లైఫ్ ఆఫ్టర్ కరోనా: లాక్‌డౌన్‌ దెబ్బకి భారీ నష్టాల్లో గోల్డ్ బిజినెస్

ABN , First Publish Date - 2020-05-22T22:14:45+05:30 IST

ఐశ్వర్యానికి పర్యాయపదం బంగారం. సంపదకి రాజసం అద్దే విలువైన లోహం స్వర్ణం. పుత్తడికే కొత్త సొబగులద్దుతుంది నవరత్న సమాహారం.

లైఫ్ ఆఫ్టర్ కరోనా: లాక్‌డౌన్‌ దెబ్బకి భారీ నష్టాల్లో గోల్డ్ బిజినెస్

ఐశ్వర్యానికి పర్యాయపదం బంగారం. సంపదకి రాజసం అద్దే విలువైన లోహం స్వర్ణం. పుత్తడికే కొత్త సొబగులద్దుతుంది నవరత్న సమాహారం. బంగారు, వెండి ఆభరణాల వ్యాపారం నిత్యకల్యాణం- పచ్చతోరణం అన్నట్టుగా సాగుతుండేది మన దేశంలో! అలాంటి నగల పరిశ్రమకే షాక్‌ ఇచ్చింది కరోనా వైరస్‌. లాక్‌డౌన్‌ దెబ్బకి గోల్డ్‌ బిజినెస్‌ భారీ లాస్‌ని మూటగట్టుకున్నది. 


పసిడి కాంతులపై కరోనా వైరస్‌ కాటు వేసింది. నగల పరిశ్రమకే చేటు తెచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా జెమ్స్ అండ్ జ్యువెలర్స్, లైఫ్‌స్టయిల్ దుకాణాలు అన్నీ బంద్‌ అయ్యాయి. అప్పటివరకూ జోరుగా సాగిన స్వర్ణదీప్తుల రథ ప్రస్థానానికి సడెన్‌ బ్రేక్‌పడింది. మార్కెట్‌ శక్తులకి ఊతమిచ్చే ఖరీదైన మెటల్‌కే ఈ పరిస్థితి దాపురించడంతో పరిశ్రమ వర్గాలు ఒక్కసారిగా డీలాపడ్డాయి. 


బంగారు ఆభరణాలు ధరించడాన్ని భారతీయ స్త్రీలు దర్పానికి చిహ్నంగా భావిస్తారు. అదే మగవాళ్లు అయితే స్వర్ణాన్ని వన్నెతగ్గని సిరిగా లెక్కగడతారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరికీ బంగారమంటే మోజే! కూలినాలి చేసి బతికేవారు కూడా కాస్తోకూస్తో డబ్బులు కూడబెట్టి తమ పిల్లాపాపలకి నగలు కొనడం పరిపాటి. పండుగలు- పబ్బాలు వచ్చినప్పుడు జువెలరీ షాపులకి జనాలు ఎగబడుతుంటారు. పర్వదినాల్లో బంగారాన్ని కొంటే శుభసూచకం అన్న భావనే ఈ పరిస్థితికి కారణం. కొందరు సంపన్నులు భూములు కొన్నట్టే బంగారు బిస్కట్లు కూడా కొని లాకర్లలో దాచుకుంటుంటారు. ఆర్థిక సమస్యలు ఏర్పడితే తమ వద్ద ఉన్న బంగారు నగలు తాకట్టుపెట్టి.. అప్పులు తెచ్చుకునే ఆచారం ఎప్పటినుంచో ఉంది. అంటే బంగారం అనేది కొందరికి ఆపదలో ఆదుకునే ఆదరువు! అలాంటి ఆపద్బాంధవికే ఇప్పుడు పెద్ద ఆపదొచ్చి పడింది. 


దేశ జీడీపీలో నగల పరిశ్రమ వాటా 7 శాతం. భారత్‌ నుంచి యేటా 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచ డైమండ్‌ బిజినెస్‌లో 90శాతం డిమాండ్‌ని మన దేశమే తీరుస్తోంది. దీనిలో సూరత్‌ పట్టణం వాటా 70 శాతం. బంగారు వర్తకానికి కూడా సూరత్‌ పెట్టింది పేరు. మన దేశంలోని 92 శాతం గోల్డ్‌ బిజినెస్‌ సూరత్‌ నుంచే జరుగుతుంటుంది. దేశీయ నగల పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. ఈ పరిశ్రమని కరోనా వైరస్‌ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫలితంగా లక్ష మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జువెలరీ షాపులు వారాల తరబడి మూతపడటం వల్ల ఆయా షాపుల్లో పనిచేసే సిబ్బందికి పూర్తిస్థాయి వేతనాలు అందకపోవచ్చనన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ పరిశ్రమపై ఆధారపడే రోజు కూలీలు కూడా రోడ్డునపడ్డారు. నగల తయారీ రంగ నిపుణులు కూడా పనులు కోల్పోయి బిక్కుబిక్కుమంటున్నారు. 


అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో వజ్రాలు, నగల ఎగుమతులు, ముడివజ్రాల దిగుమతులు స్తంభించిపోయాయి. దేశీయ మార్కెట్‌లో 40 శాతంమేర డిమాండ్‌ తగ్గిపోవడంతో దిగుమతులను వాయిదా వేస్తున్నట్టు రత్నాలు, నగల ఎగుమతి ప్రోత్సాహక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఇది గతంలో ఎన్నడూ చూడని సంక్షోభమని బంగారు వర్తకులు అభివర్ణిస్తున్నారు. 


హాంకాంగ్‌లో జరిగే వ్యాపారరంగంలో బంగారానిదే మేజర్‌ పార్ట్‌. ఆ బంగారంలో అత్యధిక శాతం సూరత్‌ నుంచే ఎగుమతి అవుతుంది. మార్చ్‌ నెలలో సూరత్‌ వ్యాపారస్తులు ఎనిమిది వేలకోట్ల రూపాయల ఖర్చుతో హాంకాంగ్‌లో జువెలరీ ఎగ్జిబిషన్‌ కోసం ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభణతో ఆ ఎగ్జిబిషన్‌ క్యాన్సిల్‌ అయ్యింది. ఆ మేరకు సూరత్ వ్యాపారులు నష్టపోయినట్టేనని జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. సూరత్‌ నుంచి హాంకాంగ్‌కి ప్రతీ యేటా సుమారు 50 వేల కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఎగుమతి అవుతాయి. లాక్‌డౌన్‌ వల్ల ఆ వ్యాపారమంతా స్తంభించిపోవడంతో రత్నాలు వ్యాపారులు మొర్రో అంటున్నారు. 


జువెలరీ షాపులు రోజుల తరబడి మూతపడటం వల్ల కలిగిన నష్టం అపారం. ఈ కారణంగా గత ఏడాది మన దేశంలో జరిగిన పసిడి వినియోగంతో పోలిస్తే ఈ ఏడాది 50 శాతం తగ్గవచ్చునని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ అభిప్రాయపడింది. గత ఏడాది భారతదేశంలో 690. 4 టన్నుల బంగారు వినియోగం జరిగింది. 2020లో 700 నుంచి 800 టన్నుల పరిధిలో బంగారు వినియోగం ఉంటుందని తొలుత వ్యాపారులు అంచనా వేసుకున్నారు. కానీ కరోనా దెబ్బతో ఆ బొమ్మ తలకిందులైంది. దీంతో ఈ ఏడాది 350 టన్నులకి బంగారం డిమాండ్‌ తగ్గవచ్చునని అంటున్నారు. నిజానికి వివాహాది శుభకార్యాల సమయంలోనే ప్రాణాంతక కరోనా వ్యాపించింది. ఫలితంగా లాక్‌డౌన్‌ విధించడంతో పసిడి అమ్మకాలు జీరోకి పడిపోయాయి. 


కరోనా కాలంలోనే ఉగాది, శ్రీరామ నవమి వంటి పండుగలు గడిచిపోయాయి. అక్షయ తృతీయ కూడా వెళ్లిపోయింది. నిజానికి బంగారం కొనుగోళ్లకి అక్షయ తృతీయని శుభతరుణంగా భావిస్తారు. అందువల్ల తృణమోపణమో అమ్మకాలు సాగించాలని బంగారు వర్తకులు ఒక తరుణోపాయాన్ని ఎంచుకున్నారు. తమ వెబ్‌సైట్ల ద్వారా ఆభరణాలు, గోల్డ్‌ బిస్కెట్లు, గోల్డ్‌ కాయిన్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చునని ప్రకటించారు. బంపరాఫర్లు కూడా ఇచ్చారు. పలు జువెలరీ బ్రాండ్లతోపాటు బ్యాంకులు కూడా ఈ అవకాశం కల్పించడానికి ముందుకొచ్చాయి. అయితే కస్టమర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. నగలు కొనేవారు వాటిని ప్రత్యక్షంగా వీక్షించి.. ఒంటిపై ధరించి చూసుకుని.. నచ్చిన తర్వాతే కొనడం ఆనవాయితీ. అందువల్ల ఆన్‌లైన్‌ ఆర్డర్లు అని జువెలరీ షాపులు ఎంత ఆర్భాటం చేసినా ఆశించిన ఫలితం సిద్ధించలేదు.


దేశీయ నగల పరిశ్రమలో కలకలం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా బంగారు, వెండి ఆభరణాలకు పెద్దగా డిమాండ్‌ ఏర్పడకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. కరోనా వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్ర కష్టనష్టాలకు గురయ్యారు. అందువల్ల విలాస కొనుగోళ్లకి ఇకపై దూరంగా ఉంటారని ట్రేడ్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. లాక్‌డౌన్‌ ముందు కూడా మన దేశంలో పసిడి వినియోగం తగ్గింది. మార్కెట్‌లో బంగారు ధరలకి రెక్కలు రావడం వల్లే ఆ పరిస్థితి తలెత్తింది.


లాక్‌డౌన్‌ సమయంలో మరో విచిత్రం కూడా చోటుచేసుకుంది. ఆభరణ దుకాణాలు, బులియన్‌ స్పాట్‌  మార్కెట్లు మూతపడినప్పటికీ.. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ ట్రేడింగ్‌ మాత్రం కొనసాగుతోంది. అయితే.. బంగారం ధర గడియారంలోని లోలకం మాదిరిగా అటూఇటూ ఊగిసలాడుతోంది. కొన్నిసార్లు భారీగా పెరుగుతోంది. మరికొన్నిస్లారు బాగా పతనమవుతోంది. దీంతో పసిడి బాట ఎటువైపు అన్నది బులియన్ పండితులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. కరోనా దెబ్బకి ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల సూచీలు పాతాళానికి జారుతున్నాయి. ఈ తరుణంలో భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం- వెండివైపు మదుపరుల దృష్టి పడింది. తమ సొమ్ములను ఇటు మళ్లించడంతో మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ధర కూడా అమాంతం పెరిగింది. అయితే బంగారు ధర స్థిరంగా మాత్రం ఉండటం లేదు. అప్పుడప్పుడు సూచీ డౌన్‌ అవుతోంది. కరోనా ప్రమాదం నుంచి బయటపడ్డాక.. అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ సహా పలు యూరప్‌ దేశాలు తమ బంగారు నిల్వలను ప్రపంచ మార్కెట్‌లో అమ్మకానికి పట్టే అవకాశముందన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదే జరిగితే బంగారం ధరలు పతనమార్గం పడతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్‌ రేట్‌ కూడా కుదుపునకు గురవుతోంది. 


కరోనా కాలంలో అన్ని సెక్టార్లు నష్టాల ఊబిలోకి జారుకున్నాయి. అనేక భారీ సంస్థలు, కంపెనీల షేర్లు కుప్పకూలాయి. రొటేషన్‌ రీత్యా చూసుకుంటే.. రత్నాలు- బంగారం నగల వ్యాపారులు కూడా భారీగానే నష్టపోయారు. అయినప్పటికీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ ట్రేడింగ్‌ బాగానే జరుగుతోంది. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు భారీగా పతనం అవుతున్న దశలోనూ బంగారం ధర ధగధగలాడటానికి ఇదొక్కటే కారణం. ఒకానొక దశలో అంతర్జాతీయంగా ఆల్‌ టైమ్‌ గరిష్టానికి కూడా బంగారం ధర చేరుకుంది. ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి రిటర్న్‌ రావచ్చునని మార్కెట్‌ నిపుణులు గట్టి హామీలే ఇస్తున్నారు. ఈ మాట మదుపరుల వీనులకు విందుచేస్తున్న మాట నిజం! సువర్ణావకాశం అంటే ఇదే మరి!


చివరాఖరిగా చెప్పొచ్చేదేమంటే.. ప్రస్తుతం బంగారు వర్తకులు పలు చిక్కు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అడ్వాన్స్‌ ట్యాక్స్‌, బంగారంపై తీసుకున్న రుణాల చెల్లింపులకు కాలం తీరిపోవడం, వడ్డీల భారం వంటివి వారికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల చెల్లింపులకి ఆరు నెలల గడువు పొడిగించేలా చర్యలు చేపట్టాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బంగారం లోన్లపై వడ్డీరేట్లను కనీసం 50 శాతం తగ్గించాలని కూడా కోరింది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.


బంగారానికే భరోసా ఇవ్వాల్సిన కాలం ఆసన్నమైంది. ఇదేమరి కరోనా వైరస్‌ మహిమ అంటే! కరోనా పీడ విరగడయ్యాక జువెలరీ షాపుల్లో మునుపటి సందడి కనిపిస్తుందో లేదో అన్న సందేహాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. అయితే మనవాళ్లకి బంగారం అంటే సెంటిమెంట్‌ కనుక.. ఆ సెక్టార్‌ త్వరలోనే కళకళలాడుతుందని ఆశిద్దాం. 

Updated Date - 2020-05-22T22:14:45+05:30 IST