ధాన్యం దింపుకోం

ABN , First Publish Date - 2022-04-20T05:53:17+05:30 IST

యాసంగి ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ధాన్యం దింపుకోం
మిల్లులో ధాన్యం (ఫైల్‌)

 - ముడి బియ్యంతో భారీగా నష్టం

- బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఇస్తాం

- మిల్లర్ల నిర్ణయంతో అయోమయం 

- యాసంగిలో 48,114 హెక్టార్లలో వరి  

- 2.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యం దిగుబడి అంచనా 

 - వచ్చే వారంలో కొనుగోళ్ల ప్రారంభానికి సన్నాహాలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగి ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. దీంతో  ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది లేదని రైతులు భావిస్తున్న క్రమంలో మిల్లర్లు  2021-22 రబీ పాలసీపై జీవో వచ్చిన తర్వాతే ధాన్యం దింపుకుంటామని మిల్లర్లు జిల్లా అదనపు కలెక్టర్‌కు విన్నవించారు.   ప్రస్తుత రబీ ధాన్యం ముడి బియ్యానికి పనికిరాదని, బాయిల్డ్‌ బియ్యమే ఇస్తామని పేర్కొన్నారు.  ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధవాతావరణమే ఏర్పడింది. చివరకు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించింది.  ముడి బియ్యం ఉత్పత్తిలో జరిగే నూక నష్టానికి పరిహారం కూడా ఇస్తామని మిల్లర్లకు తెలిపింది. కానీ ప్రభుత్వం ఎంత నష్టం భరిస్తుందో తేల్చలేదు. మిల్లర్లు ధాన్యం దించుకోవాల్సిందేనని ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లర్‌ అసోసియేషన్‌  సభ్యులు మాత్రం రబీకి సంబధించిన ధాన్యం బాయిల్డ్‌ రైస్‌కు మాత్రమే పనికి వస్తుందని రా రైస్‌కు పనికిరాదని విన్నవించారు. నూకలు, పరం, పిండి ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఽధాన్యం సబ్సిడీతో తమకే ఇస్తే బాయిల్డ్‌ రైస్‌ ఎక్స్‌పోర్ట్‌ చేసి డబ్బులు జమ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో ధాన్యం మిల్లులకు పంపడంపై సందిగ్ధం ఏర్పడింది. మరోవైపు  ధాన్యం దింపుకోని పక్షంలో 6ఏ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడేదిలేదని ప్రభుత్వ హెచ్చరికలతో మిల్లర్లలోనూ అయోమయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ కొనుగోళ్లపై యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తోంది.

కస్టమ్‌ మిల్లింగ్‌పై ఒత్తిడి

 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ కింద పంపిస్తుంది. సీఎంఆర్‌ విధానంలో మిల్లులకు ప్రభుత్వం క్వింటాల్‌ ధాన్యం ఇస్తే దానిని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి 67 కిలోల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమ్‌ మిల్లింగ్‌ కూడా నత్తనడకగానే సాగుతోంది. అధికారులు ఒత్తిడి పెంచిన క్రమంలోనే సీఎంఆర్‌ కింద బియ్యాన్ని మిల్లర్లు పెట్టడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 రైస్‌మిల్లులు ఉండగా బాయిల్డ్‌ రైస్‌మిల్‌లు 32, రా రైస్‌ మిల్లులు 55 ఉన్నాయి. వీటికి ధాన్యాన్ని 2020- 21 రబీలో 3,41,851 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు అందించారు. ఇందులో రా రైస్‌మిల్లులకు 22,134 మెట్రిక్‌ టన్నులు, బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు 3,19,716 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇవ్వగా 2,31,462 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 1,97,091మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందించారు. 34,371 మెట్రిక్‌ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉంది. 2021 - 22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 2,67,492 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు పంపించారు. ఇందులో బాయిల్డ్‌ మిల్లులకు 80,545 మెట్రిక్‌ టన్నులు, రా మిల్లులకు 1,86,947 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పంపించారు. 1,79,220మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా 50,547 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే అందించారు. 1,27,716 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ కింద మిల్లులు ఇవ్వాల్సి ఉంది. ఇదే క్రమంలో మళ్లీ యాసంగి ధాన్యం దిగుబడి కూడా ప్రారంభం అవుతోంది. ఈ సారి ముడి బియ్యమే ఇవ్వాలని నిబంధన పెట్టడంతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. 


యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

జిల్లాలో యాసంగి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో 48,114 హెక్టార్లలో వరి సాగు చేశారు. 2.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏప్రిల్‌లో 20 వేల మెట్రిక్‌ టన్నులు, మేలో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నులు, జూన్‌లో 97,232 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి అందుకు అనుగుణంగా 265 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. సింగిల్‌ విండోల ద్వారా 185 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 66 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా 9 కేంద్రాలు, మెప్మాద్వారా 3 కేంద్రాలు మార్కెట్‌ కమిటీల ద్వారా 2 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కావాల్సిన 74.30 లక్షల గోనె సంచులను సమకూర్చుకునే పనిలో పడ్డారు. వీటితోపాటు టార్ఫాలిన్‌లు, ఇన్నోవింగ్‌ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చరైజ్‌ మిషన్లు, వేయింగ్‌ మిషన్లు, ఫీల్డ్‌ బ్యాలెన్స్‌ కాలీపర్స్‌, జల్లెడలు వంటివి సమకూర్చుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలైనా మిల్లర్ల నుంచి  ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని రైతులు కూడా అయోమయానికి గురవుతున్నారు. 


Updated Date - 2022-04-20T05:53:17+05:30 IST