సాధారణమైంది కాదు..చాలా పెద్ద దుర్ఘటన

ABN , First Publish Date - 2020-07-07T19:04:54+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌లో సంభవించిన ప్రమాదం సాధారణమైనది కాదని..

సాధారణమైంది కాదు..చాలా పెద్ద దుర్ఘటన

ఎల్‌జీ ప్రమాదంపై హైపవర్‌ కమిటీ నివేదిక

యాజమాన్య నిర్లక్ష్యమే కారణం

ఏప్రిల్‌ 24నే ట్యాంకు నుంచి సిగ్నల్‌ వచ్చినా...పట్టించుకోలేదు

ఇప్పటికీ కంపెనీలో 36 సైరన్లు పనిచేయడం లేదు

సిబ్బందికీ అవగాహనా లేదు, శిక్షణా లేదు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌లో సంభవించిన ప్రమాదం సాధారణమైనది కాదని, ‘చాలా పెద్ద దుర్ఘటన’ అని హైపవర్‌ కమిటీ వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన హైపవర్‌ కమిటీ తన నివేదికను సీఎం జగన్‌కు అమరావతిలో సోమవారం అందజేసింది. అందులో కమిటీ అనేక వ్యాఖ్యలు చేసింది. ఎల్‌జీ యాజమాన్యం పరిశ్రమ నిర్వహణలో చాలా నిర్లక్ష్యం ప్రదర్శించిందని స్పష్టంచేసింది. ఈ ప్రమాదంతో పరిశ్రమల పర్యవేక్షణలో వివిధ శాఖల మధ్య కొంత గ్యాప్‌ ఉన్నట్టు గుర్తించామని, అందుకని ప్రత్యేకంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పరిశ్రమల్లో భద్రతకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం వుందని హైపవర్‌ కమిటీ సూచించింది.


- ప్రమాదం జరగడానికి రెండు వారాల ముందు అంటే ఏప్రిల్‌ 24న స్టైరిన్‌ ట్యాంక్‌ ఎం.6లో పొలమరైజేషన్‌ ప్రారంభమైనట్టు సిగ్నల్‌ వచ్చింది. దానిని సిబ్బంది గానీ, యాజమాన్యం గానీ పట్టించుకోలేదు. అప్పుడే అప్రమత్తమై వుంటే అంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.

- డిసెంబరు, 2019లో ట్యాంకు పైపులైన్‌ సర్క్యులేషన్‌లో లోపాలు తలెత్తాయి. మిక్సింగ్‌ సమస్యలు కనిపించాయి. వాటికి మరమ్మతులు చేశారు. కానీ శాస్త్రీయంగా జరగలేదు. ఆ లోపాలే ఆ తరువాత పెద్ద సమస్యకు దారితీశాయి.

- ట్యాంకుల డిజైన్లలో లోపాలు ఉన్నాయి. దానివల్ల కూలింగ్‌ సర్క్యులేషన్‌ సరిగ్గా జరగక, మిక్సింగ్‌ సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగింది.  

- సిబ్బందికి ఎంత ప్రమాదకరమైన పరిశ్రమలో పనిచేస్తున్నారో అవగాహన లేదు. సరైన శిక్షణ లేదు. 

- కరోనా లాక్‌డౌన్‌కు ముందు కంపెనీని మూసివేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. అలాగే లాక్‌డౌన్‌ తెరుస్తున్నప్పుడు కూడా అనుసరించాల్సిన విధానాలు పట్టించుకోలేదు.

- ప్రమాదం జరిగిన తరువాత కూడా అలారం సిస్టమ్‌ను యాజమాన్యం పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ కంపెనీలో 36 అలారం కేంద్రాలు పనిచేయడం లేదు. 

- ప్రమాదం జరిగితే విరుగుడుకు అవసరమైన రసాయనాలను కూడా అందుబాటులో ఉంచుకోలేదు. 

Updated Date - 2020-07-07T19:04:54+05:30 IST