లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఏది ముట్టుకోవాలన్నా భయమే!

ABN , First Publish Date - 2020-05-20T19:04:36+05:30 IST

కరోనా పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. అందరిలో కరోనా భయం అంతకంతకూ పెరుగుతోంది.

లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఏది ముట్టుకోవాలన్నా భయమే!

కరోనా పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. అందరిలో కరోనా భయం అంతకంతకూ పెరుగుతోంది. ఓసీడీ కేసులు పెరుగుతున్నాయి. క్యాబిన్‌ ఫీవర్‌, డిప్రెషన్‌ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామం పట్ల మానసిక వైద్య నిపుణులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ మెంటల్‌ హెల్త్‌పై కరోనా వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపుతోంది? దీనికి విరుగుడు మంత్రం ఏంటి? 


కరోనా ఇంకా ఎన్నాళ్లపాటు మానవాళిని పట్టిపీడిస్తుందో తెలియదు గానీ.. ఆ వైరస్‌ వల్ల మెంటల్‌ హెల్త్‌ సమస్యలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రాణాంతక కరోనాకి, మానసిక ఆరోగ్యానికి ఏమిటి సంబంధం అన్న సందేహం చాలామందికి రావచ్చు. కరోనా సోకుతుందేమో అనే భయాందోళనలు, లాక్‌డౌన్‌ కారణంగా రోజుల తరబడి ఇళ్లల్లోనే ఉండిపోవడం వంటి కారణాల వల్ల తలెత్తిన విపరీత ఆలోచనలు పలు మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల ఈ తరహా మనోవ్యాధులు బాగా పెరిగాయనీ, బాధితులు అధిక సంఖ్యలో కౌన్సెలింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారనీ మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. 


కరోనా సోకకుండా ఉండాలంటే చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్స్‌ వాడాలి. భౌతిక దూరం పాటించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు మోచేతులు అడ్డుపెట్టుకోవాలి. ఈ ప్రికాషన్స్‌ పాటిస్తే వైరస్‌ బారినుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చునని వైద్యనిపుణులు, ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. నిజానికి జలుబు, ఫ్లూ వంటివి సోకినవారు విధిగా ఈ సూచనలు పాటించాలని వాల్డ్‌హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఏనాడో చెప్పింది. నిన్నమొన్నటివరకూ ఈ మాటని ఎవరూ పెద్దగా కేర్‌ చేయలేదు. కరోనా విజృంభణ తర్వాత ఆ సీరియస్‌నెస్‌ అందరికీ బోధపడింది. ఈ హెల్త్‌ టిప్స్‌ని ఇప్పుడు అందరూ బుద్దిగా ఫాలో అవుతున్నారు. ముఖానికి మాస్క్‌ కూడా ధరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితే కొందరిని ఓసీడీ అనే జబ్బు బారిన పడేస్తోందని మానసిక నిపుణులు చెప్పుకొస్తున్నారు. 


చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాల్ని క్లీన్‌గా ఉంచుకోవడం అనే చర్యలు ఆహ్వానించదగ్గవే. ఎటొచ్చీ ఈ పనుల్నే అతిగా చేస్తేనే.. ఓసీడీ అంటారు. విపులంగా చెప్పాలంటే "అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌'' అన్న మాట! ఇదొక మనోవ్యాధి. ఆ మధ్య శర్వానంద్‌ నటించిన "మహానుభావుడు'' సినిమాని చాలామంది చూసే ఉంటారు! అందులో హీరోకి ఓసీడీ అనే జబ్బు పీక్‌లో ఉంటుంది. కొవిడ్‌- 19 ప్రికాషన్స్‌లో భాగంగా చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలన్న వైద్యుల సూచన కొందరిలో విపరీత పైత్యానికి దారితీస్తోందట. తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో కరోనా పొంచి ఉందని ఆందోళన చెందడం, ఇతరుల్ని దగ్గరకి రానివ్వకపోవడం, వారు తమని ముట్టుకుంటే వైరస్‌ వస్తుందని బెంబేలెత్తిపోవడం, ఏ వస్తువుని తాకాలన్నా భయపడటం, డోర్‌ హ్యాండిల్స్‌, ఫోన్‌, కాలింగ్‌ బెల్‌ స్విచ్‌, లిఫ్ట్‌ బటన్స్‌ వంటివాటిని అదే పనిగా తుడవడం, చేతుల్ని పదేపదే కడుక్కోవడం అనే ఓసీడీ లక్షణాలు ఇటీవల చాలామందిలో అధికంగా కనిపిస్తున్నాయట. ఈ జబ్బుకి గురైన వారిలో అనుమానం అనే పురుగు లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. వారి మెదడు నెగటివ్‌ థింకింగ్‌తో నిండిపోతుంది. ఫలితంగా తీవ్ర అసౌకర్యానికి, మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. కరోనా పరోక్ష ప్రభావంతో పెరుగుతున్న ఈ తరహా ఓసీడీ పేషెంట్లని ట్రీట్‌ చేయడం మెంటల్‌ హెల్త్‌ రంగానికి ఇప్పుడొక కొత్త ఛాలెంజ్‌!


కరోనా కారణంగా ప్రబలుతున్న మరో మానసిక సమస్య "డిప్రెషన్‌''! ఏదైనా బాధాకరమైన సందర్భమో, విషాదకర ఘటనలో సంభవించినప్పుడు అవి మనసుపై బలమైన ముద్రవేస్తాయి. అలాంటి బాధ లేదా విషాదం నుంచి కాలక్రమంలో కోలుకోవడం కూడా మానవ సహజం. అయితే కొందరు మాత్రం వాటినుంచి బయటపడకపోగా మరింత కుంగిపోతారు. బేలగా మారిపోతారు. నిరుత్సాహంతో నీరుగారిపోతారు. ఏ పనిలోనూ దృష్టిపెట్టలేరు. ఇవీ డిప్రెషన్‌ ప్రధాన లక్షణాలు! కరోనా విజృంభణ తర్వాత మన దేశంతోపాటు అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఐటీ సెక్టార్‌ వంటి కొద్ది శాఖల్లో మాత్రమే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగుతోంది. మిగతా అన్ని సెక్టార్లలో కార్యకలాపాలన్నీ పూర్తిగా బంద్‌! దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితే చాలామందిని డిప్రెషన్‌కి గురిచేస్తోంది. ఇలాంటి విపత్తు ఎందుకొచ్చిందా అని వారిలో ఒకటే టెన్షన్‌. బయటికి వెళదామంటే వీలుపడని పరిస్థితి. స్వేచ్ఛ కోల్పోయామన్న ఫీలింగ్‌. కనిపించని శత్రువు మీదపడి దాడిచేస్తున్నట్టుగా ఊపిరి సలపని ఉక్కిరిబిక్కిరి. ప్రస్తుత సమస్య నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియని అయోమయం. ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో అంతుబట్టదు. చిన్నచిన్న వ్యాపార సంస్థలు, ఏజెన్సీలు వంటివి లాక్‌డౌన్‌ నష్టాల వల్ల మూతపడే ప్రమాదం. ఆర్థిక సమస్యలు ఒకేసారి చుట్టుముడతాయని ఆందోళన చెందడం.. ఈ అంశాలన్నీ చాలామందిని డిప్రెషన్‌ అనే మానసిక వ్యాధిలోకి నెడుతున్నాయి. 


పోస్ట్‌ ట్రోమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్.. అంటే పీటీఎస్‌డీ వంటి మానసిక సమస్య ఇప్పుడు మన దేశంతోపాటు అనేక దేశాల్లో విపరీతంగా పెరుగుతోంది. తీవ్రమైన భయం, పీడకలలు, నెగటివ్‌ థాట్స్‌తో పానిక్‌ అటాక్స్‌ రావడం వంటి మానసిక లక్షణాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. ఈ తరహా వ్యాధిగ్రస్తులు "ఎప్పుడో చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాం'' అనుకుంటూ కుంచించుకుపోతుంటారు. వారి ఆలోచనల్లో హేతుబద్ధతకి ఆస్కారమే ఉండదు. ఇలాంటి సైకియాట్రీ డిజార్డర్‌తో బాధపడేవారిలో అన్ని వయసుల స్త్రీ పురుషులతోపాటు పిల్లలు కూడా అధికంగా ఉంటున్నారు. కరోనా తర్వాత పెరుగుతున్న మెంటల్‌ హెల్త్‌ సమస్యల్లో ఇది కూడా ఒకటి!


రోజుల తరబడి గృహఖైదు లేదా గృహనిర్బంధంలో మగవాళ్లు ఉండటం అనేది కొత్త పరిణామం. దీంతో వారిలో మనోవికారాలు శ్రుతిమించుతున్నాయి. అలాంటి మగవారు తీవ్ర అసహనంతో స్త్రీలపై భౌతిక దాడులకి తెగబడుతున్నారు. ఈ కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో 57 శాతం గృహహింస కేసులు పెరిగినట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు కూడా వేలసంఖ్యలో పెరిగాయి. పోలీసులు చెప్తున్న సంఖ్యకంటే ఈ తరహా ఘటనలు అనేక రెట్లు ఎక్కువ ఉండొచ్చని సామాజిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సమస్య కూడా మనోవ్యాధి ఫలితమే అని వారు చెబుతున్నారు. 


"క్యాబిన్‌ ఫీవర్‌'' అన్న మాటని మీరెప్పుడైనా విన్నారా? గృహనిర్బంధంలో ఉండేవారికి సోకే ఒకానొక మానసిక జబ్బు అది! రోజుల తరబడి కుటుంబ సభ్యులంతా ఒకే క్యాబిన్‌లో లేదా ఇంటిలో ఉండిపోవడం వల్ల కొందరిలో ఒకరకమైన ఉన్మాదం మొదలవుతుంది. ఇంట్లో నిర్వ్యాపకంగా ఉండిపోవడం, బయటికి వెళ్లలేకపోవడం, తినాలనుకున్నవి తినలేకపోవడం వంటి అంశాలు కొందరు మగవాళ్లను బాగా చికాకు పరుస్తాయి. భవిష్యత్తు కోసం రచించిన ప్రణాళికలన్నీ పేకమేడల్లా కూలిపోవడంతో తెలియని ఆవేశానికి లోనవుతారు. ఇలాంటి పరిణామాలే "క్యాబిన్‌ ఫీవర్‌'' అనే జబ్బుని ముదిరేలా చేస్తాయి. చిన్నపిల్లలపై ఊరికే అరవడం, చిన్నచిన్న విషయాలకే విపరీతంగా ప్రతిస్పందించడం, స్త్రీలని హింసించడం వంటివి ఈ జబ్బు లక్షణాల్లో కొన్ని. ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగింది!  


కరోనా వల్ల ఇంకా అనేక అంశాలు మన ముందుకి వచ్చాయి. ఆ వైరస్‌ సమసిపోయాక కూడా నార్మల్‌ పరిస్థితులు రాకపోవచ్చునని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని వారు "న్యూ నార్మల్‌''గా అభివర్ణిస్తున్నారు.   ఉదాహరణకి మొన్నటివరకు డిజిటల్‌ ఎకానమీని ఇష్టపడనివారు ఇప్పుడు అనివార్యంగా అదే తరహా ట్రాన్సాక్షన్‌ చేయక తప్పడం లేదు. కాన్ఫరెన్స్‌లు, ముఖాముఖి భేటీలు వంటివి చాలా మేరకు రద్దవుతున్నాయి. ఆ ప్లేస్‌ని వెబినార్స్‌ భర్తీ చేయబోతున్నాయి. వైద్యులు కూడా  వర్చువల్‌ క్లీనిక్స్‌ నిర్వహణ వైపు మొగ్గుచూపాల్సి రావొచ్చు. ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌, ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ఇకపై హెల్త్‌ సెక్టార్‌లో కీలకపాత్ర పోషిస్తాయని అంటున్నారు. ఇలాంటి అంశాలన్నీ ప్రజల మనసుపై బలమైన ముద్రనే వేస్తాయి. వీటిని స్వాగతించే వారు హాయిగానే ఉంటారనీ, స్వాగతించలేనివారు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు, మనోవ్యథకి గురవుతారనీ మానసిక విశ్లేషకుల చెబుతున్నారు. 


భవిష్యత్తులో మనదేశంలో మెంటల్‌ హెల్త్‌ అనేది ఫ్రంట్‌లైన్‌ ఫీల్డ్‌గా అవతరించబోతున్నది. కరోనా పోయినా.. దాని ప్రభావం మాత్రం మనల్ని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. మరో రెండేళ్ల పాటు ఆరోగ్య జాగ్రత్తలు, సోషల్‌ డిస్టెన్సింగ్‌ వంటివి తప్పవంటున్నారు. ఈ తరుణంలో అన్ని సెక్టార్ల వారిలో ఒక రకమైన మానసిక సంఘర్షణ ఏర్పడటం సహజం. ఉదాహరణకి అల్లోపతి వైద్యరంగాన్నే తీసుకుందాం. కరోనా పేషెంట్లకి ట్రీట్‌మెంట్‌ ఇచ్చే క్రమంలో డాక్టర్లు, నర్సులకి కూడా మానసిక ఒత్తిడి పెరగవచ్చు. వారికి కూడా కౌన్సెలింగ్స్‌ అవసరమవుతుందని మెంటల్‌ హెల్త్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అంటే కరోనా వల్ల తలెత్తిన సమస్యల్ని కొన్నేళ్లపాటు డీల్‌చేయాల్సి ఉంటుందన్న మాట!


వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండొచ్చు. ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయాం. మానసికంగా శాంతి కరువైంది. వ్యక్తుల ముఖాల్లో ఆనందపు ఛాయలు కరువవుతున్నాయి. మానవ సంబంధాలకి నిర్వచనం మారే పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఉరుకులు- పరుగుల జీవితమాయె! ఈ నేపథ్యంలో సగటు మనిషిలో మానసిక ఒత్తిడి అనేక రెట్లు పెరగడం ఖాయం. ఈ స్థితి కూడా మానసిక ఆరోగ్యానికి చేటు తెస్తుందని అంటున్నారు.


కరోనా వల్ల తలెత్తిన మానసిక సమస్యలతో బాధపడేవారు ఆ సమస్యలను స్వేచ్ఛగా ఇతరులతో పంచుకుంటే ఆ బరువు కొంతైనా తీరుతుంది. అప్పటికీ ఆ మనోవ్యథ తీరకపోతే తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి. తగిన చికిత్సలు తీసుకోవాలి. ఒకవేళ బిడియం అడ్డొస్తే... ఫ్రీ హెల్ప్‌లైన్స్‌ ఉన్నాయి. వాటికి ఫోన్‌ చేసి కూడా సలహాలు తీసుకోవచ్చు. మానసిక ప్రశాంతతే ఏ మనిషికైనా ముఖ్యం. అది లేకపోతే బతుకంతా దుర్భరం. ఈ జీవిత సత్యాన్ని మళ్లీ మనకి గుర్తుచేసింది మాత్రం కరోనా వైరస్సే అని చెప్పక తప్పదు!  

Updated Date - 2020-05-20T19:04:36+05:30 IST