అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు

ABN , First Publish Date - 2022-01-17T03:47:26+05:30 IST

ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. వార్తా పత్రికలు, వివిధ రకాల పుస్తకాల ద్వారా ప్రజలకు, విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంత గానో ఉపయోగపడతాయి. వివిధ రకాల స్టడీ మెటీరియల్‌ అందు బాటులో ఉండటంతో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు
లక్షెట్టిపేట గ్రంథాలయం

లైబ్రరీలకు ఫండ్‌ జమ చేయడంలో నిర్లక్ష్యం

పైసా విదిల్చని మున్సిపాలిటీలు, పంచాయతీలు

అరకొర వసతుల మధ్య పాఠకుల ఇబ్బందులు

వెలవెలబోతున్న విజ్ఞాన భాండాగారాలు

మంచిర్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. వార్తా పత్రికలు, వివిధ రకాల పుస్తకాల ద్వారా ప్రజలకు, విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంత గానో ఉపయోగపడతాయి. వివిధ రకాల స్టడీ మెటీరియల్‌ అందు బాటులో ఉండటంతో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం అకాడమిక్‌ లైబ్రరీ, ప్రత్యేక లైబ్రరీ, పబ్లిక్‌ లైబ్రరీ, నేషనల్‌ లైబ్రరీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అయితే కాలక్రమేణ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు కరువై పాఠకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అరకొర వసతుల మధ్య

జిల్లా వ్యాప్తంగా 18 మండలాలకుగాను ప్రస్తుతం 14 గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నాలుగైదు మినహా మిగతావన్ని తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న లైబ్రరీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అరకొర వసతుల మధ్య పాఠకులు కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొ న్నాయి. చెన్నూరు, బెల్లంపల్లి, భీమారం, భీమిని, వేమనపల్లి, కోటపల్లి, తాండూరు, మంచిర్యాల మినహా మరెక్కడా సొంత భవనాలు లేవు. సొంత భవనాలు ఉన్నచోట వసతులు కొంత మెరుగ్గా ఉండగా, తాత్కాలిక భవనాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. అసలు లైబ్రరీలకు వెళ్లాలంటేనే పాఠకులు అనాసక్తి కనబరుస్తున్నారు. కొన్ని చోట్ల పేపర్‌ బిల్లులు, వాటర్‌ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తికాదు. 

సెస్సు చెల్లించడంలో నిర్లక్ష్యం

గ్రంథాలయాల అభివృద్ధికి నిధుల సేకరణ తప్పనిసరి. వాటిలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేసే సెస్సు ప్రధాన పాత్ర పోషిస్తోంది. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, 311 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా స్థానిక సంస్థల నుంచి యేటా గ్రంథాలయాలకు సెస్సు చెల్లించవలసి ఉంటుంది. స్థానిక సంస్థల పరిధిలో వసూలయ్యే ఇంటి పన్ను మీద 8 శాతం సెస్సు గ్రంథాలయాలకు జమ చేయవలసి ఉంటుంది. ఆ నిధులతో గ్రంథాలయాల్లో అవసరమైన అభివృద్ధి చేపట్టేందుకు వెసలుబాటు కలుగుతుంది. అయితే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ప్రజల నుంచి వసూలు చేసే ఇంటి పన్ను నుంచి సెస్సు జమ చేయడంలో  నిర్లక్ష్యం వహిస్తున్నందున జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది. 

పేరుకుపోయిన బకాయిలు

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి లైబ్రరీలకు జమ కావలసిన సెస్‌ కోట్లలో పేరుకుపోయింది. జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో సంవత్సరానికి ఇంటి పన్ను డిమాండ్‌ రూ.6 కోట్ల 15 లక్షల 10వేలు ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల 21 లక్షల 17వేలు వసూలైంది. వసూలైన ఇంటి పన్నుపై 8 శాతం లైబ్రరీ సెస్సు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన గ్రామ పంచాయతీల నుంచి గత సంవత్సరం రూ.49 లక్షల 20వేల 800 గ్రంథాలయాల సెస్సు జమ చేయాల్సి ఉంది. అయితే గత సంవత్సరంలో గ్రామ పంచాయతీలు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. అలాగే 7 మున్సిపాలిటీల ద్వారా గత సంవత్సరం సుమారు రూ.20 కోట్ల మేర ఇంటి పన్ను వసూలు కాగా 8 శాతం సెస్సు కింద రూ. 1 కోట్ల 60 లక్షలు సెస్సు గ్రంథాలయాలకు జమ చేయవలసి ఉంది. మంచిర్యాల, నస్పూర్‌, క్యాతనపల్లి మున్సిపాలిటీలు మాత్రమే పూర్తిస్థాయిలో సెస్సు జమ చేయగా బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు పాక్షికంగా చెల్లించగా చెన్నూరు, లక్షెట్టిపేట మున్సిపాలి టీలు సెస్సు జమ చేయడం లేదని తెలుస్తోంది. లైబ్రరీలకు సకాలంలో సెస్సు జమ చేయడంలో అఽధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడు సెస్సు జమ చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు పాఠకులు కోరుతున్నారు. 

సెస్సు జమ చేయాలి

గ్రంథాలయశాఖ జిల్లా కార్యదర్శి అర్జున్‌

సెస్‌ కలెక్షన్‌ పూర్తిస్థాయిలో రావడం లేదు. సెస్సు చెల్లించడంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కొంతలో కొంత మున్సిపాలిటీలు చెల్లిస్తున్నప్పటికీ గ్రామపంచాయతీల నుంచి సెస్‌ అసలే జమ కావడం లేదు. సంబంధిత అధికారులు ఈ విషయమై దృష్టి సారించడం ద్వారా ఎప్పటికప్పుడు సెస్‌ జమ చేసేలా చర్యలు తీసుకో వాలి. లైబ్రరీల అభివృద్ధికి మున్సిపాలిటీలు, పంచాయతీలు తోడ్పాటునందించాలి.  

Updated Date - 2022-01-17T03:47:26+05:30 IST