లైఫ్ ఆఫ్టర్ కరోనా: పాల పరిశ్రమ పరిస్థితేంటి?

ABN , First Publish Date - 2020-06-02T17:25:04+05:30 IST

ప్రజల నిత్యావసరాల్లో పాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగనిదే కొందరికి దైనందిన వ్యాపకాలు మొదలుకావు. చిన్నారులకి కూడా పాలు మంచి పోషకాహారం. పాలతో తయారుచేసే కోవా, పెరుగు, వెన్న, నెయ్యి, లస్సీ తదితర ఉత్పత్తులకి మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉంటుంది.

లైఫ్ ఆఫ్టర్ కరోనా: పాల పరిశ్రమ పరిస్థితేంటి?

ప్రజల నిత్యావసరాల్లో పాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగనిదే కొందరికి దైనందిన వ్యాపకాలు మొదలుకావు. చిన్నారులకి కూడా పాలు మంచి పోషకాహారం. పాలతో తయారుచేసే కోవా, పెరుగు, వెన్న, నెయ్యి, లస్సీ తదితర ఉత్పత్తులకి మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉంటుంది. ఇలాంటి పాడి పరిశ్రమని కూడా డీలాపడేలా చేసింది కరోనా వైరస్‌. లాక్‌డౌన్‌ సమయంలో మార్కెట్‌ బంద్‌ కావడంతో కరోనా తర్వాత పాల పరిశ్రమ పరిస్థితిపై ‘ఏబీఎన్’ ప్రత్యేక కథనం..


  ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. కొందరు వరి అన్నం తింటే ఇంకొందరు గోధుమలతో చేసిన రోటీలు తింటారు. మరికొందరు రాగి సంగటిని ఇష్టంగా లాగిస్తుంటారు. అయితే.. పాలు లేదా పాల సంబంధ ఉత్పత్తులు మాత్రం ఈ వ్యత్యాసాలకు అతీతం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో ఇంటింటా కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా ఉంటుంది. ఉదయాన్నే వేడివేడి ఛాయ్ లేదా ఘుమఘుమలాడే కాఫీ గొంతు దిగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. రోజువారీ పనుల ఒత్తిడి నుంచి తేలికపడటానికి రోజులో దఫదఫాలుగా టీ తాగేవారు అనేక మంది కనిపిస్తుంటారు. ఈ కారణంగానే పల్లెటూర్లు మొదలు నగరాల వరకు ఎక్కడ చూసినా ఛాయ్‌ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి అసంఖ్యాకంగా దర్శనమిస్తుంటాయి. 


   చిన్నారులకి పాలే మంచి పౌష్టికాహారం. అంతేకాదు- పాల సంబంధ ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, కోవా, పన్నీర్, ఫ్లేవర్డ్‌‌ మిల్క్‌, లస్సీ వంటివాటికి, బేకరీ ఐటమ్స్‌కి కూడా పాలు ఎంతో అవసరం. డెయిరీ ఉత్పత్తులలో 70 శాతం పాల రూపంలో ఉంటే మిగతా 30 శాతం మిల్క్‌ ప్రోడక్ట్స్‌ రూపంలో ఉంటాయి. ఈ రకంగా పాలకి రెండు రకాల డిమాండ్‌ ఉంటుంది- ఒకటి డొమెస్టిక్‌. రెండవది కమర్షియల్‌. లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఛాయ్‌- కాఫీ దుకాణాలు వంటివి పూర్తిగా మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, ఐటీ సంస్థలు, థియేటర్లు, మాల్స్‌ వంటివి బంద్‌ అయ్యాయి. ఫలితంగా ఒకేసారి పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తుల కమర్షియల్‌ డిమాండ్‌ జీరోకి పడిపోయింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి నిలిచిపోవడంతో ఆ మేరకు ఐస్‌క్రీం అమ్మకాలు తగ్గిపోయాయి. మిఠాయి షాపులు మూతపడటం, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కూడా ఖాళీ అవడంతో ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మేరకు పాడి రైతులు నష్టపోయినట్టే లెక్క! లాక్‌డౌన్‌ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో పాల డిమాండ్‌ 30 శాతం మేర తగ్గిపోయింది. 


  దేశీయ పాల పరిశ్రమకి ఒక రూపం, సారం అందించిన మహాశయుడు కురియన్‌. ఆయన స్థాపించిన అముల్‌ డెయిరీ పాలకి, అముల్‌ ఉత్పత్తులకి నేటికీ ఎంతో ప్రజాదరణ ఉంది. ఆ స్ఫూర్తితోనే నేడు దేశంలో వందలాది సహకార పాల ఉత్పత్తి సంఘాలతోపాటు ప్రయివేట్‌ డెయిరీలు మనుగడలో ఉన్నాయి. కరోనాకి ముందు వరకు ఈ వ్యవస్థ స్థిరాభివృద్ధితో వర్థిల్లింది. లాక్‌డౌన్‌ తర్వాత మాత్రం ఒడిదుడుకులు మొదలయ్యాయి. కాంట్రాక్టు కార్మికుల కొరత, పంపిణీ కేంద్రాల మూసివేత, పశుగ్రామం సమస్య, ప్యాకేజింగ్‌కి అవసరమైన సామగ్రి లభించకపోవడం వంటి కారణాలతో చిన్నతరహా ప్రయివేట్‌ డెయిరీలు కష్టాల్లో చిక్కుకున్నాయి. సహకార పాల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఆటుపోట్లకి గురయ్యాయి. ఈ కారణంగా చాలా సంస్థలు తమ సరఫరాకి కోత విధించుకున్నట్టు సమాచారం. సందట్లో సడేమియా అన్నట్టు కొన్నిచోట్ల ప్రయివేటు పాల ఉత్పత్తి కేంద్రాలు, మధ్య దళారులు అమాంతం పాలధర తగ్గించడంతో పాడి రైతులు చిన్నబోయారు. 


    అయితే ఇక్కడో గమనించతగ్గ అంశముంది. మిగతా వ్యాపారాలతో పోలిస్తే.. కరోనా కాలంలోనూ రైతులను ఆదుకున్న రంగం పాడి పరిశ్రమ మాత్రమే అని పరిశీలకులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ పాలకి కమర్షియల్‌ డిమాండ్‌ తగ్గిపోతే.. ఆ స్థానంలో హోం కంజప్షన్‌ కొంతైనా పెరిగి బ్యాలన్స్‌ అయ్యిందట. జనం ఇంటిపట్టునే ఉండటం వల్ల గృహ అవసరాలకు వాడే పాల శాతం బాగానే పెరిగిందట. లాక్‌డౌన్‌ విధించిన కొత్తల్లో రెండు మూడు రోజులపాటు పాల సరఫరాకి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పాలు సరఫరా చేసే వ్యాన్లను కొన్నిచోట్ల పోలీసులు అడ్డుకున్న సందర్భాలున్నాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన పాలకులు అప్రమత్తమయ్యారు. పాలు అనేవి ఫుడ్‌ ఐటమ్‌, ప్యాక్డ్‌ ఐటమ్‌. అందువల్ల అత్యవసర సర్వీసుల విభాగంలో దీన్ని చేర్చారు. ఫలితంగా పాడిరైతులు కొంతైనా ఊపిరి పీల్చుకోగలిగారు. 


   తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తి, వినియోగం బాగా ఎక్కువ. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50 నుంచి 60 లక్షల లీటర్ల పాల అమ్మకాలు జరుగుతున్నాయి. నిజానికి పాల ఉత్పత్తి అంతకంటే ఎక్కువే ఉంటుంది. రైతుల అవసరాలు, మిల్క్‌ ప్రోడక్ట్‌లకి పోను మిగతా పాలను మార్కెట్‌లో విక్రయిస్తారు. మొత్తం వినియోగంలో వ్యవస్థీకృత డెయిరీలు విక్రయించే పాలు 60 శాతం ఉంటే, మిల్క్‌ వెండర్స్‌ ఇంటింటికీ తిరిగి అమ్మే పాలు 40 శాతంగా ఉంది. అముల్‌ వంటి ఇతర రాష్ట్రాల బ్రాండ్ల పాలు కూడా తెలంగాణలో బాగానే అమ్ముడవుతాయి. 


   హైటెక్‌ సొబగుల మహానగరమైన హైదరాబాద్‌లో రోజుకి సుమారు 30 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తారు. దేశీయ పాడి పరిశ్రమ సుభిక్షంగా ఉండటం వల్లే ఈ స్థాయిలో పాల ఉత్పత్తి, సరఫరా, వినియోగం వంటివి సుసాధ్యమవుతున్నాయి. భారతీయ జీవన విధానంలో పాడి అనేది గౌరవప్రదమైన అంశంగా పరిగణిస్తారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు అత్యధికంగా ఆధారపడిన రంగం కూడా పాడి పరిశ్రమే! కరోనా తర్వాత అనేకమంది రైతులను ఆదుకున్న పరిశ్రమ ఇదే కావడం గమనార్హం! ఇలాంటి సెక్టార్‌ కూడా లాక్‌డౌన్‌ కష్టాలకి గురికాక తప్పలేదు. 


  వ్యవసాయం నేర్చిన తొలినాళ్లలోనే అంటే సుమారు 11 వేల యేళ్ల క్రితమే మేక, గొర్రె, ఆవు, గేదె వంటి సాధు జంతువులను మచ్చికచేసుకుని వాటి పాలను మనుషులు ఆహారంగా తీసుకోవడం మొదలైంది. నాటినుంచి ప్రతి రైతు ఇంటా పాడి ఉండటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఒకవేళ వ్యవసాయం కలిసిరాని సందర్భాలు వస్తే.. రైతులను పాడి ఎంతో ఆదుకునేది. మన దేశంలో 15 కోట్లమంది చిన్న రైతులు, పాల సహకార సంఘాలు, పాల వ్యాపారులు దేశంలో క్షీరవిప్లవానికి దోహదపడుతున్నారు. మన దేశం ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఉంది. 


   భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1,86,000 పాల సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో 32,000 సంఘాలకు మహిళలే సారథ్యం వహిస్తుండటం గమనార్హం. ప్రపంచ సగటు తలసరి పాల లభ్యత కంటే మన దేశంలో అధికంగా ఉత్పత్తి జరుగుతోంది. 2017-18లో మన దేశంలో పాల ఉత్పత్తి 17.64 కోట్ల టన్నులుగా ఉంది. 2021- 22 నాటికి 25.45 కోట్ల టన్నులకు పాలను ఉత్పత్తి చేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరుణంలోనే భారత్‌లో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి డిమాండ్‌ గణనీయంగా తగ్గడం నిజంగా విపరిణామం!


    నిజానికి ప్రతీ ఏడాది దేశంలో పాల ఉత్పత్తి 10 నుంచి 12 శాతం పెరుగుతూ ఉంటుంది. కొవిడ్‌ దెబ్బకి ఈ ఏడాది డెయిరీ ఇండస్ట్రీ నెగటివ్‌ గ్రోత్‌లోకి జారుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సెక్టార్‌ ఎప్పటికి కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. వచ్చే రోజుల్లో "పోస్ట్‌ కొవిడ్‌ బిహేవియర్‌'' అనే లక్షణం సమాజంలో బాగా వ్యాపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై భారీ జన సమీకరణాలు వంటివి అంతగా కనిపించకపోవచ్చు. వివాహాలు, పండుగల్లో జనం హాజరీ పరిమితం కావచ్చు. హోటళ్లలో కస్టమర్ల సందడి కొంతమేర తగ్గవచ్చు. ఇలాంటి పరిణామాలు పాడి ఉత్పత్తుల డిమాండ్‌ని దెబ్బతీసే అవకాశముంది.


    కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో అగ్రి ఇండస్ట్రీకి కొన్ని ప్రోత్సాహకాలు ఉన్నాయి. పాడి రైతులకు స్వల్ప వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పారు. సహకార సంఘాల వడ్డీని ఆలస్యంగా చెల్లించడానికి అంగీకరించారు. ఈ హామీలు కార్యరూపం దాలిస్తే.. పాడి పరిశ్రమ ప్రస్తుత కష్టాలు కొంతైనా తీరతాయని రైతులు ఆశపడుతున్నారు. 


      లాక్‌డౌన్‌ సడలింపులు మొదలయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లపై, మార్కెట్లలో సందడి పెరిగింది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. అందువల్ల వెంటనే పాలకి డిమాండ్‌ పెరిగే సూచనలు కనిపించడం లేదు. అయితే పాడి రైతులు మాత్రం ఆశాజనకంగా ఉన్నారు. అన్ని రంగాలకంటే అతి త్వరగా ఈ పరిశ్రమ కోలుకుంటుందని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అవును- పాడి రైతు బాగుంటే దేశం కూడా బాగుంటుంది. 


    భారతీయ సంప్రదాయంలో క్షీరధారని శుభసంకేతంగా భావిస్తారు. గృహప్రవేశ సమయంలో పాలు పొంగించే సన్నివేశానికి అర్థమదే! నిన్న మొన్నటి వరకు పాడి పరిశ్రమ నిజంగానే సుభిక్షంగా ఉంది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో కొంత ప్రభ కోల్పోయింది. ఈ సమస్య నుంచి డెయిరీ ఇండస్ట్రీ త్వరలోనే కోలుకోవాలనీ, శ్రేష్ఠమైన పాల ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టించాలనీ కోరుకుందాం. 

Updated Date - 2020-06-02T17:25:04+05:30 IST