కాలేజీలో పాఠాలు 15 రోజులే

ABN , First Publish Date - 2021-01-17T09:01:27+05:30 IST

ఫిబ్రవరి 1 నుంచి తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీల ప్రారంభానికి ప్రణాళికను సిద్ధం చేశామని

కాలేజీలో పాఠాలు 15 రోజులే

ముందుగా 3, 4 సంవత్సరాల విద్యార్థులకు 

ఫిబ్రవరి 16 నుంచి ఫస్టియర్‌, సెకండియర్‌ క్లాసులు

‘ఆంధ్రజ్యోతి’తో జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ మన్జూర్‌ హుసేన్‌


 హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 1 నుంచి తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీల ప్రారంభానికి ప్రణాళికను సిద్ధం చేశామని జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ మన్జూర్‌ హుసేన్‌ తెలిపారు. కళాశాలల ప్రారంభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెక్టార్‌ గోవర్ధన్‌, వివిధ విభాగాల డైరెక్టర్లు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో జేఎన్‌టీయూలో శుక్రవారం సమావేశమయ్యారు. ఫిబ్రవరి నెలకు సంబంఽధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ వివరాలను రిజిస్ర్టార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆయన మాటల్లోనే...


ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతులు.. 

జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీల్లో విద్యార్థులను తరగతులకు విడతలవారీగా అనుమతించాలని నిర్ణయించాం. ముందుగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులు ఫిబ్రవరి 1నుంచి 15 వరకు తరగతులకు హాజరవుతారు. ఈ సమయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులుంటాయి. ఫిబ్రవరి 16 నుంచి 28వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు; తృతీయ, చివరి సంవత్సరం వారికి ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయి. బోధనకు అంతరాయం లేకుండా అందరికీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తాం. 


హాస్టళ్లలో ప్రత్యేక చర్యలు.. 

యూనివర్సిటీతోపాటు కరీంనగర్‌ జిల్లా జగిత్యాల, మంథని, మెదక్‌ జిల్లా సుల్తాన్‌పూర్‌లోని క్యాంపస్‌ హాస్టళ్లనూ ప్రారంభిస్తాం. గత 10 నెలలుగా హాస్టళ్లు ఖాళీగా ఉండటంతో వెంటనే శుభ్రపరచి, శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించాం. హాస్టళ్లలో ప్రస్తుతానికి ఒక గదిలో ఒక్కరికే అనుమతిస్తాం. తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం. మార్చి నాటికి పరిస్థితి మెరుగైతే.. విద్యార్థులందరినీ అనుమతించే విషయాన్ని పరిశీలిస్తాం. జేఎన్‌టీయూ తీసుకున్న నిర్ణయాలను వివరించేందుకు అన్ని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం లేదా బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం.


ముందుగా ‘ల్యాబ్‌’ తరగతులకు ప్రాధాన్యం..

గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత తరగతులన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే కొనసాగుతున్నాయి. అన్నీ థియరీ క్లాసులే కావడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు దూరమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి కళాశాలలు ప్రారంభం కాగానే ముందుగా ల్యాబ్‌ తరగతులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. మార్చి ఆఖరు నాటికి బీటెక్‌ ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్‌ ముగుస్తుంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ మాస్క్‌ తప్పనిసరి. 

Updated Date - 2021-01-17T09:01:27+05:30 IST