Abn logo
Jul 23 2021 @ 00:00AM

త్రికరణశుద్ధిగా సేవ చేద్దాం

తోటివారికి పట్ల ఉదారత కనబరిచి, తోచిన సేవలు అందించే వ్యక్తులు మనకు కనిపిస్తారు. అలాగే స్వచ్ఛందంగా సేవలు చేసే సంస్థలు కూడా అనేకం ఉన్నాయి. ఇలాంటి సేవలతో పాటు రక్తదానం, నేత్రదానం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎంతో ఉపయోగకరం. అలాగే ఆధ్యాత్మిక సేవలు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. సమాజ సేవలో భాగంగా యోగ, జ్ఞాన దానాలు జరగాలి. వాటి ద్వారా వచ్చే అనుభవంతో వ్యక్తులలో ఆధ్యాత్మిక పరివర్తన కలుగుతుంది.


మనసు ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా సేవలు అందించవచ్చు. మనసు ద్వారా చేసే సేవ అంటే శ్రేష్టమైన సంకల్పాలను దానం చేయడం. ఒక వ్యక్తి చాలా దుఃఖంలో ఉన్నాడు. కానీ అతను మనకు సమీపంలో లేడు. మనం అతనితో ఏ విధంగానూ మాట్లాడలేకపోతున్నాం. అలాంటి పరిస్థితిలో దూరంగా ఉండి కూడా... శాంతిని దానం చేయవచ్చు. మన మనసులో శుభప్రదమైన, శాంతియుతమైన సంకల్పాలు చేసుకుంటే... అవి తప్పకుండా వారిని చేరుకుంటాయి. వారికి శాంతిని చేకూరుస్తాయి.


వైర్‌లెస్‌ టెలిఫోన్ల ద్వారా మనం ఎవరితోనైనా మాట్లాడగలిగినప్పుడు... సంకల్పాల ద్వారా కూడా ఎవరితోనైనా సంబంధం ఏర్పరచుకోగలం. మన మాటలు ఎవరికైనా చేరడానికి సమయం పడుతుంది. కానీ సంకల్పాల ద్వారా చేరడానికి అంత సమయం అవసరం లేదు. మీరు ఎవరినైనా గుర్తు చేసుకున్నారంటే... అదే క్షణం మీ సంకల్పం ఆ వ్యక్తిని చేరుకుంటుంది. మీరు గుర్తు చేసుకున్నారని అతను గ్రహించగలడు.రెండవది మాటల ద్వారా జ్ఞాన సేవ. నిత్య వ్యవహారాల్లో మనం సాధారణమైన మాటలు మాట్లాడుతూనే ఉంటాం. కానీ జ్ఞానంతో కూడిన, మధురమైన, ఇతరులకు శాంతి కలిగించే మాటలు మన నోటి నుంచి ఎన్ని వస్తున్నాయి? ఉదాహరణకు ఒక బిచ్చగాడు ఓ దుకాణానికి వెళ్ళి బెల్లం కావాలని అడిగాడు. ‘‘ఇక్కణ్ణుంచి వెళ్ళు’’ అన్నాడు దుకాణదారు కోపంగా. ‘‘అయ్యా! మీరు బెల్లం ఇవ్వకపోయినా పరవాలేదు కానీ, బెల్లంలా మధురంగా మాట్లాడవచ్చు కదా? దానికి మీకేం ఖర్చు ఉండదు కదా!’’ అన్నాడా బిచ్చగాడు.


మనం ఇతరులను భౌతిక రూపాల్లో చూస్తున్నాం. అందుకే వారిలో అవగుణాలే మనకు కనిపిస్తాయి. మన దృష్టిని పవిత్రంగా, స్వచ్ఛంగా చేసుకుంటే నోటి నుంచి మధురమైన మాటలు వస్తాయి. ప్రతి ఒక్కరి పట్లా సద్భావన ఉండాలి. అందరికీ శాంతిని అందించాలనే లక్ష్యం ఉండాలి. మనం లోపల, బయట ఒకే విధంగా ఉండాలి. ఇదే మాటల ద్వారా చేసే సేవ. 


మూడవది కర్మల ద్వారా సేవ. మనం చేసే పనులు ఇతరులకు ప్రేరణ ఇవ్వాలి. మనల్ని చూసి అందరూ సంతోషించాలి తప్ప దూరంగా పారిపోకూడదు. మన మంచి గుణాలతో అందరి మనసులనూ జయించాలి. అప్పుడే మన కర్మలతో ఇతరులకు ప్రేరణ అందించగలం. వారికి సత్యమైన సుఖాన్ని వారి అనుభవంలోకి తేగలం మనసా-వాచా-కర్మణా... త్రికరణశుద్ధిగా ఈ మూడు సేవలు చేస్తే ఆధ్యాత్మిక సేవ కూడా జరుగుతుంది. 

 బ్రహ్మ కుమారీస్‌

7032410931