మన అంతఃశక్తిని మేల్కొలుపుదాం!

ABN , First Publish Date - 2020-06-21T05:38:48+05:30 IST

కరోనా సమస్య కొనసాగుతున్న దృష్ట్యా మనం మన వ్యాధినిరోధకతను పెంచుకోవడంతోపాటు శారీరకంగా చురుకుగా, మానసికంగా ప్రశాంతంగా ఉండడం వసరం. యోగా సరళంగా కనిపించినప్పటికీ అత్యంత శక్తిమంతమైన సాధన అని చెప్పక తప్పదు...

మన అంతఃశక్తిని మేల్కొలుపుదాం!

‘యోగా అంటే మనో శరీరాల ఐక్యత; ఆలోచన, ఆచరణల సమన్వయం; సంయమనం, సాధనల ప్రతిఫలం; మనిషి, ప్రకృతిల సమ   గమనం; ఆరోగ్యం, శ్రేయస్సుల పట్ల ఒక సమగ్ర దృక్పథం’  నరేంద్ర మోదీ


కరోనా సమస్య కొనసాగుతున్న దృష్ట్యా మనం మన వ్యాధినిరోధకతను పెంచుకోవడంతోపాటు శారీరకంగా చురుకుగా, మానసికంగా ప్రశాంతంగా ఉండడం వసరం. యోగా సరళంగా కనిపించినప్పటికీ అత్యంత శక్తిమంతమైన సాధన అని చెప్పక తప్పదు. 


కరోనా మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడిన నాటినుంచీ కోట్లాది ప్రజల జీవితాలు మారిపోయాయి. సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ల కారణంగా పలుదేశాల ఆర్థికవ్యవస్థలు దెబ్బతినిపోగా, సామాన్యుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. అనిశ్చితి, ఆందోళకరమైన ఈ పరిస్థితుల్లో ఇవాళ మనసును ప్రశాంతంగా, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ప్రాచీన భారతీయ విధానమైన యోగా మనో శరీరాల పటిష్ఠతను గణనీయంగా మెరుగుపరచడంలో సమర్థంగా తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. అందుకే అది ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అమిత ఆదరణ పొందింది. నేడు ప్రపంచమంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో మానవుడి సమగ్ర అభివృద్ధిలో యోగా నిర్వహించే కీలక పాత్ర గురించి మనం తెలుసుకోవడం అవసరం.


యోగా అంటే సంయోగం లేదా సమైక్యం అని అర్థం. దాని భావంలోనే అది మౌలికంగా బుద్ధి, శరీరాల సుసంబద్ధమైన కలయిక సాధిస్తుందన్న విషయం మనకు స్పష్టమవుతుంది. సంతులనం, సమతూకం, సౌమ్యత, సమభావం, శాంతి, సామరస్యం మొదలైన లక్షణాలను ప్రతిఫలించే శాస్త్రం అది. ప్రజలు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న ప్రస్తుత సమయంలో సమాజానికి స్వాస్థ్యం చేకూర్చే గొప్ప ఔషధం యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించాల్సిందిగా 2014లో ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదిస్తూ రాసిన లేఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగా ప్రాధాన్యత గురించి అద్భుతంగా వివరించారు. ప్రాచీన భారతీయ సంప్రదాయం ప్రపంచానికి ఇచ్చిన వెలకట్టలేని కానుక యోగా అని ఆయన అభివర్ణించారు. ‘యోగా అంటే మనో శరీరాల ఐక్యత; ఆలోచన, ఆచరణల సమన్వయం;సంయమనం, సాధనల ప్రతిఫలం; మనిషి, ప్రకృతిల సమగమనం; ఆరోగ్యం, శ్రేయస్సుల పట్ల ఒక సమగ్ర దృక్పథం’ అని మోదీ తన లేఖలో చెప్పారు. భారతదేశం చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితితోపాటు 175 దేశాలు ఆమోదించాయి. డిసెంబర్ 11, 2014న చేసిన ఓ తీర్మానంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా గుర్తిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆరోగ్యం, శ్రేయస్సు పొందేందుకు యోగా సమగ్ర దృక్పథాన్ని అందిస్తుందని ఈ తీర్మానం పేర్కొంది. ప్రజలు చక్కటి జీవనశైలిని అలవర్చుకొని ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఉన్నదని తెలిపింది. దైనందిన జీవితంలో సరైన శారీరక శ్రమ లేనికారణంగా కేన్సర్, మధుమేహం, హృద్రోగ సమస్యలు మొదలైన అసంక్రమిత వ్యాధులు (ఎన్సీడీలు) పెరిగిపోతున్న నేపథ్యంలో యోగా ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో స్పష్టం చేసింది. 2018-–2030 సంవత్సరాలకు శారీరక కార్యకలాపాలపై అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యకరమైన ప్రపంచంలో ప్రజలు మరింత క్రియాశీలకంగా మారాలంటే యోగా ఒక ముఖ్య సాధనమని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ దేశాలు, ప్రజలు క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. జీవితాలను, జీవనోపాధిని సమన్వయం చేయడం, లాక్‌డౌన్‌, అన్ లాకింగ్, స్వీయనిర్బంధం, సమాచార సంబంధాలు నెలకొల్పుకోవడం, ఎక్కడికీ కదలలేని పరిస్థితుల్లో ఆరోగ్యకరంగా ఉండాల్సిన అవసరం చాలా కష్టంగా మారింది. నిస్సందేహంగా ఇది ప్రజల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ముఖాముఖి సంభాషణ, శారీరక వ్యాయామం లేకుండా ఇళ్లకే పరిమితమయ్యే తప్పనిసరి పరిస్థితులుండటం బాధాకరమే. అందుకే ఈ పరిస్థితుల కారణంగా ఎదురవుతున్న ఒత్తిడిని చిత్తుచేసేందుకు యోగా అద్భుతమైన సాధనం. ఇళ్లలోనే ఉంటూ చేసుకునే యోగాలో నిర్మాణాత్మకమైన వ్యాయామాల కారణంగా చాలా సత్ఫలితాలు పొందవచ్చు. దీంతోపాటు మన అల్లకల్లోలమైన భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు యోగా ఉపకరిస్తుంది.


‘సమత్వమే యోగ ఉచ్యతే’ (యోగా అంటే సమతుల్యం) అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడు. విపరీత విన్యాసాలకు తావు లేకుండా ఒక సంతులనం, పొందికతో పద్ధతి ప్రకారం అవయవాల కదలికను శాసించే ఒక విశిష్టమైన ప్రక్రియగా యోగా మన జీవితంలో కూడా సమతుల్యానికి దారితీసే దృక్పథాన్ని కలుగజేస్తుంది. 


‘శారీరక చురుకుదనం, దృఢత్వం, మానసిక జాగృతి, విశ్రాంతి’ వంటి ప్రయోజనాలు యోగా వల్ల లభిస్తాయని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 2020 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ‘ఇంటివద్దే కుటుంబసభ్యులతో కలిసి యోగా’ (యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలీ) ఇతివృత్తంతో జరుపుకోవాలని నిర్ణయించింది.


శాస్త్రపరమైన అధ్యయనాల్లోనూ యోగా ద్వారా కలిగే ఆరోగ్యపరమైన లాభాలు నిరూపితమయ్యాయి. హృదయసంబంధిత సమస్యల నుంచి వెన్నునొప్పి వరకు ఎన్నో సమస్యలను నిరంతరం యోగాభ్యాసం ద్వారా నివారించవచ్చునని నిరూపితమైంది. కరోనా మహమ్మారి తన వికృతరూపాన్ని ప్రదర్శిస్తున్న ఈ సమయంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆస్తమా, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలున్నవారికి వీటినుంచి గట్టెక్కేందుకు ఇదో మంచి మార్గం. ఆధునిక జీవనశైలి కారణగా నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన వారికి, మానసిక ఆందోళనల్లో ఉన్నవారికి యోగా దివ్యౌషధం. యువకులు, మంచి భవిష్యత్తున్నవారు ఆధునిక కాలంలో ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోలేక ప్రాణత్యాగాలకు పాల్పడుతున్నారనే వార్తలు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు నేను మనస్తాపానికి గురవుతున్నా ఇలాంటి పరిస్థితులను కచ్చితంగా నివారించవచ్చు. యోగా, ధ్యానం వల్ల ఎలాంటి ఒత్తిడినైనా జయించవచ్చు.


ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ మానసిక ఆరోగ్య నివేదిక (2018) ప్రకారం యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకున్నవారందరూ అనవసర భావోద్వేగాలను, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోగలిగారు. ధ్యానం, విశ్రామం, వంటి స్వీయ మనోల్లాస పద్ధతులు, స్నేహపూరిత వాతావరణం ఏర్పర్చుకోవడం వంటి ప్రయోజనాలు యోగా ద్వారా లభిస్తాయి.


కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్న నేపథ్యంలో... యోగాను కూడా వారి ఆన్ లైన్ విద్యా విధానంలో భాగస్వామ్యం చేయాలని నేను సూచిస్తున్నాను. ‘యునిసెఫ్ కిడ్ పవర్’ కూడా చిన్నారులకోసం 13 యోగాసనాలను తన జాబితాలో పొందుపరిచింది.


కరోనా సమస్య కొనసాగుతున్న దృష్ట్యా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన వ్యాధినిరోధకతను పెంచుకోవడంతోపాటు శారీరకంగా చురుకుగా, మానసికంగా ప్రశాంతంగా ఉండడం అవసరం.


శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మన సనాతన సంప్రదాయాల్లో ఆచరణీయమైన పరిష్కారాలు లభించడం మన అదృష్టమనే చెప్పాలి. యోగా సరళంగా కనిపించినప్పటికీ అత్యంత శక్తిమంతమైన సాధన అని చెప్పక తప్పదు. దీంతోపాటుగా మన సంప్రదాయ వంటకాల్లో వినియోగించే సుగంధ ద్రవ్యాలు, మూలికలు కూడా అంతే ముఖ్యమైనవి. పసుపు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మిరియాల వినియోగం వ్యాధినిరోధకతను పెంచుతాయి.


కరోనా మహమ్మారి వేళ యావత్ ప్రపంచం భారతదేశ ప్రాచీన, సంప్రదాయ పద్ధతుల వెనక ఉన్న హేతుబద్ధతను రోజురోజుకూ ఆమోదించడం పెరుగుతోంది. ఉదాహరణకు రెండు చేతులూ జోడించి ‘నమస్తే’ చెప్పి ఎదుటివారిని ఆహ్వానించే మన పద్ధతికి వివిధ దేశాల్లో ఆదరణ లభిస్తోంది.


భారతీయ శాస్త్రాల్లో భాగమైన యోగాసనాలు; భారతీయ ప్రాపంచిక దృక్పథంలో భాగమైన శమనం, సహిష్ణుత; సహజంగా రోగ నిరోధకశక్తిని పెంపొందింపజేసే సంప్రదాయ భారతీయ వంటకాలు కరోనా విపత్కర పరిస్థితులనుంచి బయటపడేందుకు సమస్త మానవాళికి ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం


ముప్పవరపు వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి


Updated Date - 2020-06-21T05:38:48+05:30 IST