గ్రామాలను చేరకుండా మహమ్మారిని ఆపుదాం

ABN , First Publish Date - 2021-05-19T05:41:46+05:30 IST

పట్టణాలతో పోలిస్తే జనాభా సాంద్రత తక్కువ ఉండే గ్రామాల్లో కరోనాను వెంటనే కట్టడి చేయగలిగితే 60% మన దేశ జనాభాను కరోనా నుంచి....

గ్రామాలను చేరకుండా మహమ్మారిని ఆపుదాం

పట్టణాలతో పోలిస్తే జనాభా సాంద్రత తక్కువ ఉండే గ్రామాల్లో కరోనాను వెంటనే కట్టడి చేయగలిగితే 60% మన దేశ జనాభాను కరోనా నుంచి రక్షించుకోగలుగుతాం.


మొదటి వేవ్ కంటే రెండవవేవ్‌‍లో గ్రామాల్లో కరోనా వ్యాప్తి బాగా పెరిగింది. పంచాయతీ ఎలక్షన్ల రూపంలో కావొచ్చు, పండగలు, పెళ్ళిళ్ల వంటి వేడుకల రూపంలో కావొచ్చు.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు గుమికూడటం విపరీతంగా జరిగిందో అక్కడ నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. రెండవది, ఏ గ్రామాలైతే సమీప పట్టణాలతో సాంస్కృతిక వాణిజ్య సంబంధాలను నెరపుతుంటాయో అక్కడ కూడా కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఎందుకంటే ఏదో ఒక పని కోసమని పట్టణాలకు వచ్చేవారు అక్కడ కరోనా బారిన పడి తిరిగి గ్రామాలకు వెళ్ళి అక్కడ అందరికీ వ్యాపింపజేస్తుంటారు.


మూడవది, రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు. ప్రజలు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రంలో పట్టణాలకు పని కోసమని వెళ్ళి కరోనాను వెనక్కు తెచ్చుకుంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గ్రామాలు ఏవేవైతే మహారాష్ట్రతో వాణిజ్యపరమైన సంబంధాలు నెరపుతున్నాయో ఆ గ్రామాల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి.


పట్టణాల నుంచి దూరంగా విసిరేసినట్టు ఉండే గ్రామాలలో కేసులు దాదాపుగా లేవు. వారు జియోగ్రాఫికల్లీ ఐసోలేటెడ్ అయివుండటం దీనికి కారణం. ఇపుడు చేయవలసినది జియోగ్రాఫికల్లీ ఐసోలేటెడ్ గ్రామాలను మరో రెండునెలల పాటు వీలైనంత ఐసోలేటెడ్‌‍గా ఉంచడం. సరిహద్దు గ్రామాలనుంచి, పట్టణాల చుట్టుప్రక్కల ఉండే గ్రామాలనుంచి మనుషుల మొబిలిటీ జరగకుండా ఓ రెండు నెలలపాటు కట్టడి చేయటం కూడా ముఖ్యం. అలాగే హైరిస్క్ గ్రామాలను గుర్తించి వాటిలో టెస్టింగ్ రేట్లు పెంచాలి. వెంటనే హోం క్వారంటైన్ సదుపాయాలు కలిగించగలగాలి. సకల వేడుకలూ పండగలూ ఈ గ్రామాల్లో జరగకుండా చూడాలి.


గ్రామాల్లో ప్రజల సాంస్కృతిక జీవనం వేరేగా ఉంటుంది: 1. వాళ్ళల్లో తమని అందరూ వెలివేస్తారేమోననే భయం ఎక్కువ. ఇది వెలివేయవలసిన జబ్బు కాదని పెద్ద ఎత్తున బ్యానర్లు మైకుల సహాయంతో అవగాహన పెంచాలి. 2. వాళ్ళు తమ రొటీన్ జీవితం నుంచి బయటపడటానికి ఇష్టపడరు. కొత్త పోకడలకు విముఖంగా ఉంటారు. అందుకే టెస్టులకు సహకరించరు. ముక్కులో పుల్లగుచ్చి చేసే టెస్టంటే మరింత వెనుకడుగు వేస్తారు. జ్వరం దగ్గు ఉన్నవాళ్ళలో, నాలిక మీద తెల్లని పొర ఏర్పడిన వాళ్ళలో, ముక్కు వాసన కోల్పోయిన వాళ్ళలో కరోనా టెస్టులను ప్రోత్సహించాలి. వారు చేసుకోకున్నా వారిని క్వారంటైన్ చేయవచ్చు. 3. గ్రామాల్లో విశాలమైన ప్రదేశాలకు అలవాటు పడిన ప్రజలు ఒక ఐసోలేషన్ సెంటర్లో పదిహేను రోజులు పడుకోమంటే పడుకోరు. చాలామంది పారిపోయే ప్రయత్నాలు చేస్తుంటారు. తమద్వారా తమ ఇంట్లోనే వేరేవాళ్ళకు కూడా పాకుతుందనే స్పృహను బాగా కలిగించగలిగితే ఫలితం ఉండవచ్చు. 4. గ్రామాల్లో ఛాయ్ దుకాణాలు హోటళ్ళు బీడీ సిగరెట్ దుకాణాలు సాధారణంగా కిటకిటలాడుతూ ఉంటాయి. రెండు నెలలపాటు వీటిని కట్టడి చేయాలి. 5. గ్రామాల్లో పనికి అలవాటు పడిన ప్రజలు పని వదిలి హాస్పిటల్ చుట్టూ తిరగలేరు. వీరందరికీ రేషన్ సదుపాయాలు కలిగించాలి. 6. తుమ్మడం దగ్గడం వంటివి గ్రామాల్లో ఎలాంటి అడ్డుగుడ్డ లేకుండా చేసే అలవాటు ఉంటుంది. అలాగే ఉమ్మేయడం కూడా. అవగాహన కలిగించి ఈ అలవాటును మాన్పించాలి.


గ్రామాల్లో కరోనాని యుద్ధ ప్రాతిపదికన నియంత్రించాలి. వ్యాధి ముదిరి ఎక్కువ మంది గ్రామాల నుంచి పట్టణాలకు వైద్యం కోసం తిరిగే కొద్దీ వారి ద్వారా గ్రామాలకు మరింతగా కరోనా పాకడం పెరుగుతుంది. ఎందుకంటే ఒక పేషంట్‌తో ఒకరు మాత్రమే రారు. గ్రామాల నుంచి కేసులు పెరిగేకొద్దీ ఆక్సిజన్ బెడ్లూ పడకలూ వెంటిలేటర్ల కొరత పెరుగుతుంది. ఈ కారణంగా సకాలంలో వైద్యం అందనివారి సంఖ్యా పెరుగుతుంది. అందుకే పట్టణాలతో పోలిస్తే జనాభా సాంద్రత తక్కువగా ఉన్న గ్రామాల్లో వెంటనే కట్టడి చేయగలిగితే 60% మన దేశ జనాభాను కరోనా నుంచి రక్షించుకోగలుగుతాం.


డాక్టర్‌ విరించి విరివింటి

Updated Date - 2021-05-19T05:41:46+05:30 IST