Abn logo
Sep 21 2021 @ 01:02AM

ఆక్రమిద్దాం.. అమ్మేద్దాం!

ఈపురుపాలెం వైపు కుందేరు వెంట వేసిన అనధికార లేఅవుట్‌

సొంతది కొంత... ప్రభుత్వ స్థలం మరికొంత..

చీరాలలో విచ్చలవిడిగా అనధికార లేఅవుట్లు 

కుందేరును కూడా ఆక్రమించి ప్లాట్లు

ఇప్పటికే సుమారు 2 ఎకరాలు కబ్జా

నష్టపోతున్న కొనుగోలుదారులు

నోటీసులు ఇచ్చామంటున్న పంచాయతీ కార్యదర్శులు

చర్యలు చేపట్టని రెవెన్యూ అధికారులు

అనధికార  లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అందులో సొంత స్థలం కొంతైతే ప్రభుత్వానిది మరికొంత. నిబంధనల మేరకు అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ విక్రయాలు చేస్తున్నారు. కొందరు ప్లాట్లు వేద్దాం.. పైసలు దండుకుందాం అంటూ ముందుకు సాగుతున్నారు. ఇంకొందరు ఏకంగా కుందేరును కనుమరుగు చేసేలా పఽథకాన్ని రచించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈపురుపాలెం పరిధిలో కొందరు, తోటవారిపాలెం పరిధిలో కొందరు ఆయా పంచాయతీల అనుమతి లేకుండానే వ్యవసాయేతర అవసరాలు (ప్లాట్లు) వేసేందుకు రోడ్లు ఏర్పాటు చేశారు. వీటిపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు  మొక్కు బడిగా  నోటీసులు ఇచ్చి మిన్నకున్నారు.  కుందేరు ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ అధికారుల చర్యలు నామమాత్రంగా కూడా లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

చీరాల, సెప్టెంబరు 20 : నాలుగు సెంట్ల స్థలం, అందులో సొంతిల్లు.. ఇదీ మధ్యతరగతి ప్రజల ఆశ.  దానిని సాకారం చేసుకునేందుకు రూపాయి, రూపాయి పొదుపు చేస్తారు. అనుకూలమైన స్థలం అందుబాటులోకి వచ్చినపుడు ఎన్నో వ్యయప్రయాసలతో కొనుగోలు చేస్తారు. అయితే అలాంటి వారినీ మోసం చేసే అక్రమార్కులు బయలుదేరారు. ముందు కొంత సొంతది కొని.. వెనక ప్రభుత్వ స్థలాలను కలిపేసుకుని అంతా తమ సొంతం మాదిరిగా కలరింగ్‌ ఇచ్చి మాయమాటలతో అమ్మేస్తున్నారు. తీరా కొన్నాక విషయం తెలిసి సామాన్యులు లబోదిబోమంటున్నారు. అలాగే కొవిడ్‌ మహమ్మారి వచ్చాక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నంతలో కొంత డబ్బును ఎప్పుడు ఏ వైద్య అవసరం వస్తుందోనని చేతిలో ఉంచుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని స్థిరాస్తులపై మదుపు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీన్ని గమనించిన కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి ప్లాట్ల పేరుతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. అన్ని వసతులు, అనుమతుల ఉన్నాయని చెప్పి మోసం చేస్తున్నారు.


సొంత స్థలంలో ప్రభుత్వ భూమి కలిపి ప్లాట్లు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో కొందరు ముందస్తుగా ప్రభుత్వభూమిని కబ్జా చేసేందుకు అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు. ఆ తరువాత వెంచర్ల పేరుతో కొద్ది, కొద్దిగా పక్కనున్న ప్రభుత్వభూమిని కలుపుకొంటూ పాగా వేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా చీరాల మండల ఈపురుపాలెం, తోటవారిపాలెం పరిధిలో కుందేరుకు ఇరువైపులా ప్లాట్లు వేసేందుకు ఎర్రమట్టితో రోడ్లు వేస్తున్నారు. 


కుంచించుకుపోతున్న కుందేరు

కుందేరుకు ఇరువైపులా ఈపురుపాలెం, తోటవారిపాలెం గ్రామాల పరిధిలో కనీసం కన్వర్షన్‌ కూడా చేయించకుండా రోడ్లు వేస్తున్నారు. తమ స్థలంతో పాటు కొంత కుందేరును కూడా కబ్జా చేశారు. రెండెకరాలకుపైగా స్థలాన్ని ఆక్రమించారు. రాళ్ల కంచె  కూడా వేశారు. ఈపురుపాలెం వైపు అసైన్డ్‌ ఆక్రమణలు. ఇదంతా తమ సొంత భూమిగా చెప్పుకుంటూ సదరు వ్యక్తులు విక్రయాలు చేపట్టారు.


లేఅవుట్‌ వేయాలంటే ఏం చేయాలి

ప్రాఽథమికంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా వినియోగించుకునేందుకు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. నాళా రుసుం చెల్లించాలి. డీటీసీపీ (డిస్ట్రిక్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతి పొందాలి. లేఅవుట్‌లో 10శాతం ఉమ్మడి అవసరాలకు వినియోగించేందుకు కేటాయించాలి. పంచాయతీ అనుమతి పొందాలి. రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, విద్యుత్‌ సరఫరా తదితర వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలి. అయితే రియల్టర్లు అవేమీ పట్టించుకోవడం లేదు. కేవలం రోడ్లను  ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారు. 


కొనుగోలుదారుల కళ్లకు గంతలు

లేఅవుట్‌ వేసేందుకు కొనుగోలు చేసిన భూమిని కొందరు వ్యక్తులు వెంటనే తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం లేదు. కొనుగోలుదారులకు అంత పెరుగుతుంది.. ఇంత పెరుగుతుందని ఆశపెట్టి ఒప్పించి సంబంధిత భూమి యజమాని ద్వారా నేరుగా ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. అప్రూవ్డ్‌ లే అవుట్‌ ఉండటం లేదు. అంతా కాగితాలపైనే చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇదిలా ఉంటే అన్ని అనుమతులు, వసతులు ఉన్నట్లు కొనుగోలుదారుల కళ్లకు గంతలు కడుతున్నారు. కొందరు వ్యక్తులు మాటల గారడీ చేస్తూ నిబంధనలు గురించి దాటవేస్తారు. టిప్‌టాప్‌గా ఉండే ఓ వ్యక్తి అందులో సిద్ధహస్తుడు. మిగిలిన వారిని సిండికేట్‌ చేయటంలో కూడా ఘనాపాటి. పాలకులు మారినా, అధికారులు మారినా ఈ సిండికేట్‌లోని వ్యక్తులు ఒక అవగాహనతో ముందుకు నడుస్తుంటారు. తిలా పాపం తలా పిడికెడు  అంతా మేమే తింటున్నామా అని వీరు కొందరు అధికారులు దగ్గర చెప్పటం విశేషం.


తోటవారిపాలెం వైపు కుందేరు స్థలాన్ని ఆక్రమించి వేసిన లేఅవుట్‌లో రాళ్లకంచె