గర్వభంగం!

ABN , First Publish Date - 2021-09-05T05:30:00+05:30 IST

విజయనగరంలో విద్యుల్లత అనే ఒక అందమైన మహిళ నివసించేది. అందగత్తె అనే పొగరుతో పాటు బాగా తెలివైనదాన్ని అనే గర్వం కూడా ఆమెకు ఉండేది...

గర్వభంగం!

విజయనగరంలో విద్యుల్లత అనే ఒక అందమైన మహిళ నివసించేది. అందగత్తె అనే పొగరుతో పాటు బాగా తెలివైనదాన్ని అనే గర్వం కూడా ఆమెకు ఉండేది. ఆ గర్వంతోనే తన ఇంటి గోడకు ‘‘హాస్యం, తెలివిలో నన్ను ఓడించిన వారికి వెయ్యి బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను’’ అని రాయించింది. ఆ ఛాలెంజ్‌ ఎంతోమంది పండితుల ఇగోను హర్ట్‌ చేసింది. అయితే ఆమెపై పోటీకి వచ్చిన వారందరూ పరాజయం పాలయ్యారు. ఒకరోజు కట్టెలు అమ్ముకునే వ్యక్తి ఒకరు విద్యుల్లత ఇంటి ముందు నిలుచుని ‘‘కట్టెలమ్మా... కట్టెలు...’’ అని అరవసాగాడు.  ఆ అరుపులకు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన విద్యుల్లత మొత్తం కట్టెలు ఎంతకు ఇస్తావు? అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి ‘‘ఈ కట్టెలు నేను డబ్బులకు అమ్మను. చేతికి సరిపోయే ధాన్యం ఇవ్వండి. ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’’ అన్నాడు. ‘‘అయితే సరే! కట్టెలు అక్కడ దింపిన తరువాత వచ్చి ధాన్యం తీసుకో’’ అంది విద్యుల్లత. ఆ కట్టెలమ్మే వ్యక్తి మరోసారి చెబుతూ ‘‘ఇందులో ఎలాంటి బేరసారాలు లేవు. చేతికి సరిపోయే ధాన్యం ఇవ్వాలి. ఎక్కువా ఉండకూడదు. తక్కువా ఉండకూడదు.’’ అన్నాడు. సరేనన్న విద్యుల్లత ఇంట్లోకి వెళ్లి చేతి నిండా ధాన్యం పట్టుకొచ్చి ఇవ్వబోయింది. అప్పుడా వ్యక్తి ‘‘అమ్మగారూ నేను ముందే చెప్పాను. చేతికి సరిపోయే ధాన్యం కావాలని. ఒకవేళ మీరు అలా ఇవ్వలేకపోతే వేయి బంగారు నాణేలు ఇచ్చి, గోడపై రాసిన ఆ ప్రకటన తీసేయండి’’ అన్నాడు. దాంతో విద్యుల్లతకు కోపమొచ్చి ‘ఏం మాట్లాడుతున్నావు?’ అని అరిచింది. ఇద్దరి మధ్యా తీవ్రమైన వాగ్యుద్దం నడిచింది. తరువాత విద్యుల్లత న్యాయం చేయమని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో మాట్లాడుతూ ‘‘అతడు చెప్పిన ధర ఇవ్వడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు వెయ్యి బంగారు నాణేలు కావాలని అడుగుతున్నాడు. మీరేం న్యాయం చేయండి’’ అని న్యాయమూర్తికి విన్నవించుకుంది. వెంటనే న్యాయమూర్తి ఆ కట్టెలమ్మే వ్యక్తిని వివరణ అడిగాడు. ‘‘మై లార్డ్‌! చేతికి సరిపోయే ధాన్యం ఇవ్వాలని ముందే చెప్పాను. అంటే దానర్థం చేతిలో సరిగ్గా సరిపోయే ధాన్యం ఇవ్వాలని. కానీ ఆమె చేతినిండా ధాన్యం గింజలను అని తప్పుగా అర్థం చేసుకుంది’’ అన్నాడు. ఆ మాటలు విన్న విద్యుల్లతకు తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. ఆ కట్టెలమ్మే వ్యక్తికి అనుకూలంగా తీర్పు వెలువడింది. వెంటనే ఆ వ్యక్తి తన తలపాగాను తీశాడు. అతను ఎవరోకాదు తెనాలి రామకృష్ణ. 

Updated Date - 2021-09-05T05:30:00+05:30 IST