హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-07-14T11:16:58+05:30 IST

జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్న హిందూపురాన్నే కొత్త జిల్లా కేంద్రంగా..

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

వైద్య కళాశాలను తరలించొద్దు

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ


హిందూపురం, జూలై 13 : జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్న హిందూపురాన్నే కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలనీ, వైద్య కళాశాలను మలుగూరు వద్ద నిర్మించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి  లేఖ రాశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కొత్తగా వైద్య కళాశాల మంజూరు నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ శ్రీనివా్‌సకు జిల్లా కేంద్రం, వైద్య కళాశాల ఏర్పాటు అంశాలపై వేర్వురుగా సోమవారం లేఖలు రాశారు. హిందూపురంలో వాణిజ్య, విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధితోపాటు కొత్త జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు. స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీతోపాటు 1.60 లక్షల జనాభా, పుష్కలంగా తాగు, సాగు నీరు, జాతీయ రహదారులు, బెంగుళూరుకు దగ్గర ఉందన్నారు.


కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే తక్షణమే హిందూపురంలో పాలనా వ్యవహారాలు చేపట్టేందుకు వసతులున్నాయన్నారు. కార్యాలయాల భవన నిర్మాణాలకు అవసరమైన మేర భూమి అందుబాటులో ఉందన్నారు. హిందూపురాన్నే కొత్త కేంద్రంగా ప్రకటించాలన్నారు. వైద్య కళాశాలను హిందూపురం మండలం మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ భూములు కూడా ఉన్నాయన్నారు. హిందూపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే లక్షలాది మందికి నాణ్యమైన వైద్యసేవలు అందుతాయన్నారు. ఈ మేరకు లేఖలను మెయిల్‌, ఫ్యాక్స్‌ ద్వారా పంపించారు. వైద్య కళాశాల, జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించాలని అలుపెరగని ఉద్యమం చేస్తున్న అఖిలపక్షం, రాజకీయ, ప్రజా, కుల సంఘాలతోపాటు ప్రజలను ప్రత్యేకంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. వైద్య కళాశాల, జిల్లా సాధనకు అందరినీ కలుపుకుని, ప్రత్యక్ష పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు.

Updated Date - 2020-07-14T11:16:58+05:30 IST