పోస్ట్‌ కొవిడ్‌ మీద దృష్టి పెడదాం!

ABN , First Publish Date - 2022-01-26T07:39:10+05:30 IST

వైర్‌సకన్నా తీవ్రంగా కొవిడ్‌ భయం జనంలోకి జొరబడ్డ సమయంలో, వైరస్‌ గురించి అధ్యయనం చేస్తూ, దాని ఆనుపానులు తెలుసుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కీలకపాత్ర పోషించారు డాక్టర్‌ పెన్నా కృష్ణప్రశాంతి.

పోస్ట్‌ కొవిడ్‌ మీద దృష్టి పెడదాం!

ప్రస్తుతం ప్రమాదం లేదు సరే, భవిష్యత్తు మాటేమిటి?

తేలిగ్గా తీసుకోకుండా అధ్యయనాలు జరగాలి

డాక్టర్‌ పెన్నా కృష్ణప్రశాంతి


తిరుపతి - ఆంధ్రజ్యోతి: వైర్‌సకన్నా తీవ్రంగా కొవిడ్‌ భయం జనంలోకి జొరబడ్డ సమయంలో, వైరస్‌ గురించి అధ్యయనం చేస్తూ, దాని ఆనుపానులు తెలుసుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కీలకపాత్ర పోషించారు డాక్టర్‌ పెన్నా కృష్ణప్రశాంతి. కొవిడ్‌పై వచ్చే సవాలక్ష సందేహాలకు సమాధానాలను క్లుప్తంగా వీడియోల రూపంలో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.  తొలి రెండు దశల్లోనూ కొవిడ్‌ పర్యవేక్షణ కమిటీ సభ్యురాలిగా కొవిడ్‌ కేంద్రాలను, ఆస్పత్రులను సందర్శించి అనేక సూచనలు చేశారు. ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలతో జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఒమైక్రాన్‌ అంటే అన్నివర్గాల్లో లెక్కలేకుండా ఉన్న ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్‌ కృష్ణప్రశాంతి చేస్తున్న సూచనలు ఇవి... 


ఊపిరితిత్తుల మీద ఒమైక్రాన్‌ దాడి 

చేయడం లేదు కాబట్టి భయపడనవసరం లేదు అని మరీ నిశ్చింతగా ఉండకూడదు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారి మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్నదే ముఖ్యం. ఇంకో రెండు మూడు నెలల తర్వాత గానీ ఇది తెలీదు. అసలు జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ జరగడం లేదు కాబట్టి వస్తున్నదంతా ఒమైక్రానేనా లేక డెల్టాకూడా ఉందా అనేది తెలియదు.  కాబట్టి స్వచ్ఛందంగా కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జ్వరం వంటివి కనిపించగానే హోం ఐసొలేషన్‌కి వెళ్లిపోవాలి. 


8 రోజులు సరిపోతుందా? 

కొవిడ్‌ పాజిటివ్‌ అయినవారు వారం రోజులు తప్పనిసరిగా ఇంట్లోనే విడిగా ఉండాలి. ఈ వారంలో చివరి మూడు రోజులు జ్వరం లేకపోతే, దగ్గు లేకపోతే  బయటకు రావచ్చు. అయినా ఇంకో వారం పాటు వీరు మాస్క్‌ తీయకుండా ఉండాలి. ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మాత్రం 8 రోజులకు మించి వైరస్‌ శరీరంలో ఉండే అవకాశం ఉంది. వీరు 14 రోజుల పాటు సమూహాల్లోకి రాకపోవడం మంచిది. 


బడుల్లో అవగాహన కార్యక్రమాలు

బడులు నడుస్తున్నాయి. టీచర్లు కొవిడ్‌ పాజిటివ్‌ అవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రతి బడిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బడికి వచ్చిన పిల్లల్లో ఎవరైనా కొవిడ్‌ లక్షణాలతో ఉంటే వారిని వెంటనే విడిగా ఒక గదిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. రోజూ పది నిమిషాల పాటు పిల్లలకు కొవిడ్‌పై టీచర్లు అవగాహన కల్పించాలి. ఇందువల్ల ఇంట్లో పెద్దలు కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకునేలా పిల్లలు ఒత్తిడి చేస్తారు. 


టెస్ట్‌ ఎప్పుడు చేసుకోవాలి? :

స్వల్ప లక్షణాలున్న అందరికీ టెస్ట్‌లు చేయడం లేదు కదా అని ఆందోళన చెందవద్దు. మూడు రోజులైనా జ్వరం తగ్గకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులున్నా ర్యాపిడ్‌ టెస్ట్‌ చేసుకోవాలి. అందులో పాజిటివ్‌ వస్తే కొవిడ్‌ పాజిటివ్‌ అనే భావించాలి. వెంటనే ఐసొలేట్‌ కావాలి. ఒక వేళ రాపిడ్‌లో నెగటివ్‌ వచ్చినా లక్షణాలు తగ్గకపోతే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ చేసుకోవాలి. ఆందోళనతో అనవసరమైన ల్యాబ్‌ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. 


కట్టడికి ఇలా చేయాలి

కొవిడ్‌ కట్టడికి ఇప్పుడు జిల్లాలో చేపడుతున్న చర్యలు సరిపోవు. లాక్‌డౌన్‌ పరిష్కారం కాకపోవచ్చు గానీ, రాత్రి 8 నుంచీ ఉదయం 5 దాకా కర్ఫ్యూ అమలు చేస్తే మేలు. పెళ్లిళ్లు వంటి కార్యాలు జరిగే చోట, మాల్స్‌లో పెద్ద సమూహాలు ఉండకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. టోల్‌ ఫ్రీ నెంబర్‌ పెట్టి కొవిడ్‌ సందేహాలను నివృత్తి చేసుకునే ఏర్పాటు చేయాలి. గతంతో పోలిస్తే కొవిడ్‌ కేంద్రాల అవసరం తగ్గవచ్చు.అయితే తిరుపతిలోనే వీటిని కేంద్రీకరించకుండా జిల్లావ్యాప్తంగా విస్తరించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో కొవిడ్‌ ఓపీ ఉండాలి. కొత్తగా తీసుకున్న డాక్టర్లను వీటిల్లో నియమించాలి. ప్రతి కేంద్రంలో ఇద్దరుండేలా చూడాలి.  ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఓపీ నడిపితే, కొవిడ్‌ తీవ్రతను అంచనావేసి లక్షణాలను బట్టి హోం ఐసొలేషన్‌కు, కొవిడ్‌ కేంద్రాలకు పంపవచ్చు. ఎక్కువ రిస్క్‌ ఉన్నవారిని గుర్తించి పెద్ద ఆస్పత్రులకు తరలించవచ్చు. 


పోస్ట్‌ కొవిడ్‌ మీద అధ్యయనం అవసరం

గత అనుభవాలతో అన్ని చోట్లా ఆక్సిజన్‌ బెడ్లు,  ఐసీయూలు సిద్ధం చేసుకున్నారు. ఆ అవసరం లేకుండా ఒమైక్రాన్‌ వచ్చింది. ప్రస్తుతం ప్రాణాలు తీయడం లేదని నిర్లక్ష్యం చేయడానికి లేదు. పోస్ట్‌ కొవిడ్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తగిన అధ్యయనాలు జరగాలి. ప్రతి ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ క్లినిక్‌, పోస్ట్‌ కోవిడ్‌ ఓపీ ఏర్పాటు చేయాలి. వీటికి వచ్చేవారి సమాచారం అన్ని వైద్య విభాగాల పీజీ విద్యార్ధుల సహకారంతో సేకరించాలి.వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కొవిడ్‌ వచ్చినవారు, రెండుసార్లు కొవిడ్‌ వచ్చినవారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిశీలించాలి. కనీసం తిరుపతి, మదనపల్లె, చిత్తూరుల్లో అయినా ఈ పని చేయగలిగితే ఈ సమాచారం భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. 


మార్చి ఆఖరికి స్వేచ్ఛ


ఒమైక్రాన్‌ ఫిబ్రవరి మొదటివారంలో పీక్‌కి వెళ్తుందని ఒక అంచనా. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మన జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి గనుక దీని ప్రభావం మరింత కాలం ఉండే అవకాశం ఉంది.ఆందోళన పడకుండా, అనవసరమైన పరీక్షలు, మందులు వాడకుండా తగిన వైద్యపర్యవేక్షణలో ఉంటే కొవిడ్‌ను జయించవచ్చు అని అనుభవం మనకు నేర్పింది. నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తే మనం త్వరలోనే ఈ మహమ్మారి కోరల్లోంచి బయటపడి మునుపటి స్వేచ్ఛాజీవితాన్ని అనుభవించవచ్చు. మార్చి చివరినాటికి సాధారణ ఫ్లూలా మారి కొవిడ్‌ ఎండమిక్‌ దశకు చేరుకుంటుందని అనుకుంటున్నారు. ప్రపంచమంతా కూడా ఇలా ఆశపడుతోంది. మనమూ కోరుకుందాం. 

Updated Date - 2022-01-26T07:39:10+05:30 IST