పరిహారం..ఫలహారం!

ABN , First Publish Date - 2020-05-23T08:50:59+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులకు ప్రభుత్వం అందించిన పరిహారం పంపిణీలో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగింది.

పరిహారం..ఫలహారం!

‘గ్యాస్‌’ ఎక్స్‌గ్రేషియా పంపిణీలో గోల్‌మాల్‌.. బాధితుల్లో 2 వేల మంది వైసీపీ కార్యకర్తలు 


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం):ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధితులకు ప్రభుత్వం అందించిన పరిహారం పంపిణీలో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. విశాఖలోని అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పి బాధితులతో పాటు వైసీపీ కార్యకర్తలకు కూ డా పరిహారం ఇప్పించుకున్నారు. ఇలా సుమారు రెండు వేల మందికి రూ.పదేసి వేల చొప్పున అందజేశారు.  గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రి య కూడా ముగిసింది. కరోనా వైరస్‌ కారణంగా వాయిదాపడ్డాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రాంతంలో ఓ వైసీపీ నాయకుడి కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్నారు. ఆయనే గ్యాస్‌ లీకేజీ బాధితుల తయారీ జాబితాలో కీలకంగా వ్యవహరించారు. ప్రమాదం 92వ వార్డులోని వెంకటాపురంలో జరగడంతో.. ఐదు గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లు వదిలి పారిపోయారు. ప్రభుత్వం చనిపోయిన వారికి, చికిత్స పొందిన వారికి పరిహారం ఇచ్చింది.


అవి కాకుండా బాధిత గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. ఇది వైసీపీ స్థానిక  నాయకుడికి బాగా కలిసివచ్చిం ది. బాధిత గ్రామాలు ఐదు కాగా.. ఎలాంటి ప్రభావం లేని 11 కాలనీలను ఆ జాబితాలో చేర్చారు. అలాగే 91వ వార్డుకు చెందిన వైసీసీ కార్యకర్తలు, రిసోర్స్‌ పర్సన్ల ఆధార్‌ కార్డులు సేకరించి ప్రభుత్వానికి సమర్పించారు. మనిషికి రూ.10 వేలు చొప్పున పరిహారం ఇప్పిస్తామని, ఒక్కో ఇంటికి రూ.30 వేల నుంచి రూ.50 వేలు వస్తుందని, ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ఆయా కాలనీలు, వార్డుల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. 


బాధిత గ్రామాల ప్రజలకు పరిహారం కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రూ.10 వేల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించింది. ఐదు గ్రామాలతో పాటు మరో 11 కాలనీలను గుర్తించి.. 19,893 మందికి పరిహారం ఇచ్చారు. అందులో దాదాపుగా రెండు వేల మంది ఇతర ప్రాంతాలకు చెందినవారు. వారే కాకుండా.. బాధిత గ్రామాల్లోనూ అదనంగా వ్యక్తుల పేర్లు చేర్పించి, ఆ మొత్తం కూడా వైసీపీ నాయకులు స్వాహా చేశారు. 

Updated Date - 2020-05-23T08:50:59+05:30 IST