స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములవుదాం

ABN , First Publish Date - 2021-10-21T04:51:32+05:30 IST

ఆరోగ్య జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రజలంతా సహకరించాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా బుధవారం కోట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛసంకల్పం కార్యక్రమంలో మంత్రి బొత్స ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములవుదాం
పారిశుధ్య వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి బొత్స

 మంత్రి బొత్స

విజయనగరం(ఆంధ్రజ్యోతి), అక్టోబరు 20: ఆరోగ్య జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రజలంతా సహకరించాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా బుధవారం కోట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛసంకల్పం కార్యక్రమంలో మంత్రి బొత్స ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మున్సిపాలిటీలకు కేటాయించిన 62, గ్రామ పంచాయతీలకు కేటాయించిన 62 పారిశుధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు అందరూ కలిసిరావాలన్నారు. అనంతరం స్వచ్ఛ సంకల్పం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సూర్యకుమారి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, సురేష్‌బాబు, జడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీను, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరావు, డీపీవో సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. 

ట్రాఫిక్‌ ఇబ్బందులు

స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కోట జంక్షన్‌ను ఎంపిక చేయడంతో చాలాసేపు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. వందకు పైగా వాహనాలను ఒకే లైన్‌లో పార్కింగ్‌ చేశారు. వీటితో పాటు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నాయకుల వాహనాల వల్ల జంక్షన్‌లో చాలాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సింహాచలం మేడ నుంచి వచ్చేవారు, దాసన్నపేట, మూడులాంతర్లు, గురజాడ అప్పారావు స్వగృహం వైపు నుంచి వచ్చేవారు అనేక అవస్థలు పడ్డారు. మంత్రి రాకముందు నుంచే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. 



Updated Date - 2021-10-21T04:51:32+05:30 IST