చేతులు జోడిద్దాం!

ABN , First Publish Date - 2020-03-13T06:32:23+05:30 IST

మీలో సృష్టి మూలం ఉందన్న విషయాన్ని నమస్కారం నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. అది గుర్తిస్తే, నమస్కారం చేసిన...

చేతులు జోడిద్దాం!

మీలో సృష్టి మూలం ఉందన్న విషయాన్ని నమస్కారం నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. అది గుర్తిస్తే, నమస్కారం చేసిన ప్రతీసారి మీరు మీ సహజ ప్రవృత్తి వైపు అడుగులు వేస్తున్నట్టే!


ఆధునిక సమాజంలో కరచాలనం విడదీయలేని ఒక అలవాటు. పలకరింపు, అభినందన... ఇలా ఏ సందర్భమైనా చేతులు కలపడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అంతుపట్టని వ్యాధుల ముట్టడిలో ఉన్న ప్రపంచం కరచాలనానికి ప్రత్యామ్నాయాలను చూస్తోంది. అయితే భారతీయ సంస్కృతి ప్రకారం వేరొకరితో చేతులు కలపనక్కర్లేదు. చేతులు జోడిస్తే చాలు! అది నమస్కారం. అదే మన సంస్కారం.


చాలామంది నమస్కారాన్ని ఒక సాంస్కృతిక విషయంగా పరిగణిస్తారు. కానీ దాని వెనుక విజ్ఞానం ఉంది. మన అర చేతులను దగ్గరకు చేర్చే ప్రతిసారీ ఒక చిన్న శక్తి విస్ఫోటనం సంభవిస్తుంది. ఇలా చేయడం వల్ల మనలోని జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణ జరుగుతుంది. అంటే మనల్ని అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నాం. ఆ సమర్పణతో ఆ ప్రాణిని మనతో సహకరించే జీవిగా చేసుకుంటున్నాం. ప్రతీ జీవీ తన చుట్టూ ఉన్న జీవరాశుల సహకారం ఉంటేనే వృద్ధి చెందుతుంది.


అసలు ఉద్దేశం ఇదే!

ఎక్కడైనా ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతని గురించి ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ‘ఈ మనిషిలో ఇది బాగుంది, అది బాగులేదు. అతను మంచివాడు లేదా చెడ్డవాడు. అందంగా ఉన్నాడు లేకుంటే అందవికారంగా ఉన్నాడు’ ... ఇలా!  ఒక్క క్షణంలోనే ఈ అభిప్రాయాలూ, తీర్మానాలూ జరిగిపోతాయి. అవి పూర్తిగా తప్పు కూడా కావచ్చు. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ మన గతానుభవాల నుంచి వస్తాయి. ప్రస్తుతం ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించడానికి అవి అనుమతించవు. 


ఏదైనా రంగంలో మీరు సమర్థంగా పని చేయాలంటే, ఎవరైనా మీ ముందుకు వచ్చినప్పుడు వారు ప్రస్తుతం ఎలా ఉన్నారో అలాగే అవగాహన చేసుకోవాలి. వారు నిన్న ఎలా ఉన్నారన్నది కాదు... ఈ క్షణంలో ఎలా ఉన్నారనేది ప్రధానం. కాబట్టి మొదట మీరు శిరస్సు వంచి నమస్కారం చేయాలి.  ఒకసారి అలా చేసినట్టయితే, మీ ఇష్టానిష్టాలు బలపడకుండా మెత్తబడతాయి. వారిలో ఉన్న సృష్టి మూలాన్ని మీరు గుర్తిస్తారు. నమస్కారం చేయడం వెనుక ఉద్దేశం అదే!


సృష్టికర్త హస్తం

సృష్టికర్త హస్తం ప్రమేయం లేనిదేదీ ఈ సృష్టిలో లేదు. అందుకే మనం పైకి ఆకాశం వంక చూసినా, కిందికి భూమి వంక చూసినా, శిరస్సు వంచి అభివాదం చేయమని భారతీయ సంస్కృతి చెబుతోంది. స్త్రీని, పురుషుడిని, పిల్లాడిని, ఆవుని లేదా ఓ చెట్టుని... ఇలా దేన్ని చూసినా శిరస్సు వంచి అభివాదం చేయమంటోంది. 


శక్తులన్నీ ఒక్కటిగా...

నమస్కారానికి మరో కోణం కూడా ఉంది. మన అరచేతుల్లో ఎన్నో నాడుల కొసలు ఉంటాయి. వాస్తవానికి మన నాలుక కన్నా, కంఠం కన్నా మన చేతులే ఎక్కువ మాట్లాడుతాయి. యోగ ముద్రల గురించి పూర్తిగా ఒక శాస్త్రమే ఉంది. మన చేతులను కొన్ని ప్రత్యేకమైన రీతుల్లో అమరిస్తే, మన దైహిక వ్యవస్థను పూర్తి భిన్నంగా పని చేసేలా చేయవచ్చు. మనం చేతులను జోడించిన క్షణమే, మన ద్వైత భావనలు, ఇష్టానిష్టాలు, కోరికలు, మనం ఈసడించుకునే విషయాలు... ఇవన్నీ సమమైపోతాయి, తొలిగిపోతాయి. ఇలా మనల్ని మనం  వ్యక్తీకరించుకోవడంలో ఒక రకమైన ఏకత్వం ఉంటుంది. అప్పుడు మనలోని శక్తులన్నీ ఒక్కటిగా పనిచేస్తాయి.

- సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2020-03-13T06:32:23+05:30 IST