శాంతి, సామరస్యాలకు మార్గం వెతుకుదాం

ABN , First Publish Date - 2020-02-29T06:19:08+05:30 IST

1984లో ఢిల్లీలో సిక్కుల ఊచకోత, 2002లో గుజరాత్‌ మారణహోమం, 2020లో మళ్లీ ఢిల్లీలో మారణకాండ. దేశ చరిత్రపై ఎన్నటికీ చెరిగిపోని మసకలు...

శాంతి, సామరస్యాలకు మార్గం వెతుకుదాం

ఏమైందీ దేశానికి!


1984లో ఢిల్లీలో సిక్కుల ఊచకోత, 2002లో గుజరాత్‌ మారణహోమం, 2020లో మళ్లీ ఢిల్లీలో మారణకాండ. దేశ చరిత్రపై ఎన్నటికీ చెరిగిపోని మసకలు. పునరావృతమవుతున్న ఈ విషాదాల నుంచి దేశానికి విముక్తి ఎన్నడు?


ఈ వారం భారత రాజధాని ఢిల్లీ నగర వీధుల్లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశ రాజకీయాలలో పెరుగుతున్న అమానవీయ ధోరణికి, నియంతృత్వ పోకడలకు, అప్రజాస్వామిక వాతావరణానికి దర్పణం పడుతున్నాయి. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. వందలాది మంది గాయాలతో, విరిగిన చేతులతో, తెగిపడిపోయిన శరీరాంగాలతో జీవచ్ఛవాలై అసుపత్రుల్లో పడి ఉన్నారు. ఈ హింసాకాండపై తక్షణమే స్పందించిన హైకోర్టు జడ్జిని అర్థరాత్రి ఆగమేఘాల మీద బదిలీ చేయడం ఈ అకృత్యాలకు పరాకాష్ఠ.


పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మౌనం వహించడం, బయటి శక్తులు వారిపై మారణాయుధాలతో దాడి చేయడం, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దేనికి సంకేతం? ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు అచేతనమై, రాజ్యాంగం ప్రసాదించిన ప్రతిఘటనా హక్కును కాలరాచి వేస్తే ఇది నాగరిక సమాజమని ఎలా భావించగలం‌! అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి మా శోకతప్త నివాళులు. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాం. ఈ అప్రజాస్వామిక, అమానవీయ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రజాస్వామ్య వాదులు, మేధావులు సంఘటితంగా మార్గం వెతకాలని పిలుపునిస్తున్నాం.

అంబటి నాగయ్య, అధ్యక్షులు

రాజేంద్రబాబు అర్విణి, సమన్వయకర్త

సాజి గోపాల్‌, కన్వీనర్‌ తె.వి.వే. నార్త్‌ అమెరికా

పి. సైదులు, ప్రచార కార్యదర్శి

తెలంగాణ విద్యావంతుల వేదిక

Updated Date - 2020-02-29T06:19:08+05:30 IST