ఎల్‌ఐసీ ఐపీవో నోటిఫికేషన్... రెండు దశల్లో

ABN , First Publish Date - 2021-07-25T21:39:01+05:30 IST

ఎల్‌ఐసీ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) త్వరలో ఐపీవోకు రానుంది. ఈ సంస్థలోని తన పెట్టుబడులను రెండు దశల్లో ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది.

ఎల్‌ఐసీ ఐపీవో నోటిఫికేషన్... రెండు దశల్లో

ముంబై : ఎల్‌ఐసీ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) త్వరలో ఐపీవోకు రానుంది. ఈ సంస్థలోని తన పెట్టుబడులను రెండు దశల్లో ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించుకోవాలని భావిస్తోంది. వీటిలో ఎల్ఐసీ ఐపీవో కీలకం. ఎల్ఐసీ విలువ  రూ. 12 లక్షల కోట్ల నుండి రూ. 15 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో పది శాతం వాటాను విక్రయించేందుకు షేర్లను జారీ చేస్తే వాటి విలువ రూ. 1.2 లక్షల నుండి రూ. 1.5 లక్షల కోట్ల వరకు ఉంటుంది. కాగా...ఇంత పెద్దమొత్తంలో ఒకేసారి సమీకరణకు వెళితే, పబ్లిక్ ఇష్యూకు రావాలనుకున్న ఇతర ప్రైవేటు సంస్థలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావిస్తున్నారు.


ఎల్ఐసీ ఐపీఓపై ఆసక్తి...

ఇటీవల ఐపీవోకు వచ్చిన జొమాటోకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. జొమాటో రూ. 9.373 కోట్ల ఐపీవోకు వచ్చింది. దీనికి నలభై రెట్లకు పైగా స్పందన లభించడం గమనార్హం. పేటీఎం, పాలసీబజార్, మొబిక్విక్, ఫ్లిప్‌కార్ట్, నైకా వంటి సంస్థలు ఐపీవోకు రానున్నాయి. ఈ నేపధ్యంలో... ఎల్ఐసీ ఐపీవోకు వస్తే మంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు. కాగా... సంస్థాగత ఇన్వెస్టర్లు ఎల్ఐసీ పై ఆసక్తితో ఉన్నారు


అందుకే రెండు దఫాల్లో... 

కొత్తగా ఐపీఓకు రావాలనుకుంటోన్న  సంస్థలకు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కొన్ని చిన్నసంస్థల షేర్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిని నివారించేందుకు తొలుత ఎల్ఐసీలో 5-6 శాతం వాటాను మాత్రమే మార్కెట్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో దశ ఐపీఓకు అంటే ఫాలోఆన్‌కు రావడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చునని భావిస్తున్నారు. 

Updated Date - 2021-07-25T21:39:01+05:30 IST