ప్రైవేటు వ్యక్తులు దాడులు చేస్తున్నారు.. : సీపీకి లేఖ

ABN , First Publish Date - 2021-06-07T11:44:11+05:30 IST

ఇంటిపై దాడులు.. మానసిక వేధింపులతో కొంతమంది రౌడీలు బెదిరిస్తున్నారంటూ

ప్రైవేటు వ్యక్తులు దాడులు చేస్తున్నారు.. : సీపీకి లేఖ

  • తనకు, కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ సీపీకి లేఖ


హైదరాబాద్‌ సిటీ : ఇంటిపై దాడులు.. మానసిక వేధింపులతో కొంతమంది రౌడీలు బెదిరిస్తున్నారంటూ ఓ వ్యక్తి సైబరాబాద్‌ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా తమ ఇంటికి వస్తున్నారని, రౌడీలు కూడా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. టోలీచౌకి అజీజ్‌బాగ్‌ కాలనీకి చెందిన రియల్‌ వ్యాపారి మహమ్మద్‌ మతీన్‌ షరీఫ్‌ రెండేళ్లుగా బంజారాహిల్స్‌కు చెందిన రియల్‌ వ్యాపారి అఫ్రోజ్‌బేగ్‌ అలియాస్‌ షకీల్‌ అనే వ్యక్తితో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాడు. గతేడాది అక్టోబర్‌లో మతీన్‌ తనకు పరిచయమున్న నైఫుల్లా హుస్సేనీని షకీల్‌కు పరిచయం చేశాడు. అప్పటినుంచి షకీల్‌, నైఫుల్లా కలిసి పలు లావాదేవీలు నిర్వహించారు. 


కక్షగట్టి వేధిస్తూ..

ఈ క్రమంలో షకీల్‌, నైఫుల్లా మధ్య వ్యాపారంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. తన ద్వారా పరిచయమైన నైఫుల్లా మోసం చేశాడంటూ షకీల్‌ తనపై కక్ష గట్టాడని మతీన్‌షరీఫ్‌ పేర్కొన్నారు. అంతటితో ఆగక ఆరునెలల క్రితం రెండుసార్లు తన ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పీఎ్‌సలో కేసు సైతం నమోదై ఉన్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా నైఫుల్లా హుస్సేనీ సైతం షకీల్‌పై ఫిర్యాదు చేయడంతో రాజేంద్రనగర్‌ పీఎ్‌సలో కేసు నమోదైందని పేర్కొన్నారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదరడంతో రాజేంద్రనగర్‌ పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తూ తనను వేధిస్తున్నారని మతీన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తాను చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, పోలీసులను సైతం తన ఇంటికి తీసుకొచ్చి మానసికంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులే కాకుండా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా తనను బెదిరిస్తున్నారని పేర్కొంటూ సీసీ టీవీ ఫుటేజీలను సీపీ కార్యాలయంలో అందజేసినట్లు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన సీపీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-07T11:44:11+05:30 IST