ఎల్జీ సంచలన నిర్ణయం... స్మార్ట్‌ఫోన్ వ్యాపారం మూసివేత..!

ABN , First Publish Date - 2021-04-05T22:05:52+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ ఫోన్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన స్మార్ట్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎల్జీ సంచలన నిర్ణయం... స్మార్ట్‌ఫోన్ వ్యాపారం మూసివేత..!

సియోల్ : దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ ఫోన్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన స్మార్ట్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన మార్కెట్ పోటీ, తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ వస్తుండటంతో ఎల్జీ మార్కెట్ కాస్త తగ్గింది. ఈ క్రమంలో... గత ఆరు సంవత్సరాల కాలంలో 4.5 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూసింది. దీంతో తాజాగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భారీ నష్టాల కారణంగా స్మార్ట్ ఫోన్ డివిజన్ ఉత్పత్తి, విక్రయాలకు  ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. కాగా... కంపెనీని ఇతర సంస్థలకు విక్రయించే దిశగా చేసిన యత్నాలు  విఫలమయ్యాయి. దీంతో తాజా నిర్ణయం తీసుకుంది.


టాప్ కంపెనీగా...

ఎల్జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో పలు వినూత్న పోకడలకు తెరదీచింది. అల్ట్రా‌వైడ్ యాంగిల్ కెమెరా సహా ఎన్నో ఆవిష్కరణలు చేసింది. ఎనిమిదేళ్ళ క్రితం(2013 లో) ప్రపంచ మూడో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్‌గా నిలిచింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ ఫోన్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో గతంలోని దిగ్గజ కంపెనీలు ఇప్పుడు నష్టాలను చవిచూస్తున్నాయి.


ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్, ఆపిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎల్జీ మాత్రం తన సొంత హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్ అంశాలతో సతమతమవుతోంది. దీంతో వ్యాపారంలో కొంత వాటాను విక్రయించేందుకు తీసుకున్న నిర్ణయం విఫలమైంది. 


తొలి దిగ్గజం...

ఉత్తర అమెరికాలో ఇప్పటికీ ఇది మూడో అతిపెద్ద బ్రాండ్‌గా కొనసాగుతోంది. కానీ ఇతర మార్కెట్లలో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. సొంత దేశం దక్షిణ కొరియా మార్కెట్‌లో మెరుగ్గానే ఉంది. గతేడాది 28 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను ఎల్జీ విక్రయించింది. అదే శాంసంగ్ 256 మిలియన్ల మొబైల్ ఫోన్లను విక్రయించింది. తన మొబైల్ ఫోన్ మార్కెట్‌ను జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సీ సహా రెండు పెద్ద సంస్థలకు విక్రయించాలన్న ప్రతిపాదన విఫలమైంది. 


వాటిపై దృష్టి...

ఎల్జీ మొబైల్స్ తాజా నిర్ణయం చాలా కీలకమని, ఇప్పుడు ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ వెహికిల్ కాంపోనెంట్స్, కనెక్టెడ్ డివైసెస్, స్మార్ట్ హోమ్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సెక్టార్లపై దృష్టి సారించనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్‌లొ కంపెనీ వాటా కేవలం రెండు శాతం మాత్రమే.

Updated Date - 2021-04-05T22:05:52+05:30 IST