ఎల్‌జీ నుంచి చుట్టేసుకునే ల్యాప్‌టాప్.. పేటెంట్‌కు దరఖాస్తు!

ABN , First Publish Date - 2020-11-22T02:14:29+05:30 IST

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ రాబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌లకు భిన్నంగా

ఎల్‌జీ నుంచి చుట్టేసుకునే ల్యాప్‌టాప్.. పేటెంట్‌కు దరఖాస్తు!

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ రాబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌లకు భిన్నంగా ఉండే దీనిని ఎంచక్కా చుట్టేసుకోవచ్చు. 17 అంగుళాల పరిమాణంతో రాబోతున్న ఈ రోలబుల్ ల్యాప్‌టాప్ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఎల్‌జీ మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కానీ, అది చేసుకున్న పేటెంట్ దరఖాస్తు మాత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.


ఈ రోలబుల్ ల్యాప్‌టాప్‌లో ఫోల్డబుల్ కీబోర్డ్, టచ్‌ప్యాడ్ ఉంటాయి. ఎల్‌జీ గత కొంతకాలంగా రోలబుల్ డిస్‌ప్లేల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుండగా, తర్వాతి తరం స్మార్ట్‌ఫోన్ల కోసం ఒప్పో, టీఎల్‌సీ వంటి కంపెనీలు రోలబుల్ డిస్‌ప్లేల తయారీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఎల్‌జీ నుంచి రాబోయే రోలబుల్ ల్యాప్‌టాప్‌లు 13.3-17 అంగుళాల పరిమాణంతో ఉంటాయని తెలుస్తోంది. దీనిని చుట్టేసినప్పుడు సౌండ్‌బార్‌లా కనిపిస్తుంది. అన్ని ల్యాప్‌టాప్‌లలానే దీనికి కూడా కీబోర్డుతోపాటుగా పవర్ బటన్ ఉంటుంది.  


మరోవైపు, వచ్చే ఏడాది నాటికి ఎల్‌జీ రోలబుల్ స్మార్ట్‌ఫోన్లను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ‘ప్రాజెక్టు బి’ కోడ్‌నేమ్‌తో వీటిని అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇంకోవైపు, ఒప్పో కూడా ఇదే పనిలో ఉంది. ‘ఒప్పో ఎక్స్ 2021 కాన్సెప్ట్ ఫోన్’ను రోలబుల్ ఓలెడ్ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. 


Updated Date - 2020-11-22T02:14:29+05:30 IST