పండుగను పంచుకుందాం!

ABN , First Publish Date - 2020-05-25T04:53:10+05:30 IST

రంజాన్‌ ఉపవాస దీక్షను ఈ ఏడాది నిష్ఠగా ఇంట్లోనే కొనసాగించినట్టే, ఈద్‌ పండుగను కూడా కుటుంబంతో కలిసి సంయమనంతో జరుపుకొందాం. లేనివారికి ఆసరా అందిద్దాం. అల్లాహ్‌ ఆశీస్సులు అందుకుందాం.

పండుగను పంచుకుందాం!

రంజాన్‌ ఉపవాస దీక్షను ఈ ఏడాది నిష్ఠగా ఇంట్లోనే కొనసాగించినట్టే, ఈద్‌ పండుగను కూడా కుటుంబంతో కలిసి సంయమనంతో జరుపుకొందాం. లేనివారికి ఆసరా అందిద్దాం. అల్లాహ్‌ ఆశీస్సులు అందుకుందాం. 


శుభాల సరోవరమైన రంజాన్‌ మాసం ముగిసింది. విశ్వాసులందరూ అల్లాహ్‌తో తమ అనుబంధాన్ని గట్టిపరచుకొనే అవకాశాన్నిస్తుంది ఈ మాసం. ఉపవాసాలతో, భక్తి ప్రపత్తులతో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారనే భావిద్దాం. 


పవిత్రమైన రంజాన్‌ నెల పూర్తయ్యాక, షవ్వాల్‌ నెలలో చంద్రుడు కనిపించిన తరువాత ‘ఈదుల్‌-ఫిత్ర్‌’ లేదా ‘ఈద్‌’ పండుగను జరుపుకోవడం సంప్రదాయం. రంజాన్‌ శుభమాసంలో దైవం నిర్దేశించిన ఆరాధనలూ, ఉపవాస వ్రతాలూ, తరావీహ్‌ నమాజులూ, దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణ, జకాత్‌, ఫిత్రా, దానధర్మాలు తదితర సత్కార్యాలను అల్లాహ్‌ అనుగ్రహంతో సక్రమంగా నెరవేర్చగలిగినందుకు- అల్లాహ్‌ పట్ల కృతజ్ఞతా భావంతో ‘ఈదుల్‌- ఫిత్ర్‌’ పండుగ జరుపుకొంటారు.


ఈద్‌ నమాజ్‌ను ఈద్గా మైదానం లేదా జమా మసీదు లేదా మసీదుల్లో చదవడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా ‘ఈదుల్‌ ఫిత్ర్‌ నమాజ్‌’ను ఎవరికి వారే ఇళ్ళలోనే చదువుకోవాలన్నది ప్రభుత్వాలూ, మత పెద్దల విజ్ఞాపన. ఇది అనుచితమేమీ కాదు. కొన్ని అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు- అంటే ఏదైనా అంటువ్యాధి సామాజిక వ్యాప్తి దశలో ఉన్నప్పుడూ, ఎడతెగని తుపాన్లు ముంచుకువచ్చినప్పుడూ, అలాగే ఎవరైనా వృద్ధాప్యం వల్ల కదలలేని స్థితిలో ఉన్నప్పుడూ, మారుమూల ప్రాంతాలలో ఉన్నవారు ఈద్గాకు రాలేని సందర్భాలలో ‘ఈదుల్‌- ఫిత్ర్‌ నమాజ్‌’ ఇంట్లోనే చదువుకోవచ్చు. ఈద్గాకు రాలేని సందర్భాల్లో కొందరు సహాబీలు (దైవ ప్రవక్త మహమ్మద్‌ సహచరులు) ఇంట్లోనే ఈదుల్‌-ఫిత్ర్‌ నమాజ్‌ ఆచరించినట్టు ఆధారాలు ఉన్నాయి. మానవులకు ప్రాణహాని కలగకుండా నిరోధించడం కోసం విధి-నిషేధాలను దేవుడే తాత్కాలికంగా సడలించిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రస్తుత ప్రాణ సంకట పరిస్థితుల్లో, ధర్మాన్ని అనవసరమైన సెంటిమెంట్లతో పాటించి, ప్రాణం మీదకు తెచ్చుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి, ఈ సంక్షోభ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ, నిస్సహాయులకు చేయూతనిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. 


ఈద్‌ రోజున ఏం చెయ్యాలి?

పండుగ రోజున తలస్నానం చేయడం, సెంట్లు పూసుకోవడం, మంచి దుస్తులు ధరించడం ఉత్తమం. ఇది మహా ప్రవక్త మహమ్మద్‌ ఆచరించిన విధానం.


‘ఈదుల్‌- ఫిత్ర్‌ నమాజ్‌’కు ముందు కొన్ని ఖర్జూరం పండ్లు తినాలి. ఆ ఖర్జూరాలను బేసి సంఖ్యలో (1, 3, 5, 7... ఇలా) స్వీకరించాలి. పండ్లు లేకపోతే తీపి పదార్ధాన్ని తీసుకోవాలి. 


ఈద్గా దగ్గర చదివినట్టే, అదనపు ‘తక్బీర్‌’లతో సహా ఇంట్లోనే కుటుంబ సభ్యులందరూ కలిసి నమాజ్‌ పఠించాలి. నమాజ్‌ వచ్చిన పురుషుడు మొదట చదవాలి. అతని వెనుకే కుటుంబంలోని పిల్లలు, మహిళలూ అనుసరించాలి.


ప్రస్తుత కరోనా వేళ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ‘ఈదుల్‌-ఫిత్ర్‌ నమాజ్‌’ కోసం స్నేహితులనూ, లేదా పొరుగున ఉండే తోటి ముస్లిమ్‌లనూ ఇళ్ళకు పిలవడం, లేదా వారి ఇళ్ళకు వెళ్ళడం, గుంపులు గుంపులుగా కలిసి నమాజ్‌ చేయడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పడం లాంటివి చేయకండి. 


పండుగ రోజు కూడా మాస్క్‌ ధరించండి. భౌతిక దూరం కచ్చితంగా పాటించండి.


పండుగ రోజున పిల్లలకు పెద్దలు ఈదీలు (కానుకలు) ఇస్తూ ఉంటారు. అల్లాహ్‌ కూడా ఈ నెల రోజులూ భక్తులు కనబరచిన భక్తి నిష్ఠలకు ప్రతిగా అపారమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. 

ఈద్‌ ముబారక్‌!!

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-05-25T04:53:10+05:30 IST