కొవిడ్‌ కేసులు పెరిగితే చూద్దాం!

ABN , First Publish Date - 2022-01-17T07:04:38+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరిగితే చూద్దాం!

కొవిడ్‌ కేసులు పెరిగితే చూద్దాం!

విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపునకు మంత్రి నో

నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు, ఇంటర్‌ కాలేజీలు

తెలంగాణలో 30 వరకు సెలవులు

ప్రైవేటు ఇంజనీరింగ్‌లో ఆన్‌లైన్‌

ట్రిపుల్‌ ఐటీల్లోనూ ఇప్పట్లో క్లాసుల్లేవు


అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సెలవులు ముగియడంతో రాష్ట్రంలో పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించడమో.. లేక ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడమో చేస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు భావించారు. దీనికితోడు పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో మన రాష్ట్రంలోనూ సెలవులు పొడిగించవచ్చని అనుకున్నారు. అయితే సెలవులపై పునరాలోచన లేదని ప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది. యథావిధిగా సోమవారం పాఠశాలలు, ఇంటర్‌ కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్‌ గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, 15-18 ఏళ్ల విద్యార్థులకూ 92 శాతం పూర్తిచేశామని తెలిపారు. తల్లిదండ్రులకు ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని, భవిష్యత్‌లో కేసుల తీవ్రతను బట్టి ఆలోచిస్తామని తెలిపారు.


విద్యార్థులకు సందేశాలు..

మరోవైపు.. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు మాత్రం ఆన్‌లైన్‌ త రగతులు నిర్వహించాలని నిర్ణయించాయి. ఆదివారం సాయంత్రానికి పలు కళాశాలలు తమ విద్యార్థులకు మెసేజ్‌లు పంపాయి. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నెలాఖరు వరకు ఆన్‌ లైన్‌లో తరగతులు ఉంటాయని పేర్కొన్నాయి. ఉన్నత విద్యామండలి సైతం ఆర్జీయూకేటీలో ఇటీవల అడ్మిషన్లు నిర్వహించిన ఐఐఐటీల్లో కూడా ఇప్పటికిప్పుడు తరగతులు ప్రారంభించే యోచన లేదని పేర్కొంది. 


సెలవులు పొడిగించాలి: టీఎన్‌ఎస్‌ఎఫ్‌

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్‌గోపాల్‌ డిమాండ్‌ చేశారు. వారి భవిష్యత్‌తో ఆటలాడొద్దని హెచ్చరించారు. 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి రాకుండా పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమేన్నారు. విద్యా వ్యవస్థని ఎలా నడపాలో అవగాహన లేని విద్యామంత్రి, ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని ఓ ప్రకటనలో విమర్శించారు. 

Updated Date - 2022-01-17T07:04:38+05:30 IST