Advertisement
Advertisement
Abn logo
Advertisement

కన్నీరూ విలపించేలా.. కఠినమైన విధి లీల!

రుయా ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు

మృతదేహాలు చూసి.. కుప్పకూలిన కుటుంబ సభ్యులు

రోగులు, వైద్య సిబ్బంది కన్నీటిపర్యంతం

అంబులెన్స్‌లలో స్వగ్రామాలకు పార్థివ దేహాలు

తిరుపతి సిటీ, డిసెంబరు 6: వరుసగా ఆరు మృతదేహాలు. చెంతనే చిన్నారి మృతదేహం. హృదయ విదారకమైన ఈ దృశ్యం తిరుపతిలోని రుయా ఆస్పత్రి వద్ద చూపరుల కంటతడి పెట్టించింది. ‘భగవంతుడా ఏమిటీ  దుస్థితి’? అంటూ మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు కుప్పకూలి విలపించారు. రోగులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను పంచనామా నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాల మార్చురీకి తీసుకువచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు సోమవారం మార్చురీ వద్దకు చేరుకుని భోరున విలపించారు. మృతుడు సురేష్‌ మేనమామ, అక్క భర్త వెంకటరమణ, హైమావతి తమ్ముడు సూరన్నాయుడు, పెద్ద అల్లుడు మధులతో పాటు సమీప బంధువులు సురేష్‌, కొండయ్య, వాసులు మృతదేహాలను తీసుకెళ్లేందుకు తిరుపతి వచ్చారు. పోస్టుమార్టం అనంతరం వరుసగా మృతదేహాలను పెట్టారు. అటు అమ్మమ్మ, తాతయ్య, మరోవైపు నానమ్మ, తాతయ్య, తల్లిదండ్రుల మధ్య తొమ్మిది నెలల జోస్విక సహస్ర మృతదేహాన్ని పెట్టిన దృశ్యాలు అక్కడి వారి హృదయాలను ద్రవింపజేశాయి. అక్కడి సిబ్బంది సైతం కన్నీటి పర్యంతమయ్యారు. డీఎస్పీ నరసప్ప, ఆర్డీఓ కనకనరసారెడ్డిలు విడివిడిగా సోమవారం మార్చురీ వద్దకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్పీ నరసప్ప ప్రత్యేక చొరవ తీసుకుని మధ్యాహ్నం వరకు మార్చురీ వద్దనే ఉండి మృతదేహాలకు పోస్టుమార్గం పూర్తి చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను, వారి వద్ద లభించిన నగదును కూడా వారికి అందజేశారు. మృతదేహాలను తీసుకువెళ్లేందుకు ఆయన ప్రత్యేకంగా అంబులెన్సులు ఏర్పాటు చేశారు.  


 చికిత్స పొందుతున్న చిన్నారి

ప్రమాదం నుంచి మృత్యుంజయురాలిగా బయటపడిన జషిత నందన్‌ రుయా ఆస్పత్రిలోని చిన్నపిల్లల అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం చిన్నారికి ప్రాణాపాయం లేదని..కాళ్లు తొడ భాగంలో ఎముకలు విరగడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు వార్డు విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. మరో రెండు రోజుల పాటు అత్యవసర విభాగంలో ఉంచి వైద్యసేవలందిస్తామని చెప్పారు.  చిన్నారి జషిత నందన్‌ ప్రమాదం నుంచి ఇంకా తేరుకోలేదు. కొత్త వారిని చూస్తే భయపడుతూ బిగ్గరగా కేకలు వేస్తోంది. ప్రస్తుతం చిన్నారి బాధ్యతలను శాంతి, నాగరత్న అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను చూస్తున్నారు. వీరు రాత్రీ పగలు చిన్నారి చెంతనే ఉంటూ సేవలు చేస్తున్నారు. సోమవారం శ్రీకాకుళం నుంచి వచ్చిన చిన్నారి పెద్దనాన్న మధు పిలిచిన వెంటనే జషిత నందన్‌ నిద్రలో నుంచి తేరుకోని అమ్మ కావాలి అంటూ అడిగిన తీరు అక్కడి వారిని కలచివేసింది. దు:ఖాన్ని దిగమింగుకుంటూ ఆయన చిన్నారిని ఓదార్చారు. 


‘అమ్మ’తనాన్ని పంచుతూ...

అటు పేగు తెంచుకున్న బిడ్డను.. ఇటు నా అన్నవారిని కోల్పోయి చికి త్స పొందుతున్న చిన్నారిని ‘అమ్మ’ తనాన్ని పంచింది కానిస్టేబుల్‌ నాగ రత్న. రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి జషిత నందన్‌ ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న సంగతి తెలిసిందే. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టే బుళ్లు నాగరత్న, శాంతిలకు చిన్నారి సంరక్షణ బాధ్యతలు అప్పగిం చారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలో శాంతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ, రాత్రికి నాగరత్న చిన్నారిని పర్యవేక్షిస్తు న్నారు. అయితే తనను విడిచిపెట్టని నాలుగేళ్ల కుమారుడ్ని నాగరత్న ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఒకవైపు తన బిడ్డను, మరోవైపు చిన్నారి జషిత నందన్‌ను కంటికి రెప్పలా కాపాడుతూ, జోల పాడుతూ నాగరత్న అందిస్తున్న సేవలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 


మేడమర్తిలో నేడు అంత్యక్రియలు

సంతకవిటి మండలం మేడమర్తిలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలు మంగళవారం ఉదయం స్వగ్రామాలకు చేరనున్నాయి. అంత్యక్రియలకు గ్రామస్థులు, సమీప కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారని సమాచారం తెలిసిన నాటి నుంచి గ్రామస్థులు నిద్రాహారాలు మానుకొని మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు. కంచరాపు శ్రీరామ్మూర్తి స్థానికంగా సుపరిచితులు. ఆయన కుమారుడు సురేష్‌కుమార్‌ కూడా విద్యాధికుడు. మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌కుమార్‌ స్వగ్రామానికి వచ్చినప్పుడు అందరితో కలివిడిగా గడిపేవాడు. స్నేహితులు కూడా ఎక్కువే. వారంతా సురేష్‌తో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బాల్య మిత్రులు పెద్దఎత్తున గ్రామానికి చేరుకున్నారు. అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement
Advertisement