మత మార్పిళ్లకే పాస్టర్లకు జీతాలా!

ABN , First Publish Date - 2021-01-18T08:16:01+05:30 IST

రాష్ట్రంలో మత మార్పిళ్లు చేయించడానికే వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు జీతాలు ఇస్తోందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.

మత మార్పిళ్లకే పాస్టర్లకు జీతాలా!

ఆలయాలపై దాడులు... హిందువులపై దాడులే

గౌతమ్‌ సవాంగ్‌ను పదవి నుంచి తొలగించాలి

హైందవ పేర్లతో క్రిస్టియన్‌ మంత్రులు: సోము


విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత మార్పిళ్లు చేయించడానికే వైసీపీ ప్రభుత్వం పాస్టర్లకు జీతాలు ఇస్తోందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాలకు సంబంధించిన కేసుల్లో బీజేపీ కార్యకర్తలను, హిందువులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. డీజీపీ వ్యాఖ్యలు దీనిని బలపరుస్తున్నాయి. రామతీర్థం వెళ్లడానికి మమ్మల్ని అనుమతించ లేదు. ఆలయాల కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను హిందువులపై జరుగుతున్న దాడులుగానే భావించాల్సి వస్తుంది’’ అని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ప్రవీణ్‌ చక్రవర్తి అనే పాస్టర్‌ చేసిన ప్రకటనలను ముఖ్యమంత్రిగానీ, డీజీపీగానీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. డీజీపీ హోదాకు అవమానం కలిగించే రీతిలో సవాంగ్‌ తీరు ఉందన్నారు. ఆ పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించాలని సోము డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని చర్చిలకు కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని అన్నారు. అటువంటప్పుడు ప్రజల సొమ్ముతో చర్చిలు నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమోచ్చిందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.


హిందూ దేవాలయాల ఆస్తులను లెక్కించినట్టుగానే చర్చిల ఆస్తులను కూడా లెక్కించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలకున్న ఆస్తులపై సర్వే చేసి, కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తామన్నారు. ‘‘రాష్ట్రంలో కొంతమంది మంత్రులు హైందవ పేర్లు పెట్టుకుని, క్రిస్టియన్లుగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఇద్దరు మంత్రులు క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. కనీసం ఒక చర్చిలో అయినా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పారా?’’ అని సోము ప్రశ్నించారు. 


Updated Date - 2021-01-18T08:16:01+05:30 IST