‘అఖండ’ జ్యోతిలా వెలుగు పంచాలి!

‘అఖండ’  ప్రీ రిలీజ్‌ వేడుకలో అల్లు అర్జున్‌

‘‘నటీనటులు నిత్యావసర వసువుల్లాంటివాళ్లు. ప్రతిదినం ప్రేక్షకులకు కనిపించాల్సిందే’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా షూటింగులు చేశాం. ‘అఖండ’ మాత్రమే కాదు.. ఆ తరవాత విడుదలయ్యే ‘పుష్ప’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘ఆచార్య’... ఇలా చిన్నా, పెద్దా తేడా లేదు. అన్ని సినిమాలూ బాగా ఆడాలి. ప్రభుత్వ సహాయ సహకారాలు చిత్రసీమకు అందాల’’న్నారు. ‘‘బాలయ్య ఓ ఆటంబాబు. దాన్ని ఎలా పేల్చాలో బోయపాటికే బాగా తెలుసు. ఆ సీక్రెట్‌ ఆయన దాచుకోకుండా మా అందరికీ చెప్పాల’’న్నారు రాజమౌళి. ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘నందమూరి కుటుంబంతో మా అనుబంధం ఇప్పటిది కాదు. అల్లు రామలింగయ్య గారికి ఎన్టీఆర్‌ గారితో చాలా చనువు ఉండేది. బాలకృష్ణ గారి వాచకం అంటే నాకు చాలా ఇష్టం. ఇది వరకు చిన్న సినిమాలపై సానుభూతి ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద సినిమాలకు కష్టం వచ్చి పడింది. రెండో లాక్‌ డౌన్‌ తరవాత వస్తున్న అతి పెద్ద సినిమా ‘అఖండ’. ఈ చిత్రం అఖండ జ్యోతిలా చిత్రసీమకు వెలుగు పంచివ్వాల’’న్నారు.


Advertisement