు పనులు

కాంట్రాక్టర్‌కు అధికారులు వత్తాసు పలుకుతున్నారంటున్న రైతులు

నామా, మంత్రి పువ్వాడ, మెచ్చాకు ఫిర్యాదు చేసేందుకు యోచన

దమ్మపేట, ఫిబ్రవరి 21: పదికాలాల పాటు ఉండాల్సిన రోడ్డు నిర్మాణంలోనే పగుళ్లిస్తోంది. నాణ్యమైన మట్టికి బదులు నాసిరకమైన దుబ్బ వినియోగిస్తున్నారు. నీటిని చల్లడం లేదు. రోలింగ్‌ చేయడం లేదు. పైగా రోడ్డు నిర్మాణంలో హెచ్చుతగ్గులుంటున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. దీంతో రైతులు ప్రజాప్రతినిధుల కు ఫిర్యాదు చేసేందుకు యోచిస్తున్నారు.

అధ్వానంగా పనులు 

మండలంలోని అచుతాపురం, దమ్మపేట బీటీ రోడ్డు పనులు అధ్వానంగా సాగుతున్నాయి. అధికారులు కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ పనులను నాసిరకంగా చేస్తూ రూ. కోట్లను వృఽథా చేస్తున్నాంటూ పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి, చవుడు మట్టి పోసి రోడ్డు నిర్మిస్తే ఎన్నాళ్లుంటుందని ప్రశ్ని స్తున్నారు. ఆదివారం రహదారి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ప్రదేశానికి వెళ్లి పనులు నిలిపేయాలని నిలదీశారు. రహదారి నిర్మాణంలో పోసిన లూజు మట్టిని తొలగించి నాణ్యమైన మొరం పోసి, రోలింగ్‌, వాటరింగ్‌ చేస్తూ రహదారి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్‌ బ్లేడు ట్రాక్టర్‌తో పైపైన లెవెల్‌ చేసి ఎర్రమట్టితో రోడ్డు నిర్మిస్తున్నారని ఆరోపించారు. తాము అనేక మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రహదారి నిర్మాణంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటున్నాయని ఆరోపించారు. రహదారిపైన నీళ్లు పోస్తున్నారో, చల్లుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే సాకులు చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పనులను నాణ్యంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షం లో ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

రహదారి నిర్మాణం నాసిరకంగా ఉంది: పగడాల రాంబాబు, రైతు

ఎంతో కాలంగా రహదారి నిరాఽ్మణం కోసం పోరాటం చేశాం. కానీ కాంట్రాక్టర్‌ నాసిరకంగా పనులు చేస్తున్నారు. నిబంధనలు ఎక్కడా పాటించటం లేదని అంటున్నారు. పదికాలాలపాటు మనాల్సిన రహదారి రెండు మూడు నెలలకే పాడయ్యే పరిస్థితి నెలకొంది. ప్రశ్నిస్తే ఐదేళ్లపాటు కాంట్రాక్లరే పనులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. రోడ్డు వేసిన కొద్ది కాలానికే పాడయితే మర్మతులు చేతులు దులుపుకుంటారా? రోడ్దుపనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాల్సి ఉండగా, కొందరు అధికారులు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతున్నారు.

ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేస్తాం: చిల్లా ధర్మారావు, రైతు

రూ.కోట్లు పెట్టి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేస్తే నాసిరకంగా పనులు చేస్తున్నారు. అధికారులు పట్టించకోవడం లేదు. నిబంధనలు పాటించకుండా చేపడుతున్న రహదారి నిర్మాణంపై ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తాం. రోడ్డుకు సరిగ్గా నీటిని క్యూరింగ్‌ చేయడం లేదు. రోడ్డు నిర్మాణంలోనూ హెచ్చుతగ్గులుంటున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.

పీఆర్‌ ఏఈ శ్రీధర్‌ ఏమంటున్నారంటే..

రోడ్డు నిర్మాణానికి సంబంధించి రైతులు చేస్తున్న ఆరోపణలన్నీ అపోహలు మాత్రమే. నిబంధనల ప్రకారమే రహదారి పనులు చేస్తున్నాం. రైతులు చెప్పే వాటిగురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. నాణ్యతాప్రమాణాల మేరకే రోడ్డు నిర్మిస్తున్నాం.

Updated Date - 2021-02-22T04:35:20+05:30 IST