Abn logo
Oct 21 2021 @ 00:50AM

పోలీసులంటే భయం పోగొడదాం!

పోలీసుల విధులు అత్యవసర సేవల కిందికి వస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనయినా విధులు నిర్వర్తించాల్సిందే. ఏ ఉద్యోగమైనా జీవించడం కోసమే కానీ పోలీసు ఉద్యోగం మాత్రం 'మరణించడం కోసం' కూడా. అందుకే వారి అపూర్వ త్యాగాలను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1959 అక్టోబరు 21న చైనా సైనికులతో పోరాడుతూ పదిమంది భారత సైనికులు వీరమరణం పొందిన రోజును ఈ సంస్మరణ దినంగా జరుపుకుంటారు. 


స్వంత ఇంట్లోనే పరాయి మనిషిగా బతుకుతున్న కొవిడ్ కాలం ఇంకా ముగియలేదు. మొన్నమొన్నటి దాకా మనుషులు ఎవరూ బయటకు రాకూడదన్న సమయంలో కూడా పోలీసులు తప్పక రోడ్ల మీదే ఉండాల్సి వచ్చింది. నిషేధాలు ఉన్నా కరోనా అంటే అవగాహన లేని వేలమంది ప్రజలు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. ఏ మనిషిని ముట్టుకుంటే రోగం సంక్రమిస్తుందో తెలియని పరిస్థితి. అయినా పోలీసులు విద్యుక్త ధర్మాన్ని విడనాడలేదు. ప్రజల రక్షణను ప్రథమ బాధ్యతగా స్వీకరించి, తమ కుటుంబాలను, ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ప్రజలకు అవగాహన కల్పించి, వారిని రోడ్డెక్కకుండా కట్టడి చేశారు. కరోనా బారినపడ్డ వారికి కావలసిన సహాయం చేశారు. ఆసుపత్రుల వద్ద కాపలా కాశారు. కరోనాతో చనిపోయిన వారికి దహనసంస్కారాలు కూడా చేశారు. 


తెలంగాణ పోలీసులు 25 వేలమందికి పైగా కరోనా బారినపడ్డారు. వారిలో 124 మంది అసువులు బాశారు. సహచరులు పిట్టల్లా రాలిపోతున్నప్పటికీ పోలీసులు రోడ్ల మీదే టెంట్లు వేసుకుని నిరంతరం ప్రజలకు కాపలా కాశారు. పోలీసు శాఖ సుమారు 80వేల మంది సిబ్బందిని నిరంతరం కార్యోన్ముఖులను చేస్తూ, అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, పారదర్శకమైన పరిపాలనను అందించడానికి ఎనలేని కృషి చేసింది. విధుల్లో ఉన్న పోలీసులలో మనోధైర్యాన్ని నింపుతూ, వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్న పోలీసు అధిపతితోపాటు ఇతర అధికారుల పట్ల సిబ్బంది తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజల సేవకులే అనే దృక్పథం ప్రజల్లో బలంగా నాటుకుంది. ప్రాణత్యాగం చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను 'నిజమైన రక్షకులు' అని, 'స్నేహపూర్వక పోలీసులు' అని ప్రజలు కీర్తించారు. 


తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో ఏడాదికి సరాసరి ఒక లక్ష ఇరవైవేల కేసులు నమోదు అవుతున్నాయి. అంతమంది ఫిర్యాదుదారులతోపాటు, అంతకంటే ఎక్కువమంది నేరం ఆరోపించబడిన వ్యక్తులు కూడా స్టేషనుకు వస్తారు. అంటే సంవత్సరానికి సుమారు మూడు లక్షలమంది ప్రజలు పోలీసు స్టేషనుకు వచ్చి ప్రత్యక్షంగా పోలీసుల సేవలను పొందుతారు. వారందరికీ పోలీసుల మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారికే కాదు, వారి కుటుంబసభ్యులకు కూడా. పోలీసుల మీదనే కాదు, ప్రభుత్వం మీద కూడా. ఎందుకంటే పోలీసంటే ప్రభుత్వ ప్రతినిధి అని సామాన్యుడి అభిప్రాయం. అలా స్టేషనుకు వచ్చినవారికి సదభిప్రాయం కలగాలంటే పోలీసులు చట్టప్రకారం ప్రవర్తించడం ముఖ్యం. వారి కేసులో పురోగతిని ఎప్పటికప్పుడు పారదర్శకంగా తెలియజేయడం కీలకం. 


ప్రజల భాగస్వామ్యం లేని ఏ వ్యవస్థా మారదు. అందుకే స్టేషనుకు వచ్చిన ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక ప్రైవేటు విచారణ సంస్థను నియమించారు. వారు స్టేషనుకు వచ్చిన ప్రతి మనిషితో మాట్లాడి, తద్వారా వచ్చిన ఫలితాలను పోలీసు డిపార్టుమెంటుకు అందజేస్తారు. ఆ సమాచారం ఆధారంగా విధి నిర్వహణలో మార్పులు చేసి, తగిన శిక్షణలను సిబ్బందికి ఇస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది. తెలంగాణ పోలీసు మానవీయ పోలీసుగా మార్పు చెందుతుందని, అందుకు తగ్గ సహకారం అందజేయాలని ప్రజలు భావిస్తున్నారు.


ప్రజలతో పాటు సామాజిక బాధ్యత కలిగిన మేధావులు పోలీసు వ్యవస్థలో వస్తున్న మార్పులకు తమ సహకారం అందించాల్సిన అవసరం ఉంది. పోలీసులు ప్రజావ్యతిరేకులు అని బ్రిటిషు కాలం నుంచి పాతుకుపోయిన అభిప్రాయాలను చెరిపివేసే దిశగా ఈ వ్యవస్థకు అండగా నిలవడం మనందరి బాధ్యత. 


తెలంగాణ పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ప్రధాన కారణం. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత ప్రధానం అని చెప్పి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించడం మూలకారణం. దాంతో టెక్నాలజీని సమకూర్చుకోవడంతో పాటు స్టేషన్ల ఆధునీకరణ సాధ్యమైంది. కమాండ్ కంట్రోలు నిర్మాణంతో పోలీసుల సేవలను ప్రజలకు మరింత చేరువలోకి తేవడానికి రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 


పోలీసు ఉద్యోగుల నుంచి సమాజం ఆశిస్తున్న విధంగా ఫలితాలు రావడానికి వారి సంక్షేమం అత్యంత ప్రధానమైనది. అందుకే పోలీసుల సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఆదరణ కనపరిచారు. పొల్యూషన్ అలవెన్సుతోపాటు, ఇతర ప్రత్యేక అలవెన్సులు, యూనిఫాం అలవెన్సు పెంచారు. పోలీసు డిపార్టుమెంటుకు ఒక గ్లోబల్ ఇమేజి తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి మాత్రమే చేయగలిగిన కొన్ని సంక్షేమ అంశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో పోలీసులకు ఒక ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌తో అసువులు బాసిన వారి కుటుంబసభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి వారి కుటుంబాలకు అండగా నిలవాలి. విధుల్లో నిరంతరం మరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న పోలీసు ఉద్యోగులకు 'లైఫ్ రిస్క్ అలవెన్స్' ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్షేత్ర స్థాయిలో పని చేసే వారికి పెట్రోలు అలవెన్సు ఇవ్వాలి. సర్వీసులో కనీసం మూడు పదోన్నతులు నిర్దిష్ట సమయానికి ఇవ్వాలి. ఏళ్ళ తరబడి నలుగుతున్న కోర్టు కేసులను పరిష్కరించాలి. కెజి నుంచి పిజి వరకు పోలీసులకు ప్రత్యేక గురుకుల విద్యాలయాన్ని మంజూరు చేయాలి. పోలీసులకు ఇండ్లస్థలాలు కేటాయించాలి. 


మృత్యువుతో స్నేహం చేసే మమ్మల్ని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. ప్రజలకు అండగా నిలబడే క్రమంలో ముఖ్యమంత్రి మా వెన్నంటి ఉన్నారనే ఆత్మస్థైర్యం మమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నది. విధుల్లో ప్రాణతర్పణం చేసిన అమరవీరులందరికీ నివాళులు.

వై. గోపిరెడ్డి

రాష్ట్ర అధ్యక్షులు, 

తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం

ప్రత్యేకం మరిన్ని...