గల్ఫ్‌కు వెళ్దాం.. మళ్లీ క్షమాభిక్ష పిటిషన్‌ వేద్దాం!

ABN , First Publish Date - 2021-06-17T08:47:51+05:30 IST

హత్య కేసులో దుబాయ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్లకు చెందిన కార్మికులను విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

గల్ఫ్‌కు వెళ్దాం.. మళ్లీ క్షమాభిక్ష పిటిషన్‌ వేద్దాం!

  • అక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న 
  • ఖైదీల కుటుంబాలకు కేటీఆర్‌ హామీ


సిరిసిల్ల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): హత్య కేసులో దుబాయ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్లకు చెందిన కార్మికులను విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. గల్ఫ్‌కు వెళ్లి.. వారిని విడిపించేందుకు మరోసారి క్షమాభిక్ష పిటిషన్‌ వేద్దామని పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల విచ్చేసిన కేటీఆర్‌ను బాధిత కుటుంబీకులు కలిసి మొరపెట్టుకున్నారు. 2004లో  సిరిసిల్లకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి ఒక కంపెనీలో పనికి కుదిరారు. కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్‌, చందుర్తి మండలానికి చెందిన గోలం నాంపల్లి, శివరాత్రి హన్మాండ్లు కూడా అదే కంపెనీలో పని చేశారు. వీరంతా కలిసి 2005లో కంపెనీలో వైర్లను దొంగతనం చేశారు. 


బహదూర్‌ అనే వాచ్‌మన్‌ చూడడంతో అతడిని హత్య చేశారు. నేరం రుజువు కావడంతో అక్కడి కోర్టు వారికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దుబాయ్‌ చట్టాల ప్రకారం హతుడి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల చేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కేటీఆర్‌.. బహదూర్‌ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరిపారు. పరిహారం కింద రూ.15 లక్షలు ఇప్పించి, క్షమాభిక్ష పత్రాలపై సంతకాలు చేయించారు. దుబాయ్‌ చట్టాల్లో మార్పులు రావడంతో వారి క్షమాభిక్షను కోర్టు కొట్టివేసింది. తాజా చట్టాల ప్రకారం 15 ఏళ్లు గడిచిన తర్వాత క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. దరఖాస్తు చేసుకున్నా.. సరైన పత్రాలు లేకపోవడంతో మళ్లీ కొట్టివేశారు. దీంతో బాధిత కుటుంబాలు మంత్రిని కలిసి విన్నవించుకున్నాయి.

Updated Date - 2021-06-17T08:47:51+05:30 IST