ఇక అమెరికా వెళ్లొచ్చు

ABN , First Publish Date - 2021-10-27T09:05:26+05:30 IST

ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసిన అగ్రరాజ్యం

ఇక అమెరికా వెళ్లొచ్చు

ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసిన అగ్రరాజ్యం

భారత్‌తో పాటు అన్ని దేశాలకూ వర్తింపు

నవంబరు 8 నుంచి అమల్లోకి నిబంధనలు

వాషింగ్టన్‌, అక్టోబరు 26: అమెరికా వెళ్లాలనుకునే వారికి శుభవార్త. కొవిడ్‌ నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను అగ్రరాజ్యం ఎత్తివేయనుంది. పూర్తి స్థాయిలో టీకా పొందిన విదేశీయులు తమ దేశానికి వచ్చేందుకు అనుమతించనుంది. భారత్‌ సహా ప్రపంచంలోని అన్ని దేశాల వారికి వర్తించే ఈ నిర్ణయం నవంబరు 8 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడి నివాసం సోమవారం వైట్‌హౌస్‌ ఓ ప్రకటన చేసింది.  ప్రయాణికులు విమానం ఎక్కేముందుకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం చూపాల్సి ఉంటుంది. కాగా, కొత్త నిబంధనల్లో కొవిడ్‌ టెస్టు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, మాస్క్‌ ధారణకు సంబంధించి మార్గదర్శకాలను పేర్కొంది. ప్రయాణికుడు సమర్పించిన కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ అధీకృత సంస్థల నుంచి జారీ అయినదా? లేదా? తీసుకున్న తేదీ, ప్రదేశం తదితర వివరాలను విమానయాన సంస్థలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. విదేశీ పౌరులకు టీకా నిబంధనలో స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. 18 ఏళ్లలోపు పిల్లలు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నవారు, టీకాతో వైద్య పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నవారు, అత్యవసర లేదా మానవతా కారణాల రీత్యా ప్రయాణం అవసరమైవారు, టీకా లభ్యత తక్కువగా ఉన్న దేశాల నుంచి పర్యాటకేతర వీసాలపై వస్తున్నవారు ఈ జాబితాలో ఉన్నారు. వీరు 60 రోజుల కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉంటే టీకా పొందాల్సి ఉంటుంది. కాగా, రష్యాలో కరోనా మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం అత్యధికంగా 1,106 మంది చనిపోయారు. అయితే, కేసులు 36,446కు పరిమితమయ్యాయి. కొవిడ్‌ కేసుల నమోదుతో చైనాలోని 40 లక్షల జనాభా ఉన్న లాన్‌జూ నగరంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలిచ్చారు.  

‘కొవాగ్జిన్‌’పై మరింత సమాచారం అవసరం

భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల మంజూరుకు మరికొంత సమాచారం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సాంకేతిక సలహా కమిటీ పేర్కొంది. ప్రమాద ప్రయోజనాల అంచనా కోసం ఈ వివరాలు కావాలని తెలిపింది. కొవాగ్జిన్‌పై కమిటీ మంగళవారం సమీక్ష జరిపింది.

Updated Date - 2021-10-27T09:05:26+05:30 IST